న్యూఢిల్లీ: భారత సర్వోన్నత న్యాయస్థానంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎంపిక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గురువారం మొదలుపెట్టింది. నవంబర్ 23వ తేదీన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో నూతన సీజేఐ ఎంపిక ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. తదుపరి సీజేఐగా మీరు ఎవరిని సిఫార్సు చేస్తారో తెలపాలంటూ ప్రభుత్వం నుంచి అధికారిక లేఖ గురువా రం లేదా శుక్రవారం లోపు జస్టిస్ బీఆర్ గవాయ్‌కు చేరుకోనుందని విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి.
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తి ఎంపిక ప్రక్రియలో ఇదే విధానాన్ని అమలుచేస్తుండటం తెల్సిందే. సీజే దిగిపోయాక ఆయా కోర్టుల్లో అత్యంత సీనియర్ జడ్జీనే సీజేగా సిఫార్సుచేసే సంప్రదాయం కొనసాగుతోంది. ఇదే విధానాన్ని పాటిస్తూ కేంద్ర న్యాయ శాఖ సీజేఐకి కొత్త సీజేఐ ఎంపిక కోసం తగు గడువు ఇచ్చే అవకాశముందని సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి.
ప్రస్తుత సీజేఐకి 65 ఏళ్లు పూర్తికావడానికి ఒక నెలముందే ఆయనకు తదుపరి సీజేఐ కోసం సిఫార్సు లేఖ పంపడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం సీజేఐ తర్వాత సుప్రీంకోర్టు జడ్జీల్లో అత్యంత సీనియర్ మోస్ట్‌గా జస్టిస్ సూర్యకాంత్ కొనసాగుతున్నారు. తదుపరి సీజేఐ అయ్యే అవకాశాలు ఈయనకే మెండుగా ఉన్నాయి. జస్టిస్ సూర్యకాంత్ హరియాణాలోని హస్సార్ జిల్లాలో ఓ మధ్యతరగతి కుటుంబంలో 1962 ఫిబ్రవరి 10న జని్మంచారు. 2019 మే 24న సుప్రీంకోర్టులో జడ్జిగా పదోన్నతి పొందారు. ఈయన సీజేఐ అయితే దాదాపు 15 నెలలపాటు సేవలందించి 2027 ఫిబ్రవరి 9వ తేదీన రిటైర్ అవుతారు.


