అభిప్రాయం
సుమారు రెండేళ్ళ క్రితం నాటి ఘటన. డెలివరీ బాయ్ ఇంటి తలుపు తట్టాడు. వస్తువును అందుకునేందుకు తలుపు తెరవగానే ఆతని చీలమండపై లోతైన గాయం కనిపించింది. చిరిగిన ప్యాంటు అతని యాక్సిడెంట్ గురించి చెప్పకనే చెబుతోంది. నొప్పిని ఓర్చుకుంటూనే చెప్పిన సమయానికే వస్తువును అందజేశాడు. నేను ఊహించినట్లుగానే, అతని స్కూటర్‌ను ఏదో కారు ఢీకొట్టిందని తెలి సింది. కిందపడి గాయపడ్డాడు. అదృష్టవశాత్తు, స్కూటర్‌కు ఏమీ కాలేదని అతను ఊరట చెందడం నన్నింకా బాధించింది. అది అతనికి దినసరి అద్దెపై ఇచ్చింది కనుక, దానికి ఏమైనా అయితే, అతని అరకొర ఆదాయానికి మరింత చిల్లుపడుతుంది.
నైతిక బాధ్యతగా భావించి ఒకటి రెండు బ్యాండ్–ఎయిడ్లు, ఒక 200 రూపాయల నోటు అతని చేతిలో పెట్టాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొమ్మని ఒక సలహా కూడా ఇచ్చాను. కానీ అతను ఆ నోటును జేబులో కుక్కుకుని, మళ్ళీ పనిలో పడతాడనే అనిపించింది. అతనికి గాయానికి ఏదో మందు పూయించుకోవ డమో లేదా కట్టు కట్టించుకోవడమో చేసేంత వ్యవధి కూడా లేదు. ఇతని తప్పిదం వల్లనే ఆ యాక్సిడెంట్ అయివుంటుందని కూడా నా అనుమానం. డెలివరీ బాయ్‌లు తాము తీసుకెళుతున్నవాటిని వీలై నంత త్వరగా అందించాలన్న తొందరలో ట్రాఫిక్ సిగ్నల్స్ పట్టించు కోకపోవడం, రాంగ్ సైడులో వెళ్ళిపోవడం నేను అంతకుముందు గమనించక పోలేదు.
ట్రాఫిక్ ఉల్లంఘనలు
అంత హడావిడి పడవలసిన అవసరం లేదని వారికి పని ఇస్తున్న క్విక్–సర్వీస్ కంపెనీలు వాదిస్తాయి. ఆ రంగం పరిభాషలో వారు ‘భాగస్వాముల’ కింద కూడా లెక్క. తాము వారికి సరుకును అందించే ‘గుప్త’ ప్రదేశాలు, గమ్యస్థానాలకు తక్కువ సమయంలో వెళ్ళదగినవిగానే ఉంటాయని అవి చెబుతాయి. సిద్ధాంతం ప్రకారం డెలివరీ బాయ్ నడచుకుంటూ వెళ్ళి కూడా ఇచ్చి రావచ్చు. వారు గంటకు సగటున 15 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళుతున్న మాట కూడా నిజం. అయినా, వారు ట్రాఫిక్ రూల్స్‌ను ఎప్పటి కప్పుడు ఎందుకు అతిక్రమిస్తున్నట్లు? ఒక్క బెంగళూరు నగరంలోనే, 2025లో వీరు దాదాపు 64,000 ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలింది. ఇది నవంబర్ 15 నాటి వరకు అందు బాటులో కొచ్చిన డేటా మాత్రమే.
మరి, డెలివరీ బాయ్‌లు ఎందుకంత పరుగులు తీస్తున్నట్లు? ఈ ప్రశ్నకు జవాబు క్విక్–సర్వీస్ రంగ లాభ నష్టాల లెక్కల్లో ఉంది. బాయ్‌లు గంటకు సగటున రూ. 102 సంపాదిస్తారని కామర్సు కంపెనీలు పేర్కొంటున్నాయి. అవి తమకయ్యే ఖర్చును లెక్కలోకి తీసుకోవడం లేదని యూనియన్లు చెబుతున్నాయి. పెట్రోల్, మెయింటెనెన్స్ ఖర్చులు పోగా, మహా అయితే, గంటకు రూ. 81 చొప్పున లభిస్తుందని అవి అంటున్నాయి. నెలకు 26 రోజులు ఎవరన్నా రోజుకు 10 గంటలు పనిచేస్తే వచ్చేది రూ. 21,000. నెలకి ఆ పాటి సంపాదించాలన్నా ఆ 10 గంటల లోపల డెలివరీ వర్కర్ 30–35 ట్రిప్పులు వేయాలి. ఒక డెలివరీ పూర్తి చేసి, దాన్ని యాప్‌లో మార్క్ చేసిన తర్వాతనే, అతనికి మరో ట్రిప్పునకు అవకాశం లభిస్తుంది. వారికి వెంట వెంటనే డెలివరీ అవకాశాలు రావు. కొంత సమయం వేచి ఉండక తప్పదు. అందుకని వేగంగా చేరవేస్తే మరో అసైన్‌మెంట్ లభిస్తుందని తాపత్రయపడతారు.
సరుకును అందివ్వడంలో మందకొడిగా వ్యవహరిస్తే వర్కర్లు పరోక్షంగా శిక్షకు గురవుతారని యూనియన్లు వెల్లడిస్తున్నాయి. అంతకుముందు వెన్ను తట్టి ఇచ్చిన ‘బ్యాడ్జీ’లను కంపెనీలు వెనక్కి తీసేసుకుంటాయి. ఆ మేరకు డెలివరీ అవకాశాలు తగ్గిపోతాయి. ఇంతమందికి చేర్చగలిగితే అంటూ లక్ష్యాలు నిర్దేశించి, వాటిని పూర్తి చేసినవారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఇది వారు బండ్లు నడపడంలో వ్యక్తిగత భద్రతను గాలికొదిలేసేటట్లు చేస్తోంది.
