
సుప్రీంకోర్టులో మంగళవారం ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. విడాకుల కోసం ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ బి.ఆర్.గవాయి ఆ మహిళను ఉద్దేశించి వేసిన ప్రశ్నలు.. ఆ మహిళ ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి...
చీఫ్ జస్టిస్: మీ డిమాండ్ (భరణం) ఏమిటి?
మహిళ: ముంబైలోని ఇల్లు, అన్ని రకాల ఖర్చుల నుంచి విముక్తి, మెయిన్‌టెన్స్ కోసం రూ.12 కోట్లు.
చీఫ్ జస్టిస్: ‘‘... కానీ ఆ ఇల్లు కల్పతరులో ఉంది. ఒకానొక మంచి బిల్డర్‌ది. మీరేమో ఐటీ పర్సన్. ఎంబీఏ కూడా చేశారు. మీలాంటి వాళ్లకు డిమాండ్ ఉంది.. బెంగళూరు హైదరాబాద్‌లలో.. మీరెందుకు ఉద్యోగం చేయకూడదు?’’ ‘‘పెళ్లయిన తరువాత మీ దాంపత్యం 18 నెలలు సాగింది... ఇప్పుడు మీకు బీఎండబ్ల్యూ కూడా కావాలా?’’ పద్దెనిమిది నెలల వైవాహిక జీవితానికి నెలకొ రూ.కోటి చొప్పున కావాలా?’’
మహిళ: కానీ అతడు బాగా ధనవంతుడు. నాకు స్కిజోఫ్రెనియా ఉందని, వివాహం రద్దు చేయాలని అతడే కోరాడు.
సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ (భర్త తరఫు న్యాయవాది): ఆమె కూడా ఉద్యోగం చేయాలి. అన్నీ ఇలా డిమాండ్ చేయడం సరికాదు.
మహిళ: మైలార్డ్ నేను స్కిజోఫ్రెనియా బాధితురాలి మాదిరిగా కనిపిస్తున్నానా?
చీఫ్ జస్టిస్: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయండి. అయితే ఒకటి అర్థం చేసుకోండి. మీరు అతడి తండ్రి ఆస్తి కోరలేరు!(విచారణ ఇంకా కొనసాగుతోంది..)