సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్ని రంగాల్లోనూ గొప్పగా రాణిస్తున్న మహిళలు
న్యాయ వ్యవస్థలోకి కూడా వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుదల
ఇది దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ పురోగతికి నిదర్శనం.. హక్కులపై అవగాహన ఉన్నప్పుడే న్యాయం సాధ్యం
మన రాజ్యాంగం వల్లే అణగారిన వర్గాల వారికి ఉన్నత అవకాశాలు.. ఇందుకు ప్రస్తుత రాష్ట్రపతి, నేనే ప్రత్యక్ష ఉదాహరణ
మన రాజ్యాంగం స్థిర రాజ్యాంగం కాదు.. పరిస్థితులకు అనుగుణంగా మార్పు
ఒక వ్యవస్థ మరో వ్యవస్థలో ఏ రకంగానూ జోక్యం చేసుకోకూడదు
ఒకవేళ జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యం పేకమేడలా కూలిపోతుంది
న్యాయ, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం ఎంతో అవసరం
దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మనందరం కట్టుబడి ఉండాలి
భారత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ ఓ స్థిర పత్రంలా చూడలేదు. దేశంలో పరిస్థితులు, సమాజ మార్పులకు అనుగుణంగా మారుతూ ఉండాలని ఆకాంక్షించారు. అందులో భాగంగానే మన రాజ్యాంగానికి సవరణలు చేస్తూ వస్తున్నాం. దేశ పౌరుల హక్కులకు విఘాతం కలిగినప్పుడు కోర్టులను ఆశ్రయించే అవకాశం ఇచ్చింది మన రాజ్యాంగమే. ఈ నేపథ్యంలో న్యాయ, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మనందరం కట్టుబడి ఉండాలి.
– సీజేఐ జస్టిస్ గవాయ్
సాక్షి, అమరావతి: సమానత్వం, మహిళా సాధికారత దిశగా దేశం పురోగమిస్తోందని, అన్ని రంగాల్లో మహిళలు గొప్పగా రాణిస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు. న్యాయ వ్యవస్థలోకి వచ్చే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, కింది స్థాయి న్యాయ వ్యవస్థలో మహిళా న్యాయాధికారుల సంఖ్య 60–70% ఉండటం సమానత్వానికి, మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. ఇది దేశ ప్రగతికి శుభ సూచకమని.. దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ పురోగతిని సైతం సూచిస్తోందని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆదివారం విజయవాడలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ గవాయ్ ప్రధానోపన్యాసం చేశారు. ప్రజలకు తమ హక్కులపై అవగాహన ఉన్నప్పుడే వాటిని పొందడం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే పౌరులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించే గొప్ప అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందన్నారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగించే సమయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాట్లాడిన మాటలు ప్రతి న్యాయ విద్యార్థికి కంఠోపాఠం కావాలని తెలిపారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని ఓ స్థిర పత్రంలా చూడలేదని.. పరిస్థితులు, సమాజ మార్పులకు అనుగుణంగా మారుతూ ఉండాలని ఆకాంక్షించారన్నారు. అందులో భాగంగానే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన భారత రాజ్యాంగానికి సవరణలు చేస్తూ వస్తున్నామని, అంబేడ్కర్ సైతం ఇదే ఆశించారని తెలిపారు.
మన రాజ్యాంగం వల్లే అణగారిన వర్గాలకు అవకాశాలు
రాజ్యాంగంలో పేర్కొన్న వ్యవస్థలు ఒక దాంట్లో ఒకటి జోక్యం చేసుకోరాదని, ఒకవేళ జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యం పేక మేడలా కూలిపోతుందని జస్టిస్ గవాయ్ తెలిపారు. మన రాజ్యాంగం వల్లే ఈ దేశంలో అణగారిన వర్గాల వారు ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారన్నారు. ఇందుకు ప్రస్తుత రాష్ట్రపతి, తానే ప్రత్యక్ష ఉదాహరణ అని స్పష్టం చేశారు. గతంలో కేఆర్ నారాయణన్, రామ్‌నాథ్ కోవింద్‌లు రాష్ట్రపతులుగా పనిచేశారని, ఎస్సీ అయిన బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా పని చేశారన్నారు.
ఓ ఛాయ్‌వాలా కూడా ఈ దేశ ప్రధాని కాగలిగారంటే అందుకు రాజ్యాంగమే కారణమని ప్రస్తుత ప్రధాన మంత్రి చెప్పారని గుర్తు చేశారు. మొదట దేశమే ముఖ్యమని, దేశ గతి కన్నా ఏదీ, ఎవరూ ముఖ్యం కాదని అంబేడ్కర్ చాలా స్పష్టంగా చెప్పారన్నారు. తాను పుట్టిన అమరావతి (మహారాష్ట్రలో ఉంది) నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రావడం యాధృచ్చికమన్నారు. తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినప్పుడు మొదట అమరావతికే వెళ్లానని, ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్న వేళ మళ్లీ అమరావతికే వచ్చానని చెప్పారు.
