ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకో అక్రమ ట్రెండ్‌కు తెరతీశారు. తమపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునే విషయంలో ఇతర అవినీతి నేతలందరికీ రోల్ మోడల్ అవుతున్నారు. ఎందుకంటే.. 2014-19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన స్కామ్‌లపై పెట్టిన కేసులను తానే ఎత్తేసుకుంటున్నారు మరి! రాష్ట్ర నేర విచారణ సంస్థ సీఐడీ అన్ని కోణాల్లో విచారించిన తరువాత పెట్టిన కేసులివి. ప్రభుత్వ ఉన్నతాధికారుల మేరకు నమోదైనవి.
చంద్రబాబు వీటిల్లో కొన్నింటిపై ముందస్తు బెయిల్ సంపాదించుకుంటే ఒక కేసులో మాత్రం జైలుకెళ్లారు. కానీ.. 2024లో అధికారంలోకి వచ్చిందే తడవు చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫైబర్ నెట్, మద్యం స్కామ్ కేసులను ఎత్తేయించుకున్నారు. తాజాగా స్కిల్ స్కామ్ కేసునూ లేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
యువకుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన పథకంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారన్నది ఈ స్కిల్‌స్కామ్. అంతర్జాతీయ సంస్థ సీమెన్స్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తాయని ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం పది శాతం అంటే రూ.300 కోట్లు పెడితే.. సీమెన్స్ రూ.3000 కోట్లు పెడుతుందని ఊరించారు. పైగా సీమెన్స్ కంపెనీ పైసా చెల్లించకుండానే ప్రభుత్వం రూ.330 కోట్లు కట్టేసింది. పుణేలోని జీఎస్టీ అధికారులు ఈ తేడాను గుర్తించారు. సీమెన్స్ అసలు, జీఎస్టీ రెండూ కట్టలేదని సమాచారమిచ్చినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈలోపు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో అసలు విషయం బట్టబయలైంది. అసలు సీమెన్స్ కంపెనీ ఈ ఒప్పందంలో భాగమే కాదన్న బోగస్ వ్యవహారంపై కేసు నమోదు చేసింది. కొందరిని అరెస్టు చేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు లావాదేవీలతో తమకు సంబంధం లేదని సీమెన్స్ స్పష్టం చేసింది. సీమెన్స్ మాజీ అధికారి ఒకరు మొత్తం కథ నడిపినట్లు విచారణలో తేలింది. రాష్ట్ర ప్రభుత్వం తనకు తెలియకుండా ఇందులో చిక్కుకుందా? లేక కుట్రపూరితంగానే జరిగిందా అన్న అంశం పరిశీలనకు వచ్చింది. ఆ సందర్భంలోనే ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా రూ.330 కోట్లు డిజిటెక్ అనే కంపెనీకి విడుదల చేసిందని వెల్లడైంది. సీఎం కోరినట్లుగా నిధులు విడుదల చేస్తున్నామని అధికారులు ఫైళ్లలోనే రాశారు. కేబినెట్‌తో సంబంధం లేకుండా ఈ భారీ మొత్తం దుర్వినియోగమైందని సీఐడీ గుర్తించింది. ఈ స్కామ్‌లో భాగస్వాములన్న అభియోగంపై అధికారులు కొందరిని అరెస్టు చేసింది. సీఎం హోదాలో చంద్రబాబు పాత్ర సాంతం నిర్ధారణ అయ్యాక ఆయనను కూడా అరెస్టు చేసింది. దీంతో రిమాండ్ రిపోర్టు ఆధారంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబును జైలుకు పంపారు.
