ప్రమాదంలో ఆరావళి పర్వతాల మనుగడ
100 మీటర్లు మించితేనే గుట్టలు: సుప్రీం
ప్రమాదకరమైన తీర్పు: పర్యావరణవాదులు
90 శాతం ఆరావళి త్వరలో మటుమాయమే
ఉత్తరాది ఎడారైపోతుందంటూ హెచ్చరికలు
ఒకసారి కాలంలో ఓ 300 కోట్ల ఏళ్లు వెనక్కి వెళ్లి, అంతరిక్షం నుంచి ప్రస్తుత భారతదేశాన్ని ఒక్కసారి చూస్తే? ఉత్తర ప్రాంతంలో కన్పించే ఏకైక భౌగోళిక స్వరూపం ఏమిటో తెలుసా? ఆరావళీ పర్వత శ్రేణులు! భూమిపై అత్యంత పురాతన పర్వతాల్లో ఒకటిగా అది గుర్తింపు పొందింది. కానీ, వందలాది కోట్ల ఏళ్లుగా అతి కఠినమైన కాలపరీక్షకు తట్టుకుని మరీ ఉనికిని కాపాడుకుని నిలిచిన ఆరావళీ శ్రేణులు మనిషి పేరాశ పాలిట పడి త్వరలోనే ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి.
వాటి పరిరక్షణకు తాము చిరకాలంగా చేస్తున్న ప్రయత్నాలకు సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పు గొడ్డలిపెట్టుగా మారిందని పర్యావరణవేత్తలు వాపోతున్నారు. ‘‘ఫలితంగా పంజాబ్, హరియాణా మొదలుకుని దేశ రాజధాని ఢిల్లీ దాకా ఆరావళి శ్రేణులు చూస్తుండగానే గనులుగా, రియల్ వెంచర్లుగా మారిపోవడం ఖాయం. అదే జరిగితే థార్ ఎడారి అడ్డూ అదుపూ లేకుండా విస్తరిస్తుంది. దాంతో ఉత్తరాదిలో చాలా భాగం అతి త్వరలోనే ఎడారిగా మారిపోతుంది’’అని హెచ్చరిస్తున్నారు! ఆరావళి.
గుజరాత్ మొదలుకుని ఢిల్లీ దాకా 650 కిలోమీటర్ల పై చిలుకు విస్తరించిన పర్వత శ్రేణులు. ఉత్తరాదిని అన్నివిధాలా పెట్టని కోటలా కాపాడుకుంటూ వస్తున్నాయి. థార్ ఎడారి తూర్పు దిశగా విస్తరించకుండా అడ్డుకుంటున్నాయి. ఉత్తరాదిన అంతంత మాత్రమే ఉండే భూగర్భ జలాలను గుజరాత్ నుంచి ఢిల్లీ దాకా 4 రాష్ట్రాల పరిధిలో ఎప్పటికప్పుడు రీచార్జి చేయడమే గాక రాజధాని ప్రాంతంలోని అపార కాలుష్యాన్ని వీలైనంత మేరకు తగ్గిస్తున్నాయి.
కోర్టు తీర్పుతో...
ఆరావళి రగడ ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా ఉన్నదే. సుప్రీంకోర్టు ఇటీలి తీర్పుతో తాజాగా అది మరోసారి రగులుకుంది. అసలు ఆరావళి పర్వత శ్రేణుల నిర్వచనం పరిధిలోకి వచ్చే ప్రాంతాలు ఏమిటన్న దానిపై కోర్టు చిరకాలంగా విచారణ జరుపుతూ వస్తోంది. ఈ విషయంలో కేంద్రం వాదనతో ఏకీభవిస్తూ గత నవంబర్ 20న కోర్టు తీర్పు వెలువరించింది.
దానిప్రకారం పరిసర ప్రాంతాలతో పోలిస్తే కనీసం 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న వాటిని మాత్రమే గుట్టలుగా, అంటే ఆరావళీ ప్రాంతంగా గుర్తిస్తా రు! ఇది చాలా ప్రమాదకరమైన తీర్పు అని విపక్షాలు మొత్తుకుంటున్నాయి. హరియాణా, దేశ రాజధాని ప్రాంతంలో అస్మదీయులైన రియల్టీ, ఇన్‌ఫ్రా వ్యాపార దిగ్గజాలకు మేలు చేసేందుకే కేంద్రం ఈ వాదన లేవనెత్తింది. దానితో సుప్రీంకోర్టు ఏకీభవించడం తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది. దోపిడీదారులు ఇప్పుడిక చట్టబద్ధంగానే పేట్రే గుతారు’’అని పేర్కొంటున్నాయి.
పర్యావరణవేత్తలు కూడా ఈ వాదనతో ఏకీభవిస్తున్నారు. ఆరావళి శ్రేణుల్లో దాదాపు 90 శాతం ప్రాంతం 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తే ఉంటుందని వారు గుర్తు చేస్తున్నారు. ‘‘కనుక నయా నిర్వచనం ప్రకారం అది గుట్టల లెక్కలోకి రాదు. కనుక అక్కడ గనులు తవ్వుకోవడం మొదలుకుని రియల్టీ వెంచర్ల దాకా ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇది పర్యావరణానికే గాక మొత్తం ఉత్తరాదికే తీరని నష్టం చేస్తుంది. చూస్తుండగానే ఢిల్లీ నుంచి పంజాబ్ దాకా ఏమాత్రమూ నివాసయోగ్యం కాకుండా పోవ డం ఖాయం’’అని వారు హెచ్చరిస్తున్నారు.
కొట్టిపారేస్తున్న కేంద్రం
పాలక బీజేపీ మాత్రం ఆరావళి విషయమై విపక్షాలు, పర్యావరణవేత్తల ఆందోళనలను అసంబద్ధమైనవిగా కొట్టిపారేస్తోంది. ఆరావళి శ్రేణుల నిర్వచనం విషయంలో సుప్రీంకోర్టు నిజానికి ఎలాంటి సడలింపులూ ఇవ్వలేదని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఆరావళి శ్రేణులు నిత్యం పచ్చగా ఉండాలన్నదే కేంద్రం ఆకాంక్ష అన్నా రు. అయితే, ‘100 మీటర్ల ఎత్తు’నిర్వచనం ప్రపంచవ్యాప్తంగా అంగీకరించినదేనంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారాయన! ఆరావళి శ్రేణుల్లో కేవలం 0.19 శాతం ప్రాంతంలో మాత్రమే మైనింగ్‌కు అనుమతిస్తున్నట్టు వివరించారు. మొత్తమ్మీద 90 శాతం పర్వతాలను పూర్తిస్థాయిలో పరిరక్షిస్తున్నామన్నారు.
సేవ్ ఆరావళి
అతి పురాతనమైన ఆరావళి పర్వత శ్రేణులను విధ్వంసం బారినుంచి కాపాడుకుందామంటూ ఆన్‌లైన్‌లో ఉద్యమం ఊపందుకుంటోంది. ‘సేవ్ ఆరావళి’హాష్‌ట్యాగ్‌కు సోషల్ సైట్లలో మద్దతు వెల్లువెత్తుతోంది. ఇది క్రమంగా ఉత్తరాదిని దాటుకుని జాతీయ ఆందోళనగా రూపుదిద్దుకునే సూచనలు కన్పిస్తున్నాయి.
–సాక్షి, నేషనల్ డెస్క్