సమానత్వం కాగితాలకు పరిమితం కారాదు
పరిష్కారాలు చూపకుండా హక్కులు కల్పించినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదని అంబేడ్కర్ గట్టిగా వాదించారని జస్టిస్ గవాయ్ తెలిపారు. హక్కులకు విఘాతం కలిగినప్పుడు పౌరులు కోర్టులను ఆశ్రయించే అవకాశం అలానే వచ్చిందన్నారు. ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణకే రాజ్యాంగ సవరణలు చేస్తూ వస్తున్నామని చెప్పారు. సమానత్వమే అన్నింటి కన్నా సర్వోత్కృష్టమైనదన్నారు. సమానత్వం కేవలం కాగితాలకే పరిమితం కారాదన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్‌లతో పాటు ఇతర ఉన్నతాధికారుల పిల్లలకు మంచి విద్యను అభ్యశించే అవకాశం ఉంటుందని, అదే ఓ పేద రైతు బిడ్డకు ఆ అవకాశం ఉండదని చెప్పారు. అందుకే తాను రిజర్వేషన్ల కల్పనలో క్రిమిలేయర్‌ను ప్రామాణికంగా చేసుకోవాలని ఎస్‌సీ ఉప వర్గీకరణ తీర్పులో స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారు. హక్కులు, మహిళా సాధికారిత కోసం జ్యోతిరావు పూలే, సావిత్రీ బాయి ఎంతో పాటుపడ్డారన్నారు.
జ్యోతిరావు పూలేను అంబేడ్కర్ తన గురువుగా భావించారని తెలిపారు. న్యాయ, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం ఎంతో అవసరమని, ఇప్పుడు దేశం ఆ దిశగా పయనిస్తోందని చెప్పారు. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మనందరం కట్టుబడి ఉండాలని, ఇందుకు అందరం ప్రతిజ్ఞ చేయాలన్నారు. ప్రజాస్వామ్యం మరింత గొప్ప స్థాయికి చేరాలంటే మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
సాధించిన మైలు రాళ్లు ఎంతో గర్వ కారణం
హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, దశాబ్దాల కాలంగా పలు రంగాల్లో మనం ఎన్నో మైలు రాళ్లు సాధించామని, ఇది మనకు ఎంతో గర్వకారణమని చెప్పారు. మన రాజ్యాంగం మన దేశాన్ని కొత్తగా ఆవిష్కరించిందన్నారు. దేశ ఐక్యత, సార్వభౌమత్వానికి రాజ్యాంగం ప్రతీక అన్నారు. అణగారిన వర్గాలకు, మైనారిటీలు, వెనుకబడిన తరగతులకు రాజ్యాంగం ఎన్నో రక్షణలను కల్పించిందని చెప్పారు. ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించడమే కాకుండా, దాన్ని సదా పరిరక్షిస్తుండాలని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జస్టిస్ గవాయ్ ఎంతో గొప్ప మానవతా వాది అన్నారు. సమానత్వాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపించే వ్యక్తి అని తెలిపారు. ఆయన ఇచ్చిన పలు తీర్పులు చిరస్థాయిగా నిలచిపోతాయన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ, మీడియా అనేవి నాలుగు మూల స్థంభాలని.. వీటి వల్లే మన దేశం ఉత్తమమైన ప్రజాస్వామ్య దేశంగా నిలబడిందని చెప్పారు. అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం కూడా మాట్లాడారు.
జస్టిస్ గవాయ్‌కి ఘన సన్మానం
కార్యక్రమంలో చివరగా జస్టిస్ గవాయ్‌ని హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యవర్గం ఘనంగా సన్మానించింది. వేంకటేశ్వరస్వామి జ్ఞాపికలు బహూకరించింది. రాష్ట్ర న్యాయాధికారుల సంఘం కూడా ఆయన్ను సత్కరించి, గౌతమ బుద్దుని జ్ఞాపికను అందించింది. విజయవాడ, గుంటూరు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు కూడా సత్కరించి పుష్పగుచ్ఛాలు అందించారు. బార్ కౌన్సిల్ సభ్యుడు బీవీ కృష్ణారెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు కేవీ రఘువీర్‌లు జస్టిస్ గవాయ్‌ని గజ మాలతో సన్మానించారు.
హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబోధ్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు, హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబోధ్, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, పలువురు సీనియర్ న్యాయవాదులు, జిల్లా జడ్జీలు, న్యాయాధికారులు, న్యాయవాదులు, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు.


