జమ్ము కశ్మీర్‌లోని నౌగం పోలీసు స్టేషన్ వద్ద జరిగిన పేలుడులో దర్జీ మరణంతో ఆయన కుటుంబం ఏకాకిగా మారింది. ఆ కుటుంబానికి ఆయన ఒక్కరే ఆధారం. పోలీస్‌స్టేషన్‌లో చిన్న ప్యాకింగ్ పని ఉందని రమ్మంటే వెళ్లిన స్థానిక టైలర్ మొహమ్మద్ షఫీ పారీ మళ్లీ తిరిగిరాలేదు. పేలుడు ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం అనాథగా మారింది. 47 ఏళ్ల షఫీకి స్థానికంగా ఎంతో మంచి పేరుంది. మసీదులో కార్యక్రమాల కోసం విరాళాలు సేకరిస్తారు. చుట్టుపక్కల వాళ్లను ప్రేమగా పలకరిస్తాడు. ఆయనకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో తండ్రి భోజనం కోసం ఇంటికి వచ్చినప్పుడు.. చలి కారణంగా ఇంట్లోనే ఉండాలని కుమార్తె వేడుకుంది. నాన్నా.. వెళ్లొద్దంటూ ఆమె ఎంతగానో వారించింది. కానీ ఆయన పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి పని పూర్తి చేయాల్సి ఉందని వెళ్లిపోయారు. రాత్రి 11.20గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. పని పూర్తి చేసి తిరిగి వస్తానని ఆయన చెప్పిన చివరి మాటలు తలచుకుంటూ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
కాగా, టైలర్ మొహమ్మద్ షఫీ పారీని పోలీసులు.. పేలుడు పదార్థాల ప్యాకెట్ల కోసం సంచులు కుట్టించడానికి స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఇటీవల హర్యానా ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసుకున్న భారీ పేలుడు పదార్థాల నుండి నమూనాలు సేకరిస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. నిబంధనావళి ప్రకారం పేలుడు పదార్థాల నుంచి కొంతమేర శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపేందుకు ప్రయత్నిస్తుండగా అవి ఒక్కసారిగా పేలిపోయి 9 మంది ప్రాణాలను బలిగొంది. ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ టీమ్‌లోని ముగ్గురు, ఇద్దరు క్రైమ్ ఫొటోగ్రాఫర్లు, మేజి స్ట్రేట్ బృందంలోని ఇద్దరు రెవెన్యూ శాఖ అధికారులు, స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారి, ఒక టైలర్ చనిపోయారు. ఇద్దరు రెవెన్యూ అధికారులు, ముగ్గురు పౌరులు సహా 27 మంది గాయపడ్డారు.


