భారతదేశ ఆర్థిక వ్యవస్థలో గిగ్ ఎకానమీ కీలక పాత్ర పోషిస్తోంది. ఆహార పంపిణీ (Swiggy, Zomato), రవాణా (Ola, Uber), నిత్యావసరాల డెలివరీ (Blinkit, Zepto) వంటి సర్వీసులు మన జీవనశైలిలో భాగమయ్యాయి. అయితే, ఈ సౌకర్యాల డెలివరీలో భాగంగా ఉన్న లక్షలాది మంది గిగ్ వర్కర్ల జీవితాలు మాత్రం అనేక సవాళ్లతో, అభద్రతతో నిండి ఉన్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు చేపట్టిన నిరసనలు ఈ సమస్యల తీవ్రతను బహిర్గతం చేస్తున్నాయి.
గిగ్ వర్కర్ల సమస్యలు
సాంప్రదాయ ఉద్యోగులకు ఉండే హక్కులు ఏవీ గిగ్ వర్కర్లకు వర్తించవు. వారిని ఉద్యోగులు అని పిలవకుండా పార్టనర్లు(Partners) అని కంపెనీలు సంబోధిస్తాయి. దీనివల్ల వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఇవే..
ఆదాయ అస్థిరత.. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. కానీ ప్లాట్‌ఫామ్‌లు ఇచ్చే కమీషన్లు తగ్గుతున్నాయనే వాదనలున్నాయి. దీనివల్ల వారి నికర ఆదాయం పడిపోతోంది. కనీస వేతన గ్యారంటీ లేకపోవడం అతిపెద్ద లోపం.
అల్గారిథమ్ నియంత్రణ.. డెలివరీ భాగస్వాములకు ఆర్డర్లు కేటాయించేది ఒక సాఫ్ట్‌వేర్ అల్గారిథమ్. ఏ కారణం చెప్పకుండానే సడన్‌గా ఐడీ(ID) బ్లాక్ చేయడం వల్ల ఒక్కసారిగా వారి ఉపాధి కోల్పోతున్నారు.
పని వేళలు.. రోజుకు 12 నుంచి 15 గంటలు పనిచేస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితి నెలకొంది. దీనివల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది.
క్విక్ కామర్స్ రంగంలో గిగ్‌వర్కర్ల కష్టాలు
ప్రస్తుత రోజుల్లో ‘10 నిమిషాల డెలివరీ’(Quick Commerce) పోటీ పెరిగింది. ఇది వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ గిగ్ వర్కర్లకు మాత్రం శాపంగా మారింది. పది నిమిషాల్లో డెలివరీ ఇవ్వాలనే ఉద్దేశంతో త్వరగా చేరుకోవాలనే ఒత్తిడి వల్ల డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, అతివేగంగా వెళ్లడం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. డెలివరీ ఆలస్యమైతే కంపెనీలు వేసే జరిమానాలు, కస్టమర్ల నుంచి వచ్చే తక్కువ రేటింగ్ వారి జీతాలపై ప్రభావం చూపుతున్నాయి.
డిమాండ్లు
క్రిస్మస్ (డిసెంబర్ 25) నుంచి న్యూ ఇయర్ (డిసెంబర్ 31) వరకు దేశవ్యాప్తంగా క్విక్ కామర్స్ విభాగంలో పని చేస్తున్న గిగ్ వర్కర్లు అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రధానంగా కింది డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.
కనీస ఆదాయ భద్రత.. పెట్రోల్ అలవెన్స్‌తో కలిపి కిలోమీటరుకు కనీసం రూ.20 చెల్లించాలి.
10-మినిట్స్ డెలివరీ రద్దు.. కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టే ఈ మోడల్‌ను ఉపసంహరించుకోవాలి.
సామాజిక భద్రత.. ప్రమాద బీమా (Accident Insurance), ఆరోగ్య బీమా, పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించాలి.
న్యాయబద్ధమైన ఐడీ బ్లాకింగ్.. సరైన కారణం లేకుండా, వివరణ తీసుకునే అవకాశం ఇవ్వకుండా ఐడీలను బ్లాక్ చేయకూడదు.
గిగ్ వర్కర్లు ఆధునిక ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివారు. కేవలం లాభాలే ధ్యేయంగా కాకుండా వారి కష్టానికి తగిన ప్రతిఫలం, సామాజిక గౌరవం, భద్రత కల్పించినప్పుడే ఈ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. గిగ్ వర్కర్ల సమస్యలపై ప్రభుత్వం మరింత చర్చించి ఇటు కంపెనీలు, అటు వర్కర్లకు అనువైన నియమాలు అమోదించాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి.
ఇదీ చదవండి: రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం


