పొట్టి అరటి రకం ‘కావేరి వామన్’ చెట్టు ఎత్తు 4.9 నుంచి 5.25 అడుగులే
గాలులకు విరగదు, ఒరగదు.. ఊతాల ఖర్చూ ఉండదు
ఒకటిన్నర నెలల ముందే గెల కోతకొస్తుంది.. అధిక దిగుబడినిస్తుంది..
దేశంలోనే తొట్టతొలి ఉత్పరివర్తన వికిరణ పద్ధతిలో జీ9 ఆధారంగా అభివృద్ధి చేసిన పండ్ల వంగడం
భాభా అణు పరిశోధనా కేంద్రం, జాతీయ అరటి పరిశోధనా సంస్థ సంయుక్త ఆవిష్కరణ
పొలాల్లో అధిక సాంద్రత సాగుకు అనుకూలం.. ఇళ్ల దగ్గర టెర్రస్ గార్డెన్లలో పెంపకానికీ అనువైనది
తుపాను గాలులకు అరటి చెట్లు విరిగి పడిపోవటం అనేది రైతును ఆర్థికంగా తీవ్రంగా నష్టపరిచే పరిస్థితి. ఈ నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకు ఉపయోగపడే పొట్టి రకం అరటి ‘కావేరి వామన్’ అందుబాటులోకి వచ్చింది. ముంబైలోని భాభా అణు పరిశోధనా కేంద్రం (బార్క్), తిరుచ్చిలోని జాతీయ అరటి పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ – ఎస్‌ఆర్‌సీబీ) సంయుక్తంగా ఈ సరికొత్త అరటి రకాన్ని రూపొందించాయి. విస్తారంగా సాగులో ఉన్న గ్రాండ్ నైన్ (జీ9) అరటి చెట్టు ఎత్తు 6–8 అడుగులు. దీని పంట కాలం 11–12 నెలలు. అయితే, గాలులకు ఇది ఒరిగిపోతుంది లేదా విరిగిపోతుంది.
ఎత్తుగా పెరుగుతుంది కాబట్టి దీనికి ఊత కర్రలను సైతం రైతులు అమర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, జీ9 అరటితోనే ఉత్పరివర్తన వికిరణ పద్ధతిలో పొట్టి అరటి ‘కావేరి వామన్’ రకాన్ని రూపొందించటం విశేషం. ఈ చెట్టు ఎత్తు 4.9 అడుగుల నుంచి 5.25 అడుగులు (150 నుంచి 160 సెం.మీ.. (59–63 అంగుళాల) పెరుగుతుంది. గెల స్థూపాకారంలో ఉంటుంది. మధ్యస్థ ఎత్తు ఉండే గెలలో 8–10 పండ్ల హస్తాలు ఉంటాయి. గెల బరువు 18 నుంచి 25 కిలోల వరకు ఉంటుంది. రైతులు పొలాల్లో అధిక సాంద్రత పద్ధతిలో వాణిజ్య స్థాయిలో సాగు చెయ్యటానికే కాకుండా.. ఇంటిపంటలకు, టెర్రస్ గార్డెనింగ్ చేసే వారికి కూడా సౌలభ్యకరంగా ఉంటుంది.
రైతుల జీవనోపాధిని మెరుగుపరచడానికి, దేశ ఆహార/ పౌష్టికాహార భద్రతకు దోహదపడేందుకు ట్రోంబే బనానా మ్యూటెంట్–9 (టీబీఎం–9) పొట్టి అరటి రకాన్ని అభివృద్ధి చేశామని బార్క్ తెలిపింది. టీబీఎం–9నే ఇటీవల భారత ప్రభుత్వం ’కావేరి వామన్’ పేరుతో నోటిఫై చేసింది. కావేరి వామన్ దేశంలోని మొట్టమొదటి మ్యూటెంట్ అరటి రకం మాత్రమే కాదు, బార్క్ అభివృద్ధి చేసి విడుదల చేసిన మొదటి పండ్ల జాతి కూడా కావటం విశేషం. కావేరి వామన్‌తో బార్క్ విడుదల చేసిన మెరుగైన పంట రకాల సంఖ్య 72కు చేరుకుంది.
అయోనైజింగ్ రేడియేషన్ ద్వారా దేశంలో ఉద్యాన పంటల అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే కృషిలో కావేరి వామన్ విడుదల ఒక ప్రధాన అడుగు అని అణుశక్తి విభాగం కార్యదర్శి, అణుశక్తి కమిషన్ చైర్మన్ డాక్టర్ అజిత్ కుమార్ మొహంతి ప్రశంసించారు.
బార్క్ డైరెక్టర్ వివేక్ భాసిన్ మాట్లాడుతూ, స్థిరమైన వ్యవసాయానికి కీలకమైన కొత్త పంట రకాలను అభివృద్ధి చేయడంలో గామా కిరణాల ప్రేరేపిత మ్యూటాజెనిసిస్ కీలక పాత్రను పోషించిందన్నారు. గ్రాండ్ నైన్ అరటిని పండించే రైతులకు కావేరి వామన్ విడుదల ఒక వరం వంటిదన్నారు.
బార్క్ రూపొందించిన ఈ కొత్త రకంపై తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా అనేక సంవత్సరాల పాటు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించింది. కఠినమైన క్షేత్రస్థాయి పరీక్షల తర్వాత మాతృరకం అయిన జీ9 రకం కంటే కావేరి వామన్ అనేక మేలైన ఫలితాలనిచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
పొడవుగా పెరిగే జీ9 రకం అరటి మొక్కలతో గాలుల తీవ్రత ఉండే ప్రాంతాల్లో రైతులు పెద్ద నష్టాలపాలవుతున్నారు. ఒరిగిపోకుండా, విరిగిపోకుండా చెట్లను కాపాడుకోవటానికి వెదురు లేదా సర్వి బాదులను ఆసరాగా పెడుతూ ఉంటారు. ఇది చాలా ఖర్చుతో కూడిన పని. గాలులకు తట్టుకొని నిలబడే శక్తిగల కావేరి వామన్ కొత్త రకం పొట్టి వంగడంతో ఈ సమస్య తీరిపోతుంది. కావేరి వామన్ చెట్ల గెలలు ఒకటిన్నర నెలల ముందే కోతకు వస్తాయి. దీని అరటి పండు గ్రాండ్ నైన్ రకం అరటి పండ్ల మాదిరిగానే రుచిగా, నాణ్యంగా ఉంటాయి.


