గురుగ్రామ్ పోలీస్ కమిషనర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్‌ల తరఫున వాదిస్తున్నాడని, హత్య కేసులో అన్యాయంగా న్యాయవాదిని హరియాణా పోలీసులు అరెస్ట్‌చేశారని దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం వేగంగా స్పందించింది. చట్టవ్యతిరేకంగా లాయర్ నడుచుకున్నట్లు తమకు అనిపించట్లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్‌వీ అన్జారియాల ధర్మాసనం వ్యాఖ్యానించింది.
‘‘ తక్షణం న్యాయవాది విక్రమ్ సింగ్‌ను విడుదలచేయండి. రూ.10,00 విలువైన బాండు పూచీకత్తుపై ఆయనను వదిలేయండి. మా ఆదేశాలు త్వరగా గురుగ్రామ్ పోలీస్ కమిషనర్‌కు చేరేలా చూడండి’’ అని సుప్రీంకోర్టు జ్యూడీషియల్ రిజిస్ట్రార్‌ను ధర్మాసనం ఆదేశించింది. గురుగ్రామ్ పోలీసుల ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఢిల్లీకి చెందిన న్యాయవాది విక్రమ్‌సింగ్‌ను వెంటనే విడుదల చేయాలని దాఖలైన పిటిషన్‌పై వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు పైవిధంగ ఆదేశాలిచ్చింది. ఈ కేసులో న్యాయవాది తరపున హాజరైన సీనియర్ న్యాయవాది వికాస్‌సింగ్ వాదనలు వినిపించారు.
‘‘ పోలీసుల ఇలాంటి అత్యంత కఠిన చర్యల కారణంగా న్యాయవాదులు నేర చట్టాలపై కేసులను వాదించడానికి ముందుకురాబోరు. న్యాయవాదులపై పోలీసుల ఈ తరహా వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అయిన వికాస్‌సింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైనందున ఈ అంశంపై సమ్మె కొనసాగించవద్దని ఢిల్లీ న్యాయవాదులను ఒప్పించానని ఆయన సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పిటిషనర్‌పై ఉన్న అన్ని క్రిమినల్ చర్యలను రద్దు చేయాలని కూడా కోరారు. న్యాయవాది విక్రమ్‌సింగ్ 2019 జులైలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో న్యాయవాదిగా తన పేరు నమోదుచేయించుకున్నారు.


