breaking news
Bhabha Atomic Research Centre
-
ఐదడుగుల అరటి!
తుపాను గాలులకు అరటి చెట్లు విరిగి పడిపోవటం అనేది రైతును ఆర్థికంగా తీవ్రంగా నష్టపరిచే పరిస్థితి. ఈ నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకు ఉపయోగపడే పొట్టి రకం అరటి ‘కావేరి వామన్’ అందుబాటులోకి వచ్చింది. ముంబైలోని భాభా అణు పరిశోధనా కేంద్రం (బార్క్), తిరుచ్చిలోని జాతీయ అరటి పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ – ఎస్ఆర్సీబీ) సంయుక్తంగా ఈ సరికొత్త అరటి రకాన్ని రూపొందించాయి. విస్తారంగా సాగులో ఉన్న గ్రాండ్ నైన్ (జీ9) అరటి చెట్టు ఎత్తు 6–8 అడుగులు. దీని పంట కాలం 11–12 నెలలు. అయితే, గాలులకు ఇది ఒరిగిపోతుంది లేదా విరిగిపోతుంది. ఎత్తుగా పెరుగుతుంది కాబట్టి దీనికి ఊత కర్రలను సైతం రైతులు అమర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, జీ9 అరటితోనే ఉత్పరివర్తన వికిరణ పద్ధతిలో పొట్టి అరటి ‘కావేరి వామన్’ రకాన్ని రూపొందించటం విశేషం. ఈ చెట్టు ఎత్తు 4.9 అడుగుల నుంచి 5.25 అడుగులు (150 నుంచి 160 సెం.మీ.. (59–63 అంగుళాల) పెరుగుతుంది. గెల స్థూపాకారంలో ఉంటుంది. మధ్యస్థ ఎత్తు ఉండే గెలలో 8–10 పండ్ల హస్తాలు ఉంటాయి. గెల బరువు 18 నుంచి 25 కిలోల వరకు ఉంటుంది. రైతులు పొలాల్లో అధిక సాంద్రత పద్ధతిలో వాణిజ్య స్థాయిలో సాగు చెయ్యటానికే కాకుండా.. ఇంటిపంటలకు, టెర్రస్ గార్డెనింగ్ చేసే వారికి కూడా సౌలభ్యకరంగా ఉంటుంది.రైతుల జీవనోపాధిని మెరుగుపరచడానికి, దేశ ఆహార/ పౌష్టికాహార భద్రతకు దోహదపడేందుకు ట్రోంబే బనానా మ్యూటెంట్–9 (టీబీఎం–9) పొట్టి అరటి రకాన్ని అభివృద్ధి చేశామని బార్క్ తెలిపింది. టీబీఎం–9నే ఇటీవల భారత ప్రభుత్వం ’కావేరి వామన్’ పేరుతో నోటిఫై చేసింది. కావేరి వామన్ దేశంలోని మొట్టమొదటి మ్యూటెంట్ అరటి రకం మాత్రమే కాదు, బార్క్ అభివృద్ధి చేసి విడుదల చేసిన మొదటి పండ్ల జాతి కూడా కావటం విశేషం. కావేరి వామన్తో బార్క్ విడుదల చేసిన మెరుగైన పంట రకాల సంఖ్య 72కు చేరుకుంది.అయోనైజింగ్ రేడియేషన్ ద్వారా దేశంలో ఉద్యాన పంటల అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే కృషిలో కావేరి వామన్ విడుదల ఒక ప్రధాన అడుగు అని అణుశక్తి విభాగం కార్యదర్శి, అణుశక్తి కమిషన్ చైర్మన్ డాక్టర్ అజిత్ కుమార్ మొహంతి ప్రశంసించారు.బార్క్ డైరెక్టర్ వివేక్ భాసిన్ మాట్లాడుతూ, స్థిరమైన వ్యవసాయానికి కీలకమైన కొత్త పంట రకాలను అభివృద్ధి చేయడంలో గామా కిరణాల ప్రేరేపిత మ్యూటాజెనిసిస్ కీలక పాత్రను పోషించిందన్నారు. గ్రాండ్ నైన్ అరటిని పండించే రైతులకు కావేరి వామన్ విడుదల ఒక వరం వంటిదన్నారు. బార్క్ రూపొందించిన ఈ కొత్త రకంపై తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా అనేక సంవత్సరాల పాటు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించింది. కఠినమైన క్షేత్రస్థాయి పరీక్షల తర్వాత మాతృరకం అయిన జీ9 రకం కంటే కావేరి వామన్ అనేక మేలైన ఫలితాలనిచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. పొడవుగా పెరిగే జీ9 రకం అరటి మొక్కలతో గాలుల తీవ్రత ఉండే ప్రాంతాల్లో రైతులు పెద్ద నష్టాలపాలవుతున్నారు. ఒరిగిపోకుండా, విరిగిపోకుండా చెట్లను కాపాడుకోవటానికి వెదురు లేదా సర్వి బాదులను ఆసరాగా పెడుతూ ఉంటారు. ఇది చాలా ఖర్చుతో కూడిన పని. గాలులకు తట్టుకొని నిలబడే శక్తిగల కావేరి వామన్ కొత్త రకం పొట్టి వంగడంతో ఈ సమస్య తీరిపోతుంది. కావేరి వామన్ చెట్ల గెలలు ఒకటిన్నర నెలల ముందే కోతకు వస్తాయి. దీని అరటి పండు గ్రాండ్ నైన్ రకం అరటి పండ్ల మాదిరిగానే రుచిగా, నాణ్యంగా ఉంటాయి. -
బార్క్ అందిస్తున్న కోర్సుల వివరాలు..
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ మీడియా మేనేజ్మెంట్లో ఎంబీఏను ఆఫర్ చేస్తున్న సంస్థలేవి? - సుధీర్, నిజామాబాద్. ఒక నిర్దిష్ట అవసరానికి సరిపోయే మీడియాను ఎంపిక చేసేందుకు మీడియా మేనేజ్మెంట్ అవసరముంటుంది. ఎలాంటి సమాచారం చేరవేయాలి? ఎవరికి చేరవేయాలి? తదితర అంశాల ఆధారంగా తగిన మీడియాను ఎంపిక చేస్తారు. ఇలాంటి వాటికోసం అవసరమైన టూల్స్, టెక్నిక్స్ గురించి మీడియా మేనేజ్మెంట్ వివరిస్తుంది. కోర్సుల వివరాలు: అమిటీ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్, అమిటీ యూనివర్సిటీ, నోయిడా.. మీడియా మేనేజ్మెంట్లో ఎంబీఏ కోర్సును ఆఫర్ చేస్తోంది. 50 శాతం మార్కులతో ఏ గ్రూపులోనైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు అర్హులు. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.amity.edu ఎడ్యుకేషనల్ మల్టిమీడియా రీసెర్చ్ సెంటర్, దేవీ అహల్య విశ్వవిద్యాలయ, ఇండోర్.. మీడియా మేనేజ్మెంట్లో ఎంబీఏను అందిస్తోంది. ఉమ్మడి రాత పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నారు. వెబ్సైట్: www.emrcdavv.edu.in హిందుస్థాన్ యూనివర్సిటీ, చెన్నై.. మీడియా మేనేజ్మెంట్లో ఎంబీఏను ఆఫర్ చేస్తోంది. ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.hindustanuniv.ac.in సింబయోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్, పుణే.. ఎంబీఏ- మీడియా మేనేజ్మెంట్ను అందిస్తోంది. కెరీర్: మీడియా సంబంధిత సంస్థలకు మార్కెట్ అధ్యయనం, బిజినెస్ డెవలప్మెంట్, సంస్థ ఆర్థిక వ్యవహారాల సమర్థ నిర్వహణ వంటివి కీలకం. ఈ నైపుణ్యాలు ఎంబీఏ (మీడియా మేనేజ్మెంట్) ద్వారా పొందొచ్చు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి మీడియా, అడ్వర్టైజింగ్ సంస్థలు; మార్కెట్ రీసెర్చ్ కంపెనీలు, మార్కెటింగ్ సంస్థలు, పబ్లిక్ రిలేషన్ విభాగాలు తదితరాల్లో అవకాశాలు లభిస్తాయి. సైబర్ సెక్యూరిటీలో కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయి? - పూజిత, మహబూబ్‌నగర్. ఇప్పుడు అన్ని రంగాలకూ ఐటీ సేవల అవసరం బాగా పెరిగింది. సంస్థల కార్యకలాపాల్లో కంప్యూటర్లు- ఇంటర్నెట్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం అధికమైంది. ఈ నేపథ్యంలో ఐటీ వ్యవస్థలపై సైబర్ దాడులు జరక్కుండా ఇన్ఫర్మేషన్/ సైబర్ సెక్యూరిటీ రక్షణ కల్పిస్తోంది. కోర్సుల వివరాలు: జేఎన్టీయూ, హైదరాబాద్.. కంప్యూటర్ నెట్వర్క్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఎంటెక్‌ను అందిస్తోంది. ఎంట్రన్స్ టెస్ట్/గేట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తోంది. వెబ్సైట్: www.jntuh.ac.in ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ నెట్‌వర్క్స్‌లో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.andhrauniversity.edu.in ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: iiit.net ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్, ఘజియాబాద్.. ఏడాది కాల వ్యవధితో సైబర్ సెక్యూరిటీలో పీజీ డిప్లొమాను అందిస్తోంది. వెబ్సైట్: www.imtcdl.ac.in అవకాశాలు: కంప్యూటర్ నెట్వర్క్స్తో పనిచేస్తున్న అన్ని సంస్థలకూ సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఉంటుంది. ఐటీ కంపెనీలు ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమించుకుంటున్నాయి. ఇన్ఫర్మేషన్/ సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తిచేసిన వారికి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సెక్యూరిటీ అనలిస్ట్, నెట్వర్క్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలుంటాయి. బయోటెక్నాలజీలో ఎంటెక్‌ను అందిస్తున్న ఐఐటీల వివరాలు తెలపండి? - ప్రవీణ్, శ్రీకాకుళం. ఇంజనీరింగ్ సూత్రాలను జీవ కణాల లక్షణాలు, ప్రవర్తనలకు అనువర్తింపజేసేదే బయోటెక్నాలజీ. నేడు బయోటెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. బయో ఫెర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, బయో ఫ్యూయల్స్, బయో ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్, బయో కాస్మోటిక్స్, జన్యు మార్పిడి పంటలు.. ఇవన్నీ బయోటెక్నాలజీ పరిశోధనల ఫలితాలే. ఐఐటీ ఖరగ్‌పూర్.. బయోటెక్నాలజీ అండ్ బయో కెమికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. అర్హత: సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్ లేదా ఎంఎస్సీ. గేట్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.iitkgp.ac.in ఐఐటీ, గౌహతి.. బయోటెక్నాలజీలో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.iitg.ac.in ఐఐటీ, హైదరాబాద్.. మెడికల్ బయోటెక్నాలజీలో ఎంటెక్‌ను అందిస్తోంది. అర్హత: లైఫ్ సెన్సైస్ బ్రాంచ్‌లో బీఈ/బీటెక్ లేదా ఎంఎస్సీ. వెబ్సైట్: http://biotech.iith.ac.in జేఎన్టీయూ, హైదరాబాద్.. బయోటెక్నాలజీలో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. ఎంట్రెన్స్/గేట్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.jntuh.ac.in అవకాశాలు: బయోటెక్నాలజీ కోర్సులు పూర్తిచేసిన వారికి డ్రగ్ డెవలప్మెంట్, హెల్త్‌కేర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫిషరీస్, కెమికల్స్, బయో ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్, వేస్ట్ మేనేజ్మెంట్, అగ్రికల్చరల్, ప్రభుత్వ విభాగాలు, పరిశోధన సంస్థలు, విద్యా సంస్థల్లో అవకాశాలుంటాయి. బార్క్ అందిస్తున్న కోర్సుల వివరాలు తెలపగలరు? - చరణ్, గద్వాల్. బాబా ఆటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్), ముంబై.. రేడియేషన్ భద్రతకు సంబంధించిన కోర్సులను అందిస్తోంది. బార్క్ రేడియాలజికల్ ఫిజిక్స్‌లో ఏడాది కాల వ్యవధితో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను ఆఫర్ చేస్తోంది. అర్హత: ఎంఎస్సీ- ఫిజిక్స్. ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఆర్‌ఎస్‌వో లెవెల్-3 సర్టిఫికేషన్‌కు అర్హత సాధిస్తారు. వెబ్సైట్: http://barc.ernet.in


