10 ని.డెలివరీకి స్వస్తి.. బిజినెస్‌పై ప్రభావమెంత? | Experts emphasize that 10-minute delivery branding quick commerce | Sakshi
Sakshi News home page

10 ని.డెలివరీకి స్వస్తి.. బిజినెస్‌పై ప్రభావమెంత?

Jan 15 2026 11:46 AM | Updated on Jan 15 2026 12:33 PM

Experts emphasize that 10-minute delivery branding quick commerce

ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న క్విక్ కామర్స్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. బ్లింకిట్ (Blinkit), జెప్టో (Zepto), స్విగ్గీ (Swiggy) వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్స్ తమ బ్రాండింగ్ నుంచి ‘10 నిమిషాల డెలివరీ’ అనే విధానాన్ని తొలగించాయి. అయితే, ఈ మార్పు కేవలం బ్రాండింగ్‌కు మాత్రమే పరిమితమని, వారి వ్యాపార విధానంలో ఎలాంటి మార్పు లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇటీవలి మార్పులు ఇవే

  • బ్లింకిట్ తన యాప్‌లో ‘10-నిమిషాల’ టైమ్‌లైన్‌ను తొలగించి ‘30,000+ ఉత్పత్తులు మీ ఇంటి వద్దకే’ అనే కొత్త ట్యాగ్‌లైన్‌ను ప్రవేశపెట్టింది. అలాగే, వినియోగదారులకు తమ దగ్గరలోని డార్క్ స్టోర్(ఆన్‌లైన్ ఆర్డర్లను ప్యాక్ చేసి డెలివరీ చేసే కేంద్రాలు) దూరాన్ని చూపుతూ, తక్కువ దూరం వల్ల వేగంగా డెలివరీ సాధ్యమవుతుందని వివరిస్తోంది.

  • జెప్టో తమ సైట్, యాప్‌లో ‘నిమిషాల్లో అన్నీ’ అని ట్యాగ్‌లైన్‌లో మార్పులు చేసింది.

  • స్విగ్గీ కూడా తన క్విక్ కామర్స్ విభాగం నుంచి 10 నిమిషాల డెలివరీ క్లెయిమ్‌ను తొలగించింది.

ప్రభుత్వ జోక్యం..

ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా క్విక్ కామర్స్ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. డెలివరీ భాగస్వాముల భద్రత, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ బ్రాండింగ్ మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డెలివరీ రైడర్లు నిర్ణీత సమయానికి చేరుకోవాలనే ఒత్తిడికి గురికాకుండా చూడటమే ఈ చర్యల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం

బిజినెస్ మోడల్‌లో మార్పు లేదు: నిపుణులు

బ్రాండింగ్‌లో మార్పులు వచ్చినప్పటికీ, వినియోగదారులకు అందే సర్వీసుల్లో పెద్దగా మార్పు ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వారి వివరాల ప్రకారం.. క్విక్ కామర్స్ సంస్థల డార్క్ స్టోర్లు ఇప్పటికే గిరాకీ ఉన్న ప్రాంతాలకు 10-15 నిమిషాల దూరంలోనే ఉన్నాయి. కాబట్టి డెలివరీ వేగంపై దీని ప్రభావం తక్కువగా ఉంటుంది. డెలివరీ సమయం అనేది స్టోర్ దూరం, ట్రాఫిక్, వాతావరణం, రైడర్ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. ‘10 నిమిషాల్లో డెలివరీ’ అనేది ఒక మార్కెటింగ్ నినాదం మాత్రమే తప్ప, అది హామీ కాదు. ఈ విధానాన్ని తొలగించడం ద్వారా కంపెనీల బిజినెస్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని చెబుతున్నారు.

ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement