రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై పశువుల సంచారంపై నిషేధం
విద్యా సంస్థలు, ఆస్పత్రులు, బస్టాండ్లకు తక్షణమే ఫెన్సింగ్
ఆయా చోట్ల పట్టుకున్న కుక్కలకు షెల్టర్లలోనే ఆశ్రయం
ఆదేశాల అమలు చీఫ్ సెక్రటరీల వ్యక్తిగత బాధ్యత
కుక్క కాటు ఘటనలపై సుప్రీంకోర్టు వరుస ఆదేశాలు
జంతు ప్రేమికుల వాదనలు పట్టించుకోని న్యాయస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కుక్క కాటు ఘటనలు, వీధి కుక్కల బెడద పెరిగిపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేసింది. పౌరుల భద్రత, ముఖ్యంగా చిన్నారులు, రోగుల రక్షణకు అత్యంత ప్రాధాన్య మిస్తూ సంచలన, చరిత్రాత్మక ఆదేశాలను జారీ చేసింది. పాఠశాలలు, ఆస్పత్రులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి సున్నితమైన ప్రాంతాల ప్రాంగణాల్లో వీధి కుక్కలను పూర్తిగా లేకుండా చేయాలని స్పష్టం చేసింది.
ఆయా ప్రాంతాల్లో పట్టుకున్న కుక్కలను స్టెరిలైజేషన్ తర్వాత కూడా.. తిరిగి అదే ప్రదేశంలో వదిలిపెట్టరాదని రాష్ట్రాలను కఠినంగా ఆదేశించింది. వాటిని షెల్టర్లకు తరలించాల్సిందేనని పేర్కొంది. ఇదే సమయంలో, జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై పశువుల విచ్చలవిడి సంచారంపైనా సుప్రీంకోర్టు ఉక్కు పాదం మోపింది. రోడ్లపై సంచరించే పశువులను తక్షణమే గోశాలలకు తరలించాలని కుండబద్దలు కొట్టింది.
ఈ ఆదేశాల అమలులో రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులే (చీఫ్ సెక్రటరీలు) వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌వీ అంజారియాల త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కుక్కకాటు ఘ టనలు పెరగటం ఆందోళనకరం, ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని ధర్మాసనం పేర్కొంది.
వాటిని వదలొద్దు..
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రెండు వారాల్లోగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు (స్కూళ్లు, కాలేజీలు), ఆస్పత్రులు, పబ్లిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, బస్టాండ్‌లు, డిపోలు, రైల్వే స్టేషన్లను గుర్తించాలి. ఈ ప్రాంగణాల్లోకి వీధి కుక్కలు చొరబడకుండా గేటుతోపాటు చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ లేదా ఇతర భద్రతా ఏర్పాట్లు చేయాలి. స్థానిక మున్సిపాలిటీలు, పంచాయతీలు ఈ ప్రాంగణాల్లో సంచరించే వీధి కుక్కలను తక్షణమే పట్టుకోవాలి.
యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) నిబంధనల ప్రకారం వాటికి వ్యాక్సిన్, స్టెరిలైజేషన్ చేయించాలి. అత్యంత ముఖ్యంగా, ఈ ప్రాంగణాల్లో పట్టుకున్న కుక్కలను స్టెరిలైజేషన్ తర్వాత కూడా.. తిరిగి అదే ప్రాంతంలో వదిలిపెట్టడానికి వీల్లేదు. వాటిని కచ్చితంగా షెల్టర్ హోంలకు తర లించాలి. వాటిని తిరిగి అక్కడే వదిలిపెడితే, ఈ సంస్థలను కుక్కల బెడద నుంచి విముక్తి చేయా లన్న తమ ఆదేశాల అసలు ఉద్దేశమే దెబ్బ తింటుందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.
