
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తొలగించాలంటూ వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు యూటర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. చాలామంది ఈ తీర్పును సమర్థించగా.. కొన్ని వర్గాల నుంచి మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో..
ఈ అంశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ముందు కొందరు న్యాయవాదులు లేవనెత్తారు. అయితే అభ్యంతరాల నేపథ్యంలో ఆ తీర్పును పునపరిశీలిస్తానని బుధవారం స్పష్టం చేశారు. దీంతో తీర్పు వెనక్కి తీసే అవకాశాలు ఉండొచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు.
రాజధాని రీజియన్‌లో పసికందులు, వృద్దులుపై వీధి కుక్కల దాడుల ఘటనలపై పలు మీడియా సంస్థలు ఇచ్చాయి. అందులో ఘటనలతో పాటు రేబిస్ బారిన పడి మరణించిన దాఖలాలను ప్రస్తావించాయి. ఈ కథనాలను సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.
వీధి కుక్కలను నివాస ప్రాంతాల్లో సంచరించడం ఏమాత్రం యోగ్యం కాదని, వాటిని పట్టుకుని షెల్టర్లకు తరలించాలని, ఇందుకు 8 వారాల గడువు విధిస్తూ ఢిల్లీ సర్కార్‌కు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం (ఆగస్టు 11వ తేదీ) ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో..
ఏదైనా సంస్థలు ఈ చర్యలను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఇది ప్రజల మేలు కోసం చేస్తున్నది స్పష్టం చేసింది. అయితే వీధి కుక్కల కోసం షెల్టర్లు నిర్మించడం, తరలించడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చని ఢిల్లీ అధికార యంత్రాంగం అంటోంది. అదే సమయంలో రాజకీయ, సినీ, ఇతర ప్రముఖుల నుంచి సుప్రీం కోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.