నిందితునికి అర్థమయ్యే భాషలో రాతపూర్వకంగా వివరించాలి
ఏ నేరం, చట్టం కింద అరెస్ట్ చేస్తున్నారో స్పష్టం చేయాలి
అరెస్ట్‌లపై కీలక తీర్పు వెలువర్చిన సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: ఆగమేఘాల మీద అరెస్ట్‌లు జరిగిపోయే భారత్‌లో ఇకమీదట నిందితులకు అరెస్ట్ కారణాలు, కేసులో పొందుపరిచిన చట్టాల చిట్టాను విడమర్చి చెప్పాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అరెస్ట్ అయిన ప్రతి ఒక్క వ్యక్తికి తనను ఎందుకు అరెస్ట్ చేశారో, ఆ కేసులో ఏమేం రాశారో, ఎలాంటి చట్టాలను పేర్కొన్నారో, ఏ నేరాలను పొందుపరిచారో అతనికి అరెస్ట్ సమయంలోగానీ అరెస్ట్ చేసిన తక్షణంగానీ తెలియజేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువర్చింది.
గత ఏడాది ముంబైలో జూలైలో ఢీకొట్టి ఖరీదైన బీఎండబ్ల్యూతో పారిపోయిన ఘటనలో నమోదైన ఉదంతానికి సంబంధించి మిహిర్ రాజేశ్ షా, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య నడిచిన కేసులో తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసీహ్‌ల ధర్మాసనం ఈ కీలక తీర్పును ఇచ్చింది.
వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాథమిక రక్ష ఇది
ధర్మాసనం తరఫున 52 పేజీల తీర్పును జస్టిస్ అగస్టీన్ రాశారు. ‘‘రాజ్యాంగంలోని 22(1) అధికరణం ప్రకారం ఎవరినైతే పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు అరెస్ట్‌చేస్తాయో వాళ్లకు వీలైనంత త్వరగా అరెస్ట్‌కు కారణాలను వివరించాలి. ఇది ఇన్నాళ్లూ తప్పనిసరిగా అవలంభించాల్సిన విధానం కాదుగానీ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక రక్షణగా నిలుస్తుంది. అరెస్ట్ అయిన నిందితునికి అతను అర్థంచేసుకునే భాషలో రాతపూర్వకంగా కేసు వివరాలను తెలియజేయాలి.
ఏ నేరానికిగాను ఏ చట్ట నిబంధనల మేరకు అరెస్ట్‌చేయాల్సి వచ్చిందో నిందితునికి వెంటనే చెప్పాలి. అయితే అరెస్ట్ చేసిన రెండు గంటల్లోపే అతడిని రిమాండ్ నిమిత్తం మేజి్రస్టేట్ ఎదుట హాజరుపర్చగలిగితే మాత్రం నిందితునికి ముందే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మేజి్రస్టేట్ ముందుకు తీసుకెళ్లలేని సందర్భాల్లో ఇవన్నీ చెప్పకపోతే మాత్రం అతని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లినట్లే.
ఒక నిందితుడిని ఒకటి కంటే ఎక్కువ కేసుల్లో అరెస్ట్‌చేస్తే ఆ అన్ని కేసుల్లో పొందుపరిచిన చట్టాలు, సెక్షన్లు, నేరాల చిట్టాను అతనికి వివరించాలి. వాటిని నిందితునికి అర్థమయ్యే భాషలో రాతపూర్వకంగా అందివ్వాలి. పాత భారతశిక్షా స్మృతి 1860 లేదా కొత్త భారతీయ న్యాయసంహిత,2023 చట్టం ప్రకారం చూసినా అరెస్ట్ అయిన వ్యక్తికి అరెస్ట్‌కు కారణాలను వెల్లడించాలని రాజ్యాంగమే ఉద్భోధిస్తోంది’’ అని ధర్మాసనం వివరించింది.
కనీసం మౌఖికంగానైనా వివరించాలి
‘‘అరెస్ట్ చేసిన ప్రాంతంలో ఇలా అరెస్ట్‌కు కారణాలు లిఖితపూర్వకంగా వెల్లడించేందుకు పెన్ను, పేపర్ లాంటి ఏర్పాట్లు లేకపోతే సంబంధిత దర్యాపు అధికారి/పోలీసు కనీసం మౌఖికంగా నిందితునికి అరెస్ట్ కారణాలను తెలపాలి. మేజి్రస్టేట్ వద్దకు తీసుకెళ్లని పక్షంలో అతనికి వివరాలు చెప్పకపోతే అలాంటి అరెస్ట్/రిమాండ్‌కు చట్టబద్ధత లేదని భావించాలి. అప్పుడు నిందితుడిని వదిలేయడమే ఉత్తమం.
మా తీర్పు ప్రతిని అన్ని రాష్ట్రాల హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్‌కు, అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించండి’’ అని రిజిస్ట్రీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ‘‘ అసాధారణ కేసుల్లోనూ తప్పనిసరిగా కేసు వివరాలను నిందితునికి చెప్పాల్సిందే. లేదంటే ఆ అరెస్ట్‌కు చట్టబద్ధత లేనట్లే భావించాలి. అరెస్ట్ వేళ రాతపూర్వకంగా అతనికి ఇచి్చన సమాచారాన్ని అతను అర్థంచేసుకోలేకపోతున్నాడంటే అతని రాజ్యాంగంలోని 22వ అధికరణం ఉల్లంఘనకు గురైనట్లే.
అతనికి అర్థంకాని భాషలో సమాచారం ఇచ్చినా అది అతనికున్న రాజ్యాంగబద్ధ రక్షణను ఊహాత్మకంగా మార్చినట్లే. అది రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21, 22ల్లోని వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లే’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అరెస్ట్ చేసినప్పుడు తనకు కారణాలను చెప్పలేదంటూ నిందితుడు మిహిర్ బాంబే హైకోర్టులో కేసు వేశాడు. అయితే కారణాలను తెలపకపోవడం అనేది విధానపర తప్పిదమని ఒప్పుకున్న హైకోర్టు.. ఆ కేసు తీవ్రత దృష్ట్యా అరెస్ట్ సహేతుకమేనని తీర్పు చెప్పిన విషయం విదితమే.