ఈ కేసులో పలు షెల్ కంపెనీలకు ఈ స్కామ్ డబ్బు వెళ్లిందని, అక్కడి నుంచి సుమారు రూ.70 కోట్లు టీడీపీ బ్యాంక్ ఖాతాలోకి చేరాయని సీఐడీ అధికారులు కనిపెట్టారు. సీఐడీ ఇంత పక్కాగా దర్యాప్తు చేసినా టీడీపీ, జనసేనలు ఇదో అక్రమ కేసు అనే ప్రచారం చేశాయి. ఎల్లో మీడియా కూడా చంద్రబాబును అరెస్టు చేస్తారా? అంటూ చిందులు తొక్కింది. చివరికి న్యాయమూర్తిపై కూడా అభ్యంతకరమైన కథనాలు ప్రచురించింది. చివరకు చంద్రబాబు కేసుతో నిమిత్తం లేకుండా..ఆనారోగ్య కారణాలు చూపి హైకోర్టులో బెయిల్ పొందాల్సి వచ్చింది. హైకోర్టు కూడా కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేయడం.. విడుదలైన మరుక్షణమే చంద్రబాబు వాటిని బేఖాతరు చేయడం జరిగిపోయాయి. అది వేరే సంగతి.
ఈ నేపథ్యంలో 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత తన కేసులను ఎలా తొలగించుకునే బాధ్యతను ఒక లీగల్ ప్రముఖుడికి అప్పగించారని గతంలో వార్తలు వచ్చాయి. అంతకంటే ముందు చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో ఈ స్కామ్‌లపై విచారణ జరిపిన అధికారులపై, వైసీపీ నేతలపై రకరకాల కేసులు సృష్టించారు. పలువురిని అరెస్టు చేసి, ప్రజల దృష్టి మళ్లించారు. ఇంకో వైపు తన కేసుల మాఫీకి చర్యలు తీసుకున్నారు. అంతేకానీ... తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి సిద్దపడలేదు.
వెనుకటి రోజుల్లో తాను టెక్నికల్‌గా, లీగల్‌గా దొరకనని సభలలో అంటుండే వారు. కాని గత ప్రభుత్వం సాక్ష్యాలతో సహా కేసులు పెట్టడంతో వాటి నుంచి బయట పడడానికి చంద్రబాబు కోర్టు విచారణ బదులు కొత్తమార్గం కనిపెట్టారు. మద్యం, ఫైబర్‌నెట్ స్కామ్‌లలో తనపై ఫిర్యాదు చేసిన అధికారులను భయపెట్టి ఉపసంహరణ పిటిషన్లు వేయించారు. ఇది బెయిల్ కండిషన్లు ఉల్లంఘించడమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. స్కిల్ స్కామ్‌లో ‘మిస్టేక్ ఆఫ్ ప్యాక్ట్స్’ అని ఇంకో వ్యూహం ప్రయోగించారు. అప్పటి స్కిల్ కార్పొరేషన్ ఎండీకి ఒక నోటీసు పంపి, ఈ కేసు ఉపసంహరణలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియ చేయాలని కోరారట. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ టైమ్‌లో ఎవరు అభ్యంతరం చెబుతారు? నిజానికి అప్పటి కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డి స్కామ్‌పై ఫిర్యాదు చేశారట. కాని ఆయన అభిప్రాయం తీసుకోవడం లేదట. ఇలా అధికారంలో ఉన్నవారు తమపై వచ్చిన అవినీతి కేసులను తొలగించుకునే రీతిని న్యాయ వ్యవస్థ అంగీకరిస్తుందా అన్నది చర్చనీయాంశం. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం కింది కోర్టులు ఇలాంటి వాటిపై నిర్ణయాలు చేయరాదు. హైకోర్టులో జరగాలి.