శ్రమ–ఒత్తిడి
అయినా, వేలాది మంది ఈ ఉద్యోగానికి ఎందుకు తరలి వస్తున్నట్లు? ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు లేకపోబట్టే అని దానికి జవాబు చెప్పుకోవచ్చు. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఉద్యోగాలు రెండూ అంతగా లేకపోవడంతో, వారికి ఇంతకన్నా గత్యంతరం కనిపించడం లేదు. దేశంలో గిగ్ వర్కర్లలో దాదాపు మూడొంతుల మంది 24–38 ఏళ్ళ మధ్య వయసు వర్గం వారని వివిధ సర్వేలలో తేలింది. వారిలో చాలా మంది మిడిల్ లేదా హైస్కూలు విద్యతో ఆపేసినవారని మరికొన్ని సర్వేల్లో వెల్లడైంది. దీన్ని బట్టి వారు ఏదైనా మంచి ఉద్యోగం లభిస్తుందేమోనని కొంత కాలం ఎదురు చూసి, ఆ తర్వాత, క్విక్–కామర్స్ డెలివరీలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారని స్పష్టమవుతోంది.
కానీ ఈ ఉద్యోగాల్లో చేరుతున్నవారిలో చాలామంది శ్రమ, ఒత్తిడి తట్టుకోలేక మూడు నెలల లోపలే వీడ్కోలు పలుకుతున్నారు. సత్వర సేవ సంస్థల మధ్య ముఖ్యంగా బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టోల మధ్య పోటీ పెరిగింది. వేటికవి వ్యాపార విస్తరణకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫలితంగా, చేతులూ కాల్చుకుంటు న్నాయి. ఉదాహరణకు, కడచిన నాలుగు త్రైమాసికాలలో బ్లింకిట్‌కు వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచన వంటివాటికి ముందు ఆదాయాన్ని సర్దుబాటు చేసి చూసినా కూడా దాదాపు రూ. 600 కోట్ల నష్టం వచ్చినట్లు చెబుతున్నారు. ఉద్యోగుల స్టాక్ యాజమాన్య ప్రణాళికను మినహాయించగా తేలిన లెక్క అది.
అంటే, అసలు నష్టం అంతకన్నా ఇంకా ఎక్కువే ఉండవచ్చు. బ్లింకిట్ తమ వేదిక, డెలివరీ రుసుము కింద కొద్ది మొత్తాన్ని వసూలు చేస్తోంది. స్విగ్గీ ఒక నిర్దిష్ట మొత్తానికి మించిన విలువైన ఆర్డర్లకు ఏ రకమైన చార్జీలూ వసూలు చేయడం లేదు. దీంతో క్విక్–కామర్స్ రంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వ్యయాలు మరీ పెరగకుండా చూసుకుంటూనే, సేవలను మరిన్ని విభాగాలకు పెంచి, మరింత మంది కస్టమర్లను కూడగట్టుకోవాలి. ఇంకా ఎక్కువ రాయితీలు ఆఫర్ చేయాలి. అదే సమయంలో, డెలివరీకి మరింత మంది సిబ్బందిని తీసుకోవాలి.
ఇదొక దురవస్థ
అయితే, గత కొద్ది నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు ఉపాధి అవకాశాలు (వార్షికంగా లెక్కగట్టి చూసినపుడు) 4.5 శాతం నుంచి 5 శాతం రేటు చొప్పున పెరిగినట్లు ‘సెంటర్ ఫర్ మానిట రింగ్ ఇండియన్ ఎకానమీ’ చెబుతోంది. గత ఏడాది అదే కాలంతో పోల్చి చూసినపుడు ఆ రకమైన మెరుగుదల కనిపించినట్లు అది పేర్కొంది. ‘కోవిడ్’ తర్వాత ఉద్యోగ వృద్ధిలో ఇదే వేగవంతమైన రేటు. దాంతో గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి తిప్పలు పడాల్సిన అవసరం తప్పుతోంది. గ్రామాలకు తిరిగి వెళ్లినా ఫరవాలేదని భరోసా ఏర్పడుతోంది. మరింత నగదు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, సమ్మెకు దిగడానికి గిగ్ వర్కర్లకు అందుకే ధైర్యం వచ్చింది.
కానీ, దురదృష్టవశాత్తు, ఇది ఈ రంగంలోని అందరికీ నష్ట దాయకంగానే ఉంది. మూసేయకుండా వ్యాపారం కొనసాగించా లంటే, క్విక్–కామర్స్ సంస్థలు ఇప్పటికన్నా ఎక్కువ ఇవ్వగలిగిన స్థితిలో లేవు. ఇంతోటి ఆదాయానికి అంత ఒత్తిడిని తట్టుకోవడం అవసరమా అని డెలివరీ వర్కర్లు భావిస్తున్నారు. ఇంకో వైచిత్రి ఏమిటంటే, ప్రారంభ స్థాయి వైట్–కాలర్ ఉద్యోగులకన్నా, ప్రస్తుతా నికి డెలివరీ వర్కర్లు గడిస్తున్నదే కాస్త ఎక్కువ. అలాగని ఎంబీఏ డిగ్రీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు రాలేరు కదా! ఇది సత్వర పరిష్కారం కనుచూపు మేరలో కనిపించని ప్రతిష్టంభన.
అనింద్యో చక్రవర్తి
వ్యాసకర్త ఆర్థికాంశాల విశ్లేషకుడు
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)


