ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పని సంస్కృతికి అనుగుణంగా భారతదేశంలో గిగ్ (Gig), ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఉపాధి రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. కేవలం పార్ట్-టైమ్ ఆదాయ వనరుగా మొదలైన ఈ రంగం, నేడు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగమైంది. ఈ నేపథ్యంలో గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం, నిపుణులు ప్రతిపాదిస్తున్న నూతన విధానాలపై కథనం.
నీతి ఆయోగ్ అంచనాలు
నీతి ఆయోగ్ 2022 నివేదిక ప్రకారం, గిగ్ రంగంలో ఉపాధి పొందుతున్న వారిలో నైపుణ్యాల విభజన ఆసక్తికరంగా ఉంది.
మధ్యస్థ నైపుణ్యాలు: 47%
అధిక నైపుణ్యాలు: 22%
తక్కువ నైపుణ్యాలు: 31%
భవిష్యత్తులో అధిక, తక్కువ నైపుణ్యాలు కలిగిన గిగ్ ఉద్యోగాల వాటా మరింత పెరుగుతుందని అంచనా. ఈ వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ‘సామాజిక భద్రతా కోడ్-2020’ గిగ్ కార్మికులను ప్రత్యేక వర్గంగా గుర్తించింది. ఇది వారి ఆదాయం, కెరీర్ మార్గాలకు తగిన రక్షణ కల్పించేందుకు పునాది వేసింది.
మౌలిక వసతులు
గిగ్ కార్మికుల కోసం కొత్తగా వ్యవస్థలను నిర్మించాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే ఉన్న డిజిటల్ మౌలిక వసతులను వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో ఇప్పటివరకు 31.38 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులు నమోదయ్యారు. ఆధార్‌తో అనుసంధానమైన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) నంబర్ ద్వారా కార్మికులు తమ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ లేదా రాష్ట్రాలు మారినా వారిని ట్రాక్ చేయడం సులభమవుతుంది. ఈ-శ్రమ్ గుర్తింపును సామాజిక భద్రతా సంస్థలతో అనుసంధానిస్తే కార్మికులు తాత్కాలిక లేదా శాశ్వత ఉద్యోగాల్లోకి మారినా రక్షణ వ్యవస్థ కొనసాగుతుంది.
ఆర్థిక వృద్ధి, బీమా రక్షణ
కొన్ని సంస్థల గణాంకాల ప్రకారం, 2021-22 నుంచి 2023-24 మధ్య ఆహార డెలివరీ రంగం చాలా వృద్ధిని సాధించింది. ఇది సుమారు 13.7 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ రంగం స్థూల ఉత్పత్తి విలువ రూ.1.2 లక్షల కోట్లను దాటింది. ఈ వృద్ధిని సామాజిక భద్రతతో ముడిపెట్టడానికి బీమా రక్షణ ఉత్తమ మార్గమని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ సభ్యులకు అందుతున్న ఈడీఎల్‌ఐ (రూ.7 లక్షల వరకు జీవిత బీమా) పథకాన్ని గిగ్ కార్మికులకు కూడా వర్తింపజేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. దీనివల్ల సిబ్బంది ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే కుటుంబానికి భరోసా లభిస్తుంది.
చిన్న మొత్తాల్లో కట్ అయ్యేలా..
గిగ్ కార్మికులకు స్థిర వేతనం ఉండదు కాబట్టి, ప్రతి రైడ్ లేదా డెలివరీ పూర్తయినప్పుడు చిన్న మొత్తాన్ని (Micro-contribution) ఆటోమేటిక్‌గా కట్ అయ్యే లావాదేవీ ఆధారిత విధానం వీరికి అత్యంత అనుకూలమని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: ఐటీ రంగంలో పుంజుకుంటున్న ‘డిస్క్రెషనరీ’ ఖర్చులు


