భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ సౌకర్యాన్ని మెరుగుపరచడం ద్వారా సమగ్ర ఆర్థిక వృద్ధిని సాధించవచ్చని ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తున్నాయి. ఈ క్రమంలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు (సీఐసీ) ప్రతిపాదించిన ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’(GCS)లో నాన్-క్రెడిట్ డేటాను చేర్చాలనే ఆలోచన కీలకంగా మారనుంది.
బడ్జెట్ ప్రతిపాదనలు
2025-26 కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రత్యేకమైన ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్(GCS)’ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించింది. దీన్ని అనుసరించి సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్‌పీరియన్ వంటి ప్రముఖ సీఐసీలు తమ సొంత గ్రామీణ క్రెడిట్ స్కోర్‌లను రూపొందించడం ప్రారంభించాయి. ప్రస్తుతం ఈ స్కోర్లు కేవలం గతంలో తీసుకున్న అప్పుల చెల్లింపులు, క్రెడిట్ మిక్స్, వినియోగం వంటి సంప్రదాయ పారామీటర్ల ఆధారంగానే లెక్కించబడుతున్నాయి.
నాన్ క్రెడిట్ డేటా ఆవశ్యకత
గ్రామీణ ప్రాంతాల్లోని మెజారిటీ ప్రజలు ‘థిన్ ఫైల్’ కేటగిరీ కిందకు వస్తారు. అంటే వీరికి గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న చరిత్ర (Credit History) చాలా తక్కువగా ఉంటుంది లేదా అసలు ఉండదు. కేవలం రుణ చరిత్రపైనే ఆధారపడితే, వీరికి బ్యాంకులు అప్పు ఇవ్వడానికి వెనుకాడతాయి. ఈ అడ్డంకిని అధిగమించడానికి సీఐసీలు ఆర్‌బీఐ, ప్రభుత్వాన్ని నాన్ క్రెడిట్ డేటా వినియోగానికి అనుమతించాలని కోరుతున్నాయి. ఇందులో ప్రధానంగా..
విద్యుత్తు బిల్లుల చెల్లింపులు
నీటి పన్ను, గ్యాస్ సిలిండర్ చెల్లింపులు
ల్యాండ్‌లైన్, మొబైల్ బిల్లులు వంటి యుటిలిటీ చెల్లింపులను పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రయోజనాలు
యుటిలిటీ బిల్లుల చెల్లింపు రికార్డులను క్రెడిట్ స్కోర్‌లో చేర్చడం వల్ల చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. ఒక వ్యక్తి క్రమం తప్పకుండా విద్యుత్ లేదా మొబైల్ బిల్లులు చెల్లిస్తున్నారంటే, అతనికి ఆర్థిక క్రమశిక్షణ ఉందని అర్థం. ఇది రుణగ్రహీత ‘క్రెడిట్‌వర్తినెస్’ను అంచనా వేయడానికి సహాయపడుతుంది. గతంలో బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వారికి కూడా క్రెడిట్ స్కోర్ లభించడం వల్ల వారు సులభంగా రుణాలు పొందవచ్చు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణగ్రహీతల ప్రవర్తనను లోతుగా విశ్లేషించడం ద్వారా మొండి బకాయిల ముప్పును తగ్గించుకోవచ్చు.
చట్టపరమైన, సాంకేతిక సవాళ్లు
ప్రస్తుతం సీఐసీలు 2005 క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ (రెగ్యులేషన్) యాక్ట్ (CICRA) పరిధిలో పనిచేస్తున్నాయి. ప్రస్తుత నియమాల ప్రకారం, కేవలం ఆర్థిక లావాదేవీల డేటాను మాత్రమే సేకరించే వీలుంది. నాన్ క్రెడిట్ డేటాను వాడాలంటే ఈ చట్టపరమైన నిబంధనల్లో మార్పులు లేదా ప్రత్యేక అనుమతులు అవసరం. అందుకే సీఐసీలు తమ అభ్యర్థనలో సీఐసీఆర్‌ఏ చట్టపరిధిని గౌరవిస్తూనే, కాలానుగుణంగా మార్పులు చేయాలని కోరుతున్నాయి.
గ్రామీణ భారతం డిజిటల్ చెల్లింపుల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో యుటిలిటీ బిల్లుల వంటి డేటాను క్రెడిట్ స్కోరింగ్‌లో చేర్చడం అనేది ఒక విప్లవాత్మక నిర్ణయం అవుతుంది. ఇది కేవలం బ్యాంకులకే కాకుండా చిరు వ్యాపారులు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలకు సరసమైన వడ్డీకి రుణాలు అందేలా చేస్తుంది. ఆర్‌బీఐ, ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సానుకూల నిర్ణయం తీసుకుంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.
ఇదీ చదవండి: క్విక్ కామర్స్.. గిగ్ వర్కర్ల సమస్యలివే..


