ప్రభాకర్‌రావును జైలుకుపంపాల్సిన అవసరం లేదు
తదుపరి విచారణ వరకు అరెస్టు కూడా వద్దు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు
ఎస్‌ఐబీ మాజీ చీఫ్ పోలీసు కస్టడీ మరో వారం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు కస్టడీని సుప్రీంకోర్టు మరో వారం పొడిగించింది. డిసెంబర్ 25 వరకు పోలీసు విచారణకు అనుమతి ఇచ్చిన కోర్టు, 26న ఆయన్ను విడుదల చేసి ఇంటికి పంపాలని ఆదేశించింది. ప్రభాకర్‌రావును జైలుకు పంపాల్సిన అవసరం లేదని పేర్కొంటూ.. తదుపరి విచారణ జరిగే 2026 జనవరి 16 వరకు అరెస్టు కూడా చేయరాదని స్పష్టం చేసింది.
’ఆయన మా ఉత్తర్వుల మేరకే సరెండర్ అయ్యారు..అలాంటప్పుడు విచారణ పూర్తయ్యాక మళ్లీ రిమాండ్‌కు ఎందుకు పంపాలి?’అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కస్టడీలో ఉన్న సమయంలో ఇంటి భోజనం, మందులు అనుమతించాలని తెలిపింది. ప్రభాకర్‌రావు కూడా దర్యాప్తునకు సహకరించాలని, విచారణకు పిలిచినప్పుడు హాజరుకావాలని ఆదేశించింది.
ఈ కేసును జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రభాకర్‌రావు కస్టడీ విచారణ రిపోర్టును కోర్టుకు సమరి్పంచింది. అనంతరం ఇరుపక్షాలు వాదనలు విన్పించాయి.
కాల్చమని చెబితే కాల్చేస్తారా?
ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ‘విచారణకు ప్రభాకర్‌రావు సహకరించడం లేదు. డివైస్‌లలో ఎలాంటి సమాచారం లేదు. ముందుగానే వాటిని ధ్వంసం చేశారు. దర్యాప్తు ఇంకా కీలక దశలో ఉంది. నిందితుడి నుంచి రాబట్టాల్సిన సమాచారం చాలా ఉంది. అందువల్ల మరో వారం రోజుల కస్టడీ అవసరం.
కస్టడీ గడువు ముగిసిన తర్వాత, తదుపరి విచారణ జరిగే వరకు ప్రభాకర్‌రావును జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించేలా ఆదేశాలివ్వాలి. నక్సలైట్ల పేరుతో అనేక మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారు. జడ్జిలు, డ్రైవర్ల ఫోన్లను సైతం ట్యాప్ చేశారు. ఇది రాజకీయ సమస్య కాదు. వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశం. ప్రభుత్వ పెద్దలు.. ఎవరినైనా కాల్చమని చెబితే కాలుస్తారా?..’అంటూ వాదించారు.
అసలు మీరెందుకు భయపడుతున్నారు?
అయితే ఈ అభ్యర్థనను జస్టిస్ నాగరత్న తోసిపుచ్చారు. ’పోలీసు విచారణ కోసమే ప్రభాకర్‌రావు వచ్చారు. అది పూర్తయిన తర్వాత ఆయన్ను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాల్సిన అవసరం ఏముంది?..’అని ప్రశ్నించారు. రిమాండ్ ప్రతిపాదనను తిరస్కరించారు. ’అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్య వహారం గురించి మీరెందుకు (ప్రభుత్వం) అంతగా భయపడుతున్నారు? ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారు? ఎలాంటి తప్పు చెయ్యనప్పుడు ఎవరైనా మీ ఫోన్ వింటే ఏమవుతుంది..’అని ప్రశ్నించారు.
అది విచారణ కాదు.. ‘చైనీస్ టార్చర్’
అంతకుముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు రంజిత్‌కుమార్, దామా శేషాద్రినాయుడు వాదించారు. ‘ప్రభాకర్‌రావు వయసు 69 ఏళ్లు. కేన్సర్ సర్వైవర్. ఆయన్ను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు.. రోజుకు 12 గంటల పాటు కూర్చోబెట్టి నరకం చూపిస్తున్నారు. అడిగిన ప్రశ్నలే వందసార్లు అడుగుతూ వేధించడం దర్యాప్తు కాదు. ఇది మనిషిని మానసికంగా కుంగదీసే ‘చైనీస్ టార్చర్ మెథడ్’.
తనకు వ్యతిరేకంగా తానే స్టేట్‌మెంట్ ఇచ్చేలా వేధిస్తున్నారు..’అని చెప్పారు. ‘ఒక సీనియర్ సిటిజన్‌ను, 30 ఏళ్లు ప్రజలకు సేవలందించిన అధికారిని ఇలా రోడ్డున పడేయడం దారుణం. సిట్ బృందాన్ని పెంచింది దర్యాప్తు కోసం కాదు. షిఫ్టుల వారీగా మారుతూ వృద్ధుడైన నిందితుడిని వేధించడానికే..’అని వాదించారు.


