సిట్‌ కస్టడీ నుంచి ప్రభాకర్‌ రావు రిలీజ్‌ | Telangana Phone Tapping Case, Prabhakar Rao Released From Custody, SIT Gathers Crucial Evidence Against Political Leaders | Sakshi
Sakshi News home page

Phone Tapping Case: సిట్‌ కస్టడీ నుంచి ప్రభాకర్‌ రావు రిలీజ్‌

Dec 26 2025 8:49 AM | Updated on Dec 26 2025 12:12 PM

Phone Tapping Case: Prabhakar Rao Released From SIT Custody

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. శుక్రవారం వేకువజామునే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన్ని విడిచిపెట్టింది. అక్కడి నుంచి ఆయన నేరుగా ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు.. ఈ కేసులో 14 రోజుల పాటు కస్టోడియల్ విచారణ జరిపిన సిట్ నెక్ట్స్‌ ఏం చేయబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. 

అయితే.. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేవలం ప్రతిపక్షాలకే పరిమితం కాలేదని, నాటి అధికార బీఆర్‌ఎస్‌కు చెందిన అసమ్మతి నేతలపైనా సాగిందని సిట్‌ గుర్తించింది. దీనికి సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన అధికారులు ఆ కోణంలోనూ ప్రభాకర్‌రావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 

ప్రభాకర్‌రావు విచారణ ద్వారా.. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కేంద్రంగా సాగిన ఎమ్మెల్యేలకు ఎర ఆపరేషన్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారానే వెలుగులోకి వచ్చిందని, దాని కోసం అవసరమైన నిఘా పరికరాలను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఖరీదు చేశారని సిట్‌ తేల్చింది. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఆ పార్టీకి బ్రేక్‌ వేయాలంటూ వచ్చిన ఆదేశాలతో ప్రభాకర్‌రావు టీమ్‌ అప్రమత్తమైందని సిట్‌ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి.. 

2022 అక్టోబర్‌ చివరి వారంలో ప్రభాకర్‌రావు–రాధాకిషన్‌రావు మధ్య జరిగిన ఓ సమావేశంలో నాటి ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి వ్యవహారం ప్రస్తావనకు వచ్చిందని గుర్తించింది. ‘నాకు పదవీ విరమణ తర్వాత అప్పటి డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఎక్స్‌టెన్షన్‌ కోసం ప్రతిపాదనలు పంపారు. దీని ఆధారంగా అప్పట్లో హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్న రవిగుప్తా ఆదేశాలు ఇచ్చారు. నా పనితీరు ఆధారంగానే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు ఎవరికీ సంబం«ధం లేదు. అప్పటి సీఎం కేసీఆర్‌కు, నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని ప్రభాకర్‌రావు సిట్‌ అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. 

.. ఈ నేపథ్యంలోనే సిట్‌ గురువారం ఆనాడు సీఎస్‌గా పని చేసిన సోమేశ్‌కుమార్‌తోపాటు మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి నుంచి వాంగ్మూలాలు సేకరించింది. అధికారులు సేకరించిన ఆధారాల్లో కొందరు రాజకీయ నాయకులు, అనుచరులు, జర్నలిస్టులు, అధికారులకు సంబంధించినవి ఉండటంతో వాటిని చూపిస్తూ... అవి ఎందుకు ట్యాప్‌ చేయాల్సి వచ్చిందంటూ ప్రభాకర్‌రావును సిట్‌ ప్రశ్నించింది.  

ఈ కేసులో బాధితుడిగా ఉన్న ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు నందకుమార్‌ వాంగ్మూలాన్నీ సిట్‌ సేకరించింది. ‘నన్ను సిట్‌ అధికారులు ప్రశ్నించారు. నా ఫోన్‌ ట్యాప్‌ చేశారనే అనుమానాలు ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫామ్‌హౌస్‌లో రికార్డు చేసిన వీడియోలు బయటకు వెళ్లాయి. కేసీఆర్‌ స్వయంగా వాటిని మీడియాకు విడుదల చేశారు. నాటి ఫామ్‌హౌస్‌ తతంగంపై సిట్‌ అధికారులు వివరాలు అడిగారు. ఎమ్మెల్యేలు, స్వామీజీలతోపాటు నా ఫోన్‌ కూడా ట్యాపింగ్‌ చేశారు. దీనిపై అప్పట్లో డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేశా. రాధాకిషన్‌రావు ఎలా వేధించారని సిట్‌ అధికారులు అడిగారు. వారికి పూర్తి సమాచారం అందించా అని నందకుమార్‌ విచారణ తర్వాత మీడియాకు తెలిపారు.   

ఆనాడు అధికారపక్షంలోని నేతల ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై మరో నిందితుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుతో కలిపి మరీ ప్రభాకర్‌రావును విచారించారు. బీఆర్‌ఎస్‌ నేతలపై నిఘా ఉంచడం వెనుక ప్రభాకర్‌రావుతోపాటు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు పాత్ర ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ వ్యవహారంపై గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు త్వరలో నోటీసులు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనవరి 16వ తేదీ నాటికి ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ సమగ్ర నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈలోపే ఆ పెద్దలను విచారించే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement