లేదంటే కొందరికే ప్రయోజనాలు
అప్పుడు వాటి లక్ష్యమే నెరవేరదు
జస్టిస్ బి.ఆర్. గవాయ్ వ్యాఖ్యలు
కొలీజియం భేష్ అంటూ కితాబు
ఇకపై ఏ పదవీ చేపట్టబోనని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న(క్రీమీలేయర్) వర్గాలను ఎస్సీ కోటా నుంచి తప్పించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ అభిప్రాయపడ్డారు. ‘ఒకసారి కోటా ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పొందిన కుటుంబాలే వాటిని మళ్లీ మళ్లీ పొందుతుండటం సరికాదు. దీనివల్ల ఒక సామాజికవర్గంలోనే ఆర్థికంగా, సామాజికంగా బలోపేతంగా మారిన ఇలాంటి మరో సామాజికవర్గం పురుడు పోసుకుంటుంది. అందుకే, రిజర్వేషన్ల ఫలాలు నిజంగా అర్హత ఉన్నవారికి మాత్రమే అందాలి’ అంటూ కుండబద్దలు కొట్టారు.
ఇలాంటి అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంటు మాత్రమేనని జస్టిస్ గవాయ్ గుర్తుచేశారు. పదవీ విరమణ నేపథ్యంలో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. తాను పూర్తి సంతృప్తితో వెళ్తున్నట్టు చెప్పారు. రిటైర్మెంట్ అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి పదవులూ చేపట్టోబోనని స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా తనపై బూటు విసిరిన ఉదంతంతో పాటు కోర్టుల్లో పేరుకున్న పెండింగ్ కేసులు, రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధింపును తప్పుబడుతూ తన సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తాజా తీర్పుపై వచి్చన విమర్శల పైనా మాట్లాడారు.
కొలీజియం సూపర్
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి అనుసరిస్తున్న అత్యంత వివాదాస్పదమైన కొలీజియం వ్యవస్థను జస్టిస్ గవాయ్ గట్టిగా సమరి్థంచారు. ‘‘కొలీజియంతో పాటు నిజానికి ఏ వ్యవస్థా పూర్తిగా లోపరహితం, పరిపూర్ణం కాదు. న్యాయవ్యవస్థ స్వతంత్ర మనుగడకు కొలీజియం పద్ధతి అత్యావశ్యకం’’అని అభిప్రాయపడ్డారు. ‘ఇలా న్యాయమూర్తులే తోటి న్యాయమూర్తులను నియమించుకోవడం ఏమిటంటూ విమర్శలుండటం నిజమే.
కానీ ఆ నియామకాల్లో కేంద్ర నిఘా వర్గాల నివేదికలు, కార్యనిర్వాహక విభాగం అభిప్రాయాలు తదితరాలను కొలీజయం పరిగణనలోకి తీసుకుంటుందని మర్చిపోరాదు’అని గుర్తు చేశారు. అసెంబ్లీ పంపే బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధిస్తూ ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచి్చన తీర్పును తన సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం తప్పుబట్టడంపై చెలరేగిన విమర్శలకూ జస్టిస్ గవాయ్ బదులిచ్చారు. ‘వారికి న్యాయస్థానాలు డెడ్‌లైన్లు పెట్టేందుకు రాజ్యాంగంలో అనుమతి లేదు. మితిమీరిన జాప్యం చేస్తే న్యాయసమీక్షకు అవకాశముందని పేర్కొన్నాం’’అని గుర్తు చేశారు.
మహిళా జడ్జిని నియమించలేకపోయా!
సీజేఐగా తన పదవీకాలంలో సుప్రీంకోర్టుకు ఒక్క మహిళా జడ్జిని కూడా నియమించలేకపోవడం పట్ల అసంతృప్తిగా ఉందని సీజేఐ జస్టిస్ గవాయ్ తెలిపారు. అయితే దానికి కారణం చిత్తశుద్ధి లేమి మాత్రం కాదని స్పష్టం చేశారు. అలా ఆమోదం తెలిపేందుకు ఒక్క మహిళ పేరు కూడా పరిశీలనకు రాలేదని వివరించారు. సామాజిక సేవ చేపట్టే అవకాశముందా అని విలేకరులు ప్రశ్నించగా, అది తన రక్తంలోనే ఉందని ఆయన బదలుచ్చారు. జస్టిస్ గవాయ్ తండ్రి రామకృష్ణ ఎస్ గవాయ్ ప్రముఖ సామాజికవేత్త అన్నది తెలిసిందే. కోర్టుల్లో పెండింగ్ కేసుల పరిష్కారానికి ఏఐ సాంకేతికను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు తాను ఎన్నో చర్యలు చేపట్టానని గుర్తు చేశారు.
విభేదించాల్సిన పని లేదు
న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పని చేస్తోందని నిరూపించుకునేందుకు ప్రభుత్వాల ప్రతి నిర్ణయానికీ వ్యతిరేకంగా తీర్పులివ్వాలన్న అభిప్రాయంతో జస్టిస్ గవాయ్ విభేదించారు. విష్ణుమూర్తిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశానంటూ సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా తనపై చెప్పు విసరిన వృద్ధ లాయర్‌ను క్షమించాలన్న నిర్ణయం వెనక కారణాలను మరోసారి ఆయన చెప్పుకొచ్చారు. ‘‘బçహుశా చిన్నతనం నుంచీ నాకు అలవడ్డ ఆలోచనా ధోరణే అందుకు కారణం కావచ్చు. అలాంటి వాటిని పట్టించుకోకపోవడమే మంచిదన్నది నా ఉద్దేశం’’అన్నారు. కోర్టు విచారణలను సోషల్ మీడియా వేదికలు దుర్వినియోగం చేస్తుండటం ఆందోళనకరమని జస్టిస్ గవాయ్ అన్నారు.


