కిలోమీటర్ పరిధి వరకు ఎలాంటి తవ్వకాలకు అనుమతి లేదు
ఇదివరకు గోవాకే పరిమితమైన నిబంధన.. ఇకపై దేశమంతటా వర్తింపు
కీలక ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: వన్యప్రాణుల సంరక్షణ దిశగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాల లోపల, అలాగే వాటి సరిహద్దుల నుంచి కిలోమీటర్ పరిధి వరకు ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు చేపట్టరాదని తేలి్చచెప్పింది. గతంలో ’గోవా ఫౌండేషన్’ కేసులో ఈ రకమైన ఆంక్షలను కేవలం గోవా రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేసిన ధర్మాసనం, ఇప్పుడు ఆ పరిధిని విస్తరింపజేసింది. దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలవుతాయని పేర్కొంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. ‘రక్షిత ప్రాంతాలకు కిలోమీటర్ పరిధిలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడం వన్యప్రాణులకు అత్యంత ప్రమాదకరం. ఇది ఈ కోర్టు స్థిరమైన అభిప్రాయం. గతంలో గోవా ఫౌండేషన్ కేసులో ఈ ఆదేశాలు గోవాకు మాత్రమే ఇచి్చనా, వీటిని దేశవ్యాప్తంగా జారీ చేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కొత్త ఆదేశాలతో, 2022 జూన్ 3న జారీ చేసిన పాత ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించినట్లయింది.
శరందా అడవులపై విచారణ సందర్భంగా..
ప్రఖ్యాత ‘టి.ఎన్.గోదావర్మన్ తిరుమల్పాడ్’ కేసులో భాగంగా దాఖలైన పలు పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలను ఇచి్చంది. ముఖ్యంగా జార్ఖండ్‌లోని ‘శరందా’ ప్రాంతాన్ని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను కోర్టు పరిశీలించింది. ఈ విచారణలో, శరందా ప్రాంతాన్ని వెంటనే వన్యప్రాణుల అభయారణ్యంగా నోటిఫై చేయాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.


