జీతం, పని పరిస్థితులు, సామాజిక భద్రత లేకపోవడంతో పాటి.. 10 నిమిషాల డెలివరీ సర్వీస్ వంటివాటిని నిరసిస్తూ గిగ్ వర్కర్లు సమ్మె నిర్వహించారు. దీనిపై కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్ మాండవీయ స్పందిస్తూ.. 10 నిమిషాల డెలివరీ సర్వీస్ విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు.
కేంద్రమంత్రి ఈ ప్రకటన చేయడానికంటే ముందు.. డెలివరీ సమయపాలనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి బ్లింకిట్ , జెప్టో, జొమాటో & స్విగ్గీ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లతో ఒక సమావేశం నిర్వహించారు. బ్లింకిట్ ఇప్పటికే 10 నిమిషాల డెలివరీ విధానం తొలగించింది. ఇక త్వరలోనే ఇతర అగ్రిగేటర్లు కూడా దీనిని అనుసరిస్తారని పేర్కొన్నారు.
10 నిమిషాల డెలివరీ వల్ల సమస్యలు!
ప్రస్తుత రోజుల్లో ‘10 నిమిషాల డెలివరీ’ పోటీ పెరిగింది. ఇది వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ గిగ్ వర్కర్లకు మాత్రం శాపంగా మారింది. పది నిమిషాల్లో డెలివరీ ఇవ్వాలనే ఉద్దేశంతో త్వరగా చేరుకోవాలనే ఒత్తిడి వల్ల డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, అతివేగంగా వెళ్లడం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. డెలివరీ ఆలస్యమైతే కంపెనీలు వేసే జరిమానాలు, కస్టమర్ల నుంచి వచ్చే తక్కువ రేటింగ్ వారి జీతాలపై ప్రభావం చూపుతున్నాయి.
10 నిమిషాల డెలివరీ ఉద్దేశ్యం..
10 నిమిషాల డెలివరీ సర్వీస్.. డెలివరీ ఏజెంట్స్ లేదా రైడర్లపై ఒత్తడి తెస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో, దీపిందర్ గోయల్ స్పందిస్తూ..ఇళ్ల చుట్టుపక్కల్లో దుకాణాలు ఎక్కువ కావడం వల్లనే 10 నిమిషాల డెలివరీ అనేది తీసుకొచ్చాము. దీని ఉద్దేశ్యం డెలివరీ ఏజెంట్ వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాలని కాదని అన్నారు. అంతే కాకుండా డెలివరీ కోసం కస్టమర్లకు ఇచ్చిన టైమర్.. డెలివరీ ఏజెంట్లకు కనిపించదని వెల్లడించారు.
కార్మికుల భద్రత గురించి వివరిస్తూ.. డెలివరీ భాగస్వాములకు వైద్య, జీవిత బీమా ఉందని గోయల్ అన్నారు. ఆలస్యానికి జరిమానాల విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ.. డెలివరీ ఏజెంట్స్.. సమయానికి అందించకపోతే ఏమీ జరగదు. కొన్నిసార్లు అనుకోకుండా ఆలస్యాలు జరుగుతాయని గోయల్ వెల్లడించారు.


