భారత సంస్కృతిలో జంతువులకు ఉన్న స్థానం ఉన్నతమైనది– నంది, గోవు, కాలభైరవుని వాహనమైన కుక్కలను పూజిస్తాం. అహింసా సిద్ధాంతాన్ని నమ్మిన దేశం అంటాం. కానీ కుక్క వీధిలో కనిపిస్తే రాళ్లు విసురుతున్నాం! దేశ అత్యున్నత న్యాయస్థానం వీధి జంతువులను ‘తొలగించండి‘ అని ఆదేశిస్తోంది. ఇది కేవలం చట్ట విరుద్ధం మాత్రమే కాదు, మన నాగరికతకూ విరుద్ధమే. వీధికుక్కల విషయంలో సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో మన సమాజం ఏ దిశగా సాగుతుందో ఆలోచించే సమయం వచ్చింది.
తాజా సుప్రీం కోర్టు ఆదేశాలు – కొన్ని ప్రదేశాల నుంచి వీధికుక్కలు, పశువులను తొలగించాలని చెప్పడం, ఇప్పటికే ఉన్న చట్టాలను పూర్తిగా విస్మరించటం. ‘యానిమల్ బర్త్ కంట్రోల్ (డాగ్స్) రూల్స్ – 2023’ ప్రకారం, వీధి కుక్కలను పట్టి, స్టెరిలైజ్ చేయించి, వ్యాక్సినేట్ చేసి తిరిగి అదే ప్రదేశంలో వదలడం తప్పనిసరి. ఇది కేవలం జంతు సంక్షేమం కోసం కాదు, మానవ సమాజం భద్రత కోసం కూడా! ‘తొలగించటం’ కాదు, ‘వ్యవస్థీకరించటం’ అని చట్టం స్పష్టంగా చెబుతోంది. కానీ, కోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులు ఈ చట్టానికే
విరుద్ధంగా ఉన్నాయి.
ఇదీ చదవండి: 100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద
సాధారణంగా, చట్టం చేయటానికి పార్లమెంట్, అమలు చేయటానికి కార్యనిర్వాహక శాఖ, పర్యవేక్షించటానికి న్యాయవ్యవస్థ ఉన్నాయి. అయితే న్యాయస్థానం కొన్ని సందర్భాల్లో నేరుగా పాలనా నిర్ణయాల్లాంటి ఉత్తర్వులు ఇస్తోంది. ఇది ‘జ్యుడీషియల్ ఓవర్ రీచ్’ అని పిలవబడుతుంది. ఎన్నికల ద్వారా ఎన్నికవ్వని కొద్ది మంది న్యాయమూర్తులు ప్రజా జీవితంపై ఇంత ప్రభావం చూపడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
భారత రాజ్యాంగం ప్రతి జీవికీ ‘జీవన హక్కు’ (ఆర్టికల్ 21) ఇచ్చింది. సుప్రీం కోర్టే ఎన్నో తీర్పుల్లో ఈ హక్కు మానవులకే కాకుండా జంతువులకు కూడా వర్తిస్తుందని స్పష్టంగా చెప్పింది. అలాంటప్పుడు, వాటిని ‘తొలగించండి’ అనే ఆదేశం ఆ హక్కుకే విరుద్ధం. జంతువుల పట్ల దయ చూపడం కేవలం ‘ప్రేమ’ కాదు. అది నాగరికత ప్రథమ లక్షణం. సర్కారు, న్యాయస్థానం, ప్రజలు అందరూ కలిసే ఈ విలువను కాపాడాలి. జంతువులను దూరం చేయడం కాదు, వాటితో సహజీవనం నేర్చుకోవడం మన బాధ్యత. మన దేశం తన హృదయాన్ని కోల్పోయినట్లయితే తిరిగి దాని మూలాల్ని వెతకటానికి ఇదే సరైన సమయం.
ఇదీ చదవండి: 20 ఏళ్ల స్టార్‌డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం
– తలకోల రాహుల్‌రెడ్డి ‘ మౌలిక సదుపాయాల విశ్లేషకుడు


