చిలకలూరిపేట రోడ్డు ప్రమాద ఘటనతో వెలుగులోకి.. నలుగురి అరెస్ట్.. 20 కార్లు స్వాధీనం
నరసరావుపేట రూరల్: నకిలీ కార్ల ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి 20 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. సోమవారం నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేకరులకు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 12న విజయవాడకు చెందిన పుల్లా శ్రీనివాసరెడ్డి తన కారును నకరికల్లుకు చెందిన పుల్లంశెట్టి అంజినాయుడు వద్ద తాకట్టు పెట్టగా, అసలు, వడ్డీ చెల్లించినా కారు తిరిగి ఇవ్వకుండా నంబర్ ప్లేట్‌ను మార్చి తిరుగుతున్నట్లు నరసరావుపేట రూరల్ స్టేçషన్‌లో ఫిర్యాదు అందిందన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అంజినాయుడు ఇచ్చిన సమాచారంతో నకరికల్లు మండలం నర్సింగపాడుకు చెందిన పుల్లంశెట్టి భానుప్రకాష్ , గురజాలకు చెందిన షేక్ మహమ్మద్ రఫీ, హైదరాబాద్‌కు చెందిన మధ్యాహ్నపు మోహన సత్యశ్రీనివాస్‌లు రావిపాడు రోడ్డు చెక్‌పోస్ట్ వద్ద 3 కార్లు తీసుకుని విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
విచారణలో 3 కార్లకు ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో వాటిని సీజ్ చేశామన్నారు. నిందితులను విచారించగా.. ఫైనాన్స్ సంస్థలకు బకాయిలు ఎగ్గొట్టేందుకు నంబర్ ప్లేట్లు మార్చినట్లు నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు. ఈ విధంగా తాకట్టు పెట్టుకునే క్రమంలో ఒక ముఠాగా ఏర్పడి పలు ఫైనాన్స్ సంస్థల నుంచి 20 కార్లను తీసుకున్నట్లు తెలిపారు. ఆయా కార్లకు నెలవారి కిస్తీలు చెల్లించకుండా నంబర్ ప్లేట్లు మార్చి అద్దెకు తిప్పుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. దీంతో పాటు కొందరు యజమానుల నుంచి కార్లను తాకట్టు రూపంలో తీసుకుని అసలు, వడ్డీ చెల్లించినా కార్లు తిరిగి ఇవ్వకుండా బెదిరించి బలవంతపు అగ్రిమెంట్లు తీసుకున్నారన్నారు. ఆ విధంగా 20 కార్లను తీసుకుని కొన్నిటికి నంబర్లు మార్చి, మరికొన్నిటికి ఫైనాన్స్ ఎగొట్టారని తెలిపారు. ఒక వాహనానికి రిజి్రస్టేషన్ నంబర్‌ను మరొక వాహనానికి మార్చారని చెప్పారు.
వెలుగులోకి వచ్చిందిలా..
చిలకలూరిపేట బైపాస్ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి కేసులో నిందితులు వినియోగించిన కారుపై విచారణ జరపడంతో నకిలీ కార్ల వినియోగం వెలుగు చూసింది. నకిలీ కార్ల కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేయగా మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్పీ చెప్పారు. నకరికల్లు గ్రామానికి చెందిన పొనుగంటి రామకృష్ణ అలియాస్ ఆర్‌కే, హైద్రాబాద్‌కు చెందిన భానుప్రకాష్ గౌడ్, వైజాగ్‌కు చెందిన వర్మ, నరసరావుపేటకు చెందిన ఏఎస్‌ఐ కుమారుడు మదమంచి వెంకట అనుజ్ఞనాయుడు, పుల్లంశెట్టి మహేష్ బాబులను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. నిందితులకు కార్లకు సంబందించిన నకిలీ డాక్యుమెంట్లు అందించడంలో ప్రకాష్ గౌడ్, సత్యశ్రీనివాస్, వర్మలు సహకరించారని తెలిపారు. ఇద్దరు పోలీసు అధికారులు కూడా గతంలో నిందితుల నుంచి వాహనాలు కొనుగోలు చేసినట్టు విచారణలో తెలిసిందన్నారు. ఆ వాహనాలను అప్పుడే సదరు ఫైనాన్స్ సంస్థకు అప్పగించినట్టు తెలిపారు.


