శుక్రవారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ఎన్డీయే విజయోత్సవాల్లో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–జేడీ(యూ) కూటమి ప్రభంజనం
243 స్థానాలకు గాను 202 స్థానాలు కైవసం
35 సీట్లకే పరిమితమైన విపక్ష మహాగఠ్‌బంధన్
బీజేపీకి 89, జేడీ(యూ)కి 85 సీట్లు
25 స్థానాల్లో ఆర్జేడీ, ఆరు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు
చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 19 సీట్లు... 5 సీట్లలో ఎంఐఎం జయకేతనం
సున్నా చుట్టేసిన ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్ పార్టీ
ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ
పట్నా: బిహార్ శాసనసభ ఎన్నికల్లో అధికార ఎన్డీయే సీట్ల సునామీ సృష్టించింది. మొత్తం 243 స్థానాలకు గాను ఏకంగా 202 స్థానాలు దక్కించుకొని డబుల్ సెంచరీ కొట్టేసింది. తమకు ఎదురే లేదని నిరూపించుకుంది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. శుక్రవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో మొదటి నుంచీ చివరిదాకా బీజేపీ–జేడీ(యూ) కూటమి ప్రభంజనమే కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాకర్షణ శక్తి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అందించిన సుపరిపాలన కూటమి విజయానికి బాటలు వేశాయి.
89 సీట్లలో జయకేతనం ఎగురవేసిన బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మిత్రపక్షమైన జేడీ(యూ)ను వెనక్కి నెట్టి, కూటమి పెద్దన్నగా మారింది. కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన మహాగఠ్‌బంధన్ పూర్తిగా కుదేలయ్యింది. కేవలం 35 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ గుండుసున్నా చుట్టేసింది. ఘోర పరాజయం పాలయ్యింది.
కనీస ప్రభావాన్ని కూడా చూపలేకపోయింది. సీట్లు సాధించడంలో విఫలమైన జన సురాజ్ పార్టీ చాలా స్థానాల్లో మహాగఠ్‌బంధన్ విజయావకాశాలను దెబ్బకొట్టింది. బిహార్ విజయంతో ఊపుమీదున్న బీజేపీ ఇక బెంగాల్ కోటపై కాషాయ జెండా పాతడానికి రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతోంది. బిహార్ విజయాన్ని ప్రజాస్వామ్య విజయంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. జంగిల్‌రాజ్ ఇక అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. 
సుపరిపాలన, వికాసానిదే విజయం
బిహార్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లో సుపరిపాలన, వికాసం, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయానిదే విజయం అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే ఘన సాధించడంపై శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘సుపరిపాలన గెలిచింది. అభివృద్ధి గెలిచింది. ప్రజా సంక్షేమ స్ఫూర్తి గెలిచింది. సామాజిక న్యాయం గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేను చరిత్రాత్మకమైన, అపూర్వమైన విజయంతో ఆశీర్వదించినందుకు బిహార్‌లోని నా కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. 
ఫలితాల అనంతరం ప్రధాని మోదీని సన్మానిస్తున్న రాజ్‌నాథ్ సింగ్, నడ్డా, అమిత్ షా
ఈ అఖండ తీర్పు బిహార్ కోసం ప్రజలకు సేవ చేయడానికి నూతన సంకల్పంతో పనిచేయడానికి మాకు శక్తినిస్తుంది. అవిశ్రాంతంగా పనిచేసిన ప్రతి ఎన్డీయే కార్యకర్తకు నా కృతజ్ఞతలు. వారు మా అభివృద్ధి ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రతిపక్షాల ప్రతి అబద్ధాన్ని గట్టిగా తిప్పికొట్టారు. రాబోయే కాలంలో, బిహార్‌లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, రాష్ట్ర సంస్కృతికి కొత్త గుర్తింపును తీసుకువచ్చేందుకు మేము అవిశ్రాంతంగా కృషి చేస్తాం. యువ శక్తి, నారీశక్తికి సుసంపన్న జీవితం అందజేస్తాం’’అని పేర్కొన్నారు.
బిహార్‌లో గెలిచిన ప్రముఖులు
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేక సంచలనాలకు, ఆసక్తికరమైన గెలుపోటములకు వేదికగా ని లిచాయి. ఎన్డీఏ ప్రభంజనంలో కొందరు అగ్రనాయకులు, సి నీతారలు అనూహ్యంగా గెలిచి తమ పట్టు నిరూపించుకోగా, మరికొందరు అగ్రశ్రేణినేతలు, ముఖ్యంగా ’యాదవ్’ కుటుంబం, భోజ్‌పురి స్టార్లు తీవ్ర పరాజయాన్ని చవిచూశారు.
శివానీ శుక్లా (ఆర్జేడీ): బాహుబలి నేత మున్నా శుక్లా కుమార్తె శివానీ, లాల్‌గంజ్ నుంచి గెలిచి రాజకీయ అరంగేట్రం చేశారు.
మైథిలీ ఠాకూర్ (బీజేపీ – గాయని): ఈ ఎన్నికల్లో అతిపెద్ద సెలబ్రిటీ విన్నర్. రాజకీయ అరంగేట్రంలోనే అలీనగర్ నియోజకవర్గంలో ఆర్జేడీ కంచుకోటను బద్దలుకొట్టి చరిత్రాత్మక విజయం సాధించారు.