చిత్రమేమిటంటే ఇంతవరకు చంద్రబాబుకు చెందిన రెండు కేసుల ఉపసంహరణకు సంబంధించిన ఆదేశాల సర్టిఫైడ్ కాపీలు న్యాయ స్థానం కూడా ఇవ్వడం లేదట. ఎందుకు కోర్టు ఇలా గోప్యత పాటిస్తుంది అనేదానిపై సోషల్ మీడియాలో పలు విశ్లేషణలు వచ్చాయి. ఇప్పటికే స్కిల్ కేసును ఈడీ అధికారులు విచారించారు. కాని కేంద్రంలో, రాష్ట్రంలో మారిన రాజకీయాలు, రెండు చోట్ల కూటమి ప్రభుత్వాలే ఉన్న రీత్యా వారికి వ్యతిరేకంగా కేసును ముందుకు సాగనివ్వదని భావిస్తున్నారు. ఈడీతో నిమిత్తం లేకుండా సీఐడీ ఈ కేసును ఎలా నీరుకార్చుతుందన్న ప్రశ్న వస్తుంది. సీఐడీ అప్పట్లో ఎలా కేసు పెట్టి అరెస్టు చేసింది? ఇప్పుడు అదే సీఐడీలో అధికారులు మారిపోతే కేసే ఉండకుండా పోతుందా? చట్టప్రకారం ఇది చెల్లుబాటు అవుతుందా అన్న చర్చలు సాగుతున్నాయి.
వచ్చే ఎన్నికలతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అప్పుడు ఈ కేసులన్నీ మళ్లీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందా? అనే మీమాంస కూడా ఉంది. దీనికి న్యాయ నిపుణులు అవుననే చెబుతున్నారు. ఇలా అధికారంలో ఉన్న వారు కేసు తీసివేసుకునే పద్ధతి ఉంటే భవిష్యత్తులో ఏ రాజకీయ నేత అయినా అధికారం సాధించుకుంటే అన్నీ మాఫ్ అవుతాయన్న భావన కలగదా?. గతంలో బీహారు ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను గడ్డి స్కామ్‌లో సీబీఐ అరెస్టు చేసి జైలులో పెట్టింది. ఆయన పదవికి రాజీనామా చేయగా, సతీమణి రబ్రీదేవి సీఎం అయ్యారు. కేసు విచారణ తర్వాత ఆయనకు శిక్ష పడింది. అలాగే హర్యానా ముఖ్యమంత్రిగా ఓం ప్రకాష్ చౌతాల కూడా టీచర్ల నియామక వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై శిక్షకు గురై జైలు జీవితం గడపాల్సి వచ్చింది. మరికొందరు నేతలు కూడా విచారణను ఎదుర్కున్నారు. వారికి కూడా ఇలాంటి కేసు ఉపసంహరణ మార్గాలకు సంబందించిన ఐడియాలు వచ్చి ఉంటే జైలుకు వెళ్లవలసిన అవసరం ఉండేది కాదేమో!.
బహుశా ఇలాంటి వాటినన్నటిని పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు లీగల్ టీమ్ వ్యూహాత్మకంగా అసలు కేసులు విచారణకే రాకుండా చేయడం ద్వారా వీటి నుంచి బయటపడవచ్చని భావించినట్లు ఉంది. అందుకు తగ్గట్లు ఆయా కేసులలో గతంలో ఫిర్యాదు చేసిన అధికారులతోనే కేసును విరమింప చేయిస్తున్నారు. లేదంటే ఇలా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో కొత్త వ్యూహం అమలు చేయాలని అనుకుని ఉండవచ్చు. ఇప్పటికే రెండు కేసుల నుంచి బయటపడ్డ చంద్రబాబు స్కిల్ స్కామ్ కు కూడా అదే ప్లాన్ చేసినట్లు అనుకోవాలి. ఏది ఏమైనా చంద్రబాబు టీమ్ వేసిన ఈ ప్లాన్ దేశంలోని ఇతర నేతలకు ఒక మార్గం చూపినట్లవుతుందా, న్యాయ వ్యవస్థ ఇలాంటి పెడపోకడలకు చెక్ పెడుతుందా? పెట్టదా?అనేవి ఆసక్తికరమైన అంశాలుగా ఉన్నాయి.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


