టొరంటో: కెనడాలోని టొరంటోలో 30 ఏళ్ల భారత యువతి హిమాన్షి ఖురానా దారుణ హత్యకు గురయ్యారు. గత శుక్రవారం రాత్రి ఆమె అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందగా, మరుసటి రోజు ఉదయం ఒక నివాసంలో ఆమె మృతదేహం లభ్యమైంది. దర్యాప్తు చేపట్టిన అధికారులు మృతురాలి భాగస్వామే ఇందుకు కారకుడని ప్రాథమికంగా నిర్ధారించారు.
పరారీలో ఉన్న నిందితుడు అబ్దుల్ గఫూరీ(32)ని పట్టుకునేందుకు కెనడియన్ చట్ట అమలు సంస్థలు దేశవ్యాప్త వారెంట్ జారీ చేశాయి. గఫూరీ ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరుతూ నిందితుడి ఫోటోను విడుదల చేశారు. ఈ ఘటనపై టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హిమాన్షి ఖురానా మృతిపై విచారం వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కేసును నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని కాన్సులేట్ తెలిపింది. టొరంటో పోలీసుల హోమిసైడ్ యూనిట్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ జరుపుతోంది. కాగా ఈ ఘటన విదేశాల్లోని భారతీయులకు సంబంధించిన భద్రతా పరమైన ఆందోళనలను మరోసారి లేవనెత్తింది.
ఇది కూడా చదవండి: నింగిలోకి ఎల్‌వీఎం3- ఎం6