శ్రేయసి సింగ్ (బీజేపీ – షూటర్): కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్, షూటర్ శ్రేయసి సింగ్ జమూయ్ స్థానం నుంచి 20,000 ఓట్లకు పైగా భారీ మెజారిటీతో రెండోసారి గెలుపొందారు.
వినయ్ బిహారీ (బీజేపీ – గాయకుడు/నటుడు): ప్రముఖ భోజ్‌పురి గాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వినయ్ బిహారీ లౌరియా స్థానం నుంచి మరోసారి సులభంగా గెలుపొందారు.
ప్రభావం చూపని వామపక్షాలు
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ముస్లిం మైనార్టీల ప్రాబల్యం కలిగిన సీమాంచల్‌లో 29 సీట్లలో పోటీ చేసి, ఐదు సీట్లు సాధించింది. ఆ పార్టీ ఏ కూటమిలోనూ చేరకుండా ఒంటరిగానే బరిలోకి దిగడం విశేషం. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని ఎల్‌జేపీ(రామ్‌విలాస్) 19 సీట్లు సొంతం చేసుకుంది. హిందుస్తానీ అవామీ మోర్చా(సెక్యులర్) 5 సీట్లు, రాష్ట్రీయ లోక్ మోర్చా 4 సీట్లు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ 2 సీట్లు, ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ ఒక స్థానాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. 
మరోవైపు ఈ ఎన్నికలు కాంగ్రెస్–ఆర్జేడీ కూటమికి చేదు అనుభవం మిగిల్చాయి. గత ఎన్నికల్లో 75 సీట్లు గెల్చుకున్న ఆర్జేడీ ప్రస్థానం ఇప్పుడు 25 సీట్ల వద్దే ఆగిపోయింది. కాంగ్రెస్ సంఖ్యాబలం 19 నుంచి ఆరుకు పడిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే ఆర్జేడీ, కాంగ్రెస్ బలం భారీగా తగ్గిపోయింది. సీఎం నితీశ్ కుమార్ ప్రజా వ్యతిరేకతను అధిగమించి మళ్లీ గెలుపు బావుటా ఎగురవేశారు. ముస్లింల ప్రభావం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ బీజేపీ కూటమికి మంచి ఫలితాలు లభించాయి.
మైనార్టీ ఓటర్ల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చినట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. విపక్ష కూటమిలో భాగమైన వామపక్షాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. బహుజన సమాజ్ పార్టీ ఒక స్థానం, సీపీఎం ఒక స్థానం గెల్చుకున్నాయి. మరోవైపు బిహార్ విజయంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే కష్టపడి పనిచేస్తామని తేల్చిచెప్పాయి. ఇదిలా ఉండగా, బిహార్ నూతన ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. నితీశ్ కుమార్‌కు మరోసారి అవకాశం దక్కకపోవచ్చని, బీజేపీ నాయకుడే తదుపరి ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం సాగుతోంది. దీనిపై బీజేపీ గానీ, జేడీ(యూ) గానీ ఇంకా స్పందించలేదు. 
పెరిగిన ఎన్డీయే ఓట్ల శాతం
బిహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ) తమ ఓట్ల శాతాన్ని పెంచుకున్నాయి. 2020 ఎన్నికల్లో 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 19.46 శాతం ఓట్లు సాధించగా, ప్రస్తుతం 101 స్థానాల్లో పోటీకి దిగి 20.08 శాతం ఓట్లు దక్కించుకుంది. జేడీ(యూ) 2020లో 115 సీట్లలో పోటీ చేసి, 15.39 శాతం ఓట్లు కైవసం చేసుకుంది. ఇప్పటి ఎన్నికల్లో 101 సీట్లలో పోటీ చేసి, 19.25 శాతం ఓట్లు పొందింది.
ఆర్జేడీ ఓట్ల శాతం 23.11 నుంచి 23 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ ఓట్లశాతం 9.48 నుంచి 8.71 శాతానికి తగ్గిపోయింది. ఎంఐఎం ఓట్ల శాతం 1.24 నుంచి 1.85 శాతానికి పెరిగింది. ఈ ఎన్నికలతో విపక్ష కూటమి బలహీనతలు బయటపడ్డాయి. ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను జనం విశ్వసించలేదని తేటతెల్లమవుతోంది. ‘జంగిల్‌రాజ్’ వద్దనుకొని, అభివృద్ధి, సుపరిపాలనకు ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది. 
తేజస్వీ అతికష్టం మీద ఎన్నిక
మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ అతికష్టం మీద గట్టెక్కారు. రాఘోపూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్‌పై 14,532 ఓట్ల తేడాతో గెలిచారు. తొలుత వెనుకంజలో ఉన్న తేజస్వీ చివరి రౌండ్లలో పుంజుకున్నారు. విపక్ష కూటమిలో మొహమ్మద్ షాబుద్దీన్ కుమారుడు ఒసామా సాహెబ్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థి సందీప్ గౌరవ్ గెలిచారు.
ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, మంత్రులు ప్రేమ్ కుమార్, మహేశ్వర్ హజారీ, సంజయ్ సరోగీ మరోసారి విజయం సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యరి్థగా తొలిసారి పోటీ చేసిన యువ గాయకురాలు మైథిలీ ఠాకూర్ గెలిచారు. ఆమె అలీనగర్ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థి బినోద్ మిశ్రాపై 11,730 ఓట్ల తేడాతో నెగ్గారు.