మూడు నెలలకోసారి తనిఖీలు
మూడు నెలలకోసారి అధికారులు విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల ప్రాంగణాలను తనిఖీ చేసి, కుక్కలు లేవని నిర్ధారించుకోవాలి. ఈ ఆదేశాలు వెలువడిన వెంటనే, జంతు హక్కుల కార్యకర్తల తరఫు న్యాయవాదులు కరుణా నంది, ఆనంద్ గ్రోవర్ జోక్యం చేసుకున్నారు. ’కుక్కలను తొలగిస్తే, కొత్త కుక్కలు ఆ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి. ఇది ఏబీసీ నిబంధనలకు విరుద్ధం’అని వాదించే ప్రయత్నం చేశారు. అయితే, ధర్మాసనం వారి వాదనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, ఆదేశాలను ఖరారు చేసింది.
రోడ్లపై పశువులు కనపడితే..
రహదారులపై పశువులు, ఇతర జంతువుల సంచారంతో జరుగుతున్న ప్రమాదాలపైనా కోర్టు తీవ్రంగా స్పందించింది. రాజస్తాన్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరింది. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇతర ప్రధాన రహదారులపై సంచరించే పశువులను, ఇతర జంతువులను తక్షణమే గోశాలలకు లేదా షెల్టర్ హోంలకు తరలించి, పునరావాసం కల్పించాలి. ఇందుకోసం ప్రత్యేక ‘హైవే పెట్రోల్’బృందాలను, ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేయాలి.
నాటకీయ పరిణామాల తర్వాత..
ఈ కేసు అనేక నాటకీయ పరిణామాల మధ్య ఈ దశకు చేరుకుంది. జూలైలో జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం.. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో కుక్కలన్నింటినీ పట్టుకుని షెల్టర్లకు తరలించాలని, తిరిగి వదలొద్దని సంచలన ఆదేశాలిచ్చింది. ఇది ఏబీసీ నిబంధనలకు విరుద్ధమని జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఈ కేసు జస్టిస్ విక్రమ్ నాథ్ నేతత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ అయింది.
ఆగస్ట్ 22న ఈ ధర్మాసనం.. జస్టిస్ పార్దివాలా బెంచ్ ఆదేశాలపై స్టే ఇచ్చింది. స్టెరిలైజేషన్ చేసిన కుక్కలను తిరిగి అదే ప్రాంతంలో వదలాలని స్పష్టం చేసింది. అయితే, తాజాగా శుక్రవారం, తన పాత వైఖరిని పాక్షికంగా సవరిస్తూ, కుక్కకాటు ముప్పు ఎక్కువగా ఉన్న పాఠశాలలు, ఆస్పత్రుల వంటి ’సున్నితమైన ప్రాంతాలకు’మాత్రం పాత ఏబీసీ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తూ.. పౌరుల భద్రతకే పెద్ద పీట వేస్తూ ఈ ఆదేశాలను జారీ చేసింది.
3 వారాలు8వారాలు
తమ ఆదేశాల అమలును అత్యంత ముఖ్య మైనవిగా పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం కోరింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్, ఇమ్యునోగోబులిన్ అన్ని వేళలా అందుబాటులో ఉండాలని పేర్కొంది. కుక్కకాటుకు ప్రాథమిక చికిత్స, తక్షణం చేపట్టాల్సిన ఇతర చర్యలపై ఆయా సంస్థల్లో సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించింది.
కుక్కల బెడద నివారణకు ఫెన్సింగ్, తనిఖీలపై 3 వారాల్లోగా, రోడ్లపై పశువుల తొలగింపుపై 8 వారాల్లోగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు సమగ్ర నివేదికలు దాఖలు చేయాలని ఆదేశించింది. ఆదేశాల అమలులో ఏమాత్రం అలసత్వం వహించినా, లేదా విఫలమైనా సంబంధిత అధికారులను, ముఖ్యంగా చీఫ్ సెక్రటరీలను వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తామని ధర్మాసనం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే జనవరి 13వ తేదీకి వాయిదా వేసింది.


