విబేధాలు మరచి పెళ్లాడతారని ముందే ఊహించాం
రేప్ కేసు దోషికి శిక్షను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్య
న్యూఢిల్లీ: విబేధాలతో వ్యక్తిపై అత్యాచార కేసు నమోదుచేసిన బాధితురాలు తన మనసు మార్చుకుని అతడినే పెళ్లాడవచ్చని తాము ముందే ఊహించామని, తమ ‘సిక్స్త్ సెన్స్’ అదే చెప్పిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఓ కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. మహిళను రేప్ చేశాడన్న కేసులో దోషిగా తేలి మధ్యప్రదేశ్ హైకోర్టులో పదేళ్ల శిక్ష పడిన వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించగా సంబంధిత కేసును జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల విచారించింది.
బాధితురాలు, దోషి వివాహంచేసుకుని గత ఆరునెలలుగా సంతోషంగా జీవిస్తున్న నేపథ్యంలో దోషికి గతంలో హైకోర్టు విధించిన శిక్షను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు పలు ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. డిసెంబర్ ఐదున వెలువ డిన ఈ కేసు తీర్పు వివరాలు ఆలస్యంగా శనివారం వెలుగుచూశాయి.
‘‘ శిక్షను రద్దుచేయాలంటూ అప్పీల్ చేసుకున్న వ్యక్తిని బాధితురాలు ఒకవేళ వివాహం చేసుకునేందుకు సుముఖత చూపితే ఇద్దరూ మళ్లీ కలిసిపోతారని మేం ముందే ఊహించాం. మా సిక్త్స్ సెన్స్ ఇదే చెప్పింది. ముందుచూపుతో ముందే ఊహించాం. ఇలాంటి కేసు నిజంగా అరుదైంది. బాధితురాలిని పెళ్లిచేసుకోవడం ద్వారా దోషిపై ఉన్న నేరారోపణలను, శిక్షను రద్దుచేస్తున్నాం’’ అని న్యాయమూర్తులు తీర్పు చెప్పారు.
2015లో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన వ్యక్తిని మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక యువతి ఇష్టపడింది. తర్వాత కొన్నాళ్లపాటు ఇద్దరూ సహజీవనంచేశారు. తర్వాత మనస్పర్థలొచ్చాయి. దీంతో పెళ్లాడతానని మాయమాటలు చెప్పి తనను పలుమార్లు అత్యాచారంచేశాడని మహిళ ఫిర్యాదుచేయడంతో 2021 నవంబర్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. గత ఏడాది ఏప్రిల్‌లో ట్రయల్ కోర్టు ఆ వ్యక్తిని దోషిగా తేల్చింది.
తీర్పును అతను మధ్యప్రదేశ్ హైకోర్టులో సవాల్‌చేయగా అక్కడా అతనికి చుక్కెదురైంది. పైగా పదేళ్ల కఠిన కారాగార శిక్షను, రూ.55,000 జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పుచెప్పింది. దీంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఇద్దరినీ, వాళ్ల తల్లిదండ్రులను సుప్రీంకోర్టు ధర్మాస నం పిలిపించింది. వివాహంచేసుకునేందుకు ఇరువైపులా సమ్మతి తెలపడంతో పెళ్లాడేందుకు వీలుగా అతనికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. ఆ తర్వాత వాళ్లు పెళ్లాడారు. ఈ విషయంతెల్సి ధర్మాసనం ఈ కేసును విచారించింది. ‘‘ఇద్దరి మధ్య చిన్నపాటి బేధాభిప్రాయాలు ఉన్నట్లు మాకు అర్థమైంది.
అనివార్య కారణాలతో వివాహం వాయిదావేద్దామని కలిసున్నకాలంలో అబ్బాయి చెప్పడంతో ఆగ్రహించిన అమ్మాయి నేరపూరిత రంగు పులిమి విషయాన్ని పెద్దదిచేసింది. వాస్తవానికి పెళ్లిచేసుకోవాలన్న ఉద్దేశం ఇద్దరికీ ఉందని మా సిక్త్స్ సెన్స్ ఎప్పుడో చెప్పింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా మాకు సంక్రమించిన అసాధారణ అధికారాలతో ఎఫ్‌ఐఆర్‌ను, ట్రయల్ కోర్టులో తీర్పును రద్దుచేస్తున్నాం. తద్వారా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న సంబంధిత కేసు నిర్వీర్యమైపోయినట్లే’’అని ధర్మాసనం స్పష్టంచేసింది.


