అత్యున్నత న్యాయస్థానానికి బిజీ ఏడాది
చరిత్రాత్మక తీర్పులు
పలు మెరుపులు
కొన్ని మరకలు
ఇంకొన్ని వివాదాలు
త్వరలో కాలగర్భంలో కలిసిపోనున్న 2025 సుప్రీంకోర్టు చరిత్రలో చిరకాలం గుర్తుండిపోయే ఏడాదిగా నిలవనుంది. పలు సంచలనాత్మక కేసులు, వక్ఫ్ చట్టం వంటి వివాదాస్పద అంశాలు, రాజ్యంగపరంగా కీలకమైన సందేహాలు లేవనెత్తిన రాష్ట్రపతి రిఫరెన్సు వంటివి సంవత్సరం పొడవునా అత్యున్నత న్యాయస్థానానికి ఊపిరి సలపనివ్వలేదు. ఆ కేసులను పరిష్కరించే క్రమంలో సుప్రీం పలు చరిత్రాత్మక తీర్పులు వెలువరించింది.
ప్రజాప్రయోజనాలు, రాజకీయాలు, పర్యావరణం, నేర సంబంధిత కేసులతో పాటు పలు సంక్లిష్టమైన పౌరసంబంధ తగాదాలను సైతం సమర్థంగా పరిష్కరించింది. కీలకమైన కేసుల్లో రాష్ట్రపతి, గవర్నర్లకు డెడ్‌లైన్ వంటి తీర్పుల విషయంలో కాస్త చూసీచూడనట్టు పోయిందన్న అభిప్రాయాలకు కూడా తావిచ్చింది. ఈ ఏడాది అత్యున్నత న్యాయస్థానం ముందుకొచ్చిన పలు కీలక కేసులను ఓసారి చూస్తే...
వ్యవస్థల నడుమ... టగ్ ఆఫ్ వార్!
గవర్నర్లు, విపక్ష పాలిత రాష్ట్రాల మధ్య చిరకాలంగా పెను వివాదంగా మారిన బిల్లుల ఆమోదం అంశం ఈ ఏడాది సుప్రీంకోర్టుకు అగ్నిపరీక్షే పెట్టింది. బిల్లులను తమిళనాడు గవర్నర్ రవి తొక్కిపట్టడాన్ని సవాలు చేస్తూ తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో న్యాయవ్యవస్థకే సుదీర్ఘ, సంక్లిష్ట సవాలుకు తెరలేచింది.
గవర్నర్‌తో పాటు రాష్ట్రపతి కూడా మూడు నెలల్లోపు బిల్లులకు ఆమోదం తెలపడం, వాటిని తిప్పి పంపడమో చేయని పక్షంలో అవి ఆమోదం పొందినట్టే భావించాలంటూ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు పెను సంచలనమే సృష్టించింది. అధికార బీజేపీకి ఖేదం, విపక్షాలకు మోదం కలిగించింది. దాంతో, ఇలా గడువు విధించడం సబబేనా అంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన అసాధారణ అధికారాలను ఉపయోగించుకుంటూ, ఈ అంశంపై కోర్టుకు 14 ప్రశ్నాస్త్రాలు సంధించి వాటికి బదులు కోరారు. దాంతో సమస్య కీలక మలుపు తిరిగింది.
ఒక దశలో అతి కీలకమైన న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అమీతుమీ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి రాష్ట్రపతికి, గవర్నర్లకు కోర్టులు అలా గడువు విధించలేవంటూ ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించడం ద్వారా ఈ వివాదానికి సామరస్యపూర్వకంగా తెర దించింది. అయితే ఆ క్రమంలో న్యాయవ్యవస్థ ఒక మెట్టు దిగిందన్న అభిప్రాయాలు విపక్షాలతో పాటు న్యాయ నిపుణుల నుంచి కూడా విన్పించాయి. కాకపోతే గవర్నర్లు బిల్లులపై ఏ నిర్ణయమూ తీసుకోకుండా సుదీర్ఘకాలం సాగదీస్తే ఊరుకునేది లేదని, అలాంటప్పుడు న్యాయసమీక్ష సబబేనని ధర్మాసనం పేర్కొనడం ప్రజాస్వామ్యవాదులకు కాస్త ఊరటనిచ్చింది.
‘వక్ఫ్’పై మధ్యేమార్గం
వక్ఫ్ ఆస్తులను క్రమబద్ధీకరించే క్రమంలో మోదీ సర్కారు తీసుకొచ్చిన అత్యంత వివాదాస్పద కొత్త వక్ఫ్ (సవరణ) చట్టం–2025 కేసు విషయంలో సుప్రీంకోర్టు వీలైనంత సమతుల్యత పాటించే ప్రయత్నం చేసింది. వక్ఫ్ బై యూజర్ ప్రయోజనాన్ని తొలగింపు సక్రమమేనని, ఈ నిర్ణయం ద్వారా వక్ఫ్ భూములను కేంద్రం లాక్కుంటుందన్న వాదనలో పస లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో కనీసం ఐదేళ్లుగా ఇస్లాంను అనుసరిస్తున్న వాళ్లు మాత్రమే వక్ఫ్ కింద దానాలు ఇవ్వొచ్చన్న నిబంధనను ప్రస్తుతానికి పక్కన పెట్టింది.
సోషల్ న్యూసెన్స్‌కు ముకుతాడు
భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట హద్దు మీరుతున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూ యన్సర్లకు సుప్రీంకోర్టు ముకుతాడు వేసింది. తల్లిదండ్రులు–పిల్లలపై అసహ్యకరమైన లైంగిక వ్యాఖ్యలు చేసిన రణ్‌వీర్ అలహాబాదియా, దివ్యాంగులను కించపరిచిన సమయ్ రైనా వంటి పలువు రు ఇన్‌ఫ్లూయన్సర్లను కోర్టు గట్టిగా నలుగు పెట్టి వదిలింది. మున్ముందు ఇలాంటి ఉదంతాల్లో కఠిన శిక్షలు విధించేలా ఎస్సీ, ఎస్టీ చట్టం తరహాలో గట్టి చట్టం తేవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆన్‌లైన్ కంటెంట్‌ను క్రమబద్ధీకరించేలా గైడ్‌లైన్స్ విడుదల రూపొందించాలని పేర్కొంది.
గ్రామ సింహాల గోల
ఏ వీధికి వెళ్లినా సర్వసాధారణంగా కన్పించే వీధి కుక్కల బెడద సుప్రీం దృష్టికీ వెళ్లింది. దీనిపై మీడియా కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించడమే గాక వీధి కుక్కలను శాశ్వతంగా తరలించే దిశగా కేంద్ర, రాష్ట్రాలకు పలు నిర్దేశాలు జారీ చేసింది. దీనిపై జంతు ప్రేమికుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాల నేపథ్యంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం లోతైన విచారణ జరిపింది. కుటుంబనియంత్రణ ఆపరేష్ల అనంతరం కుక్కల్ని తిరిగి వీధుల్లోకి వదలవచ్చంటూ తీర్పును కాస్త సవరించింది.
సీజేపైకి బూటు
అక్టోబర్ 6వ తేదీ. సుప్రీంకోర్టులో అత్యంత అరుదైన, అవాంఛనీయమైన ఉదంతం జరిగిన రోజు. రాకేశ్ కిషోర్ అనే సీనియర్ న్యాయవాది ఏకంగా నాటి సీజేఐ జస్టిస్ గవాయ్‌పైకి బూటు విసిరి కలకలం రేపాడు. అంతకుముందు విచారణ సందర్భంగా హిందూ దేవీ దేవతలపై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ మతిలేని చర్యకు పూనుకున్నాడు.
న్యాయమూర్తుల ఆస్తుల వెల్లడి
న్యాయవ్యవస్థలో మరింత పారదర్శకత, విశ్వసనీయత దిశగా న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను బయట పెట్టాలని అత్యున్నత న్యాయస్థానం మరో కీలక నిర్ణయమూ తీసుకుంది. వాటిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంది. అలాగే న్యాయ సిబ్బంది తదితర నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రజలకు రిజర్వేషన్ల కల్పన కూడా వినూత్నమే.
జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు
దేశ రాజధానిలో హైకోర్టు న్యాయ మూర్తిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు సగం కాలిపోయిన స్థితిలో బయటపడ్డ ఉదంతం దేశమంతటా పెను ప్రకంపనలు సృష్టించడమే గాక న్యాయవ్యవస్థ ప్రతిష్టకే మచ్చగా నిలిచింది. మార్చి 14వ తేదీ రాత్రి ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో చెలరేగిన మంటలను ఆపేందుకు వెళ్లిన అగ్నిమాపక, పోలీసు సిబ్బంది స్టోర్ రూములో నేలపై పరిచిన భారీస్థాయిలో నోట్ల కట్టలు చూసి నోరెళ్లబెట్టారు. ఇతర పౌరుల్లాగే ఆయన్ను కూడా చట్టప్రకారం కఠినంగా శిక్షించి న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలని సామాన్యులంతా ఆశించారు.
సుప్రీంకోర్టు నియమించిన అంతర్గత న్యాయ మూ ర్తుల కమిటీ సైతం ఆయన్ను దోషిగా తేల్చి చర్యలకు సిఫార్సు చేసింది. రాజీ నామా చేయాల్సిందిగా నాటి సీజేఐ జస్టిస్ ఖన్నా సూచించినా జస్టిస్ వర్మ ససేమిరా అన్నారు. దాంతో ఆయన్ను అభి శంసించాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధానులకు సీజే లేఖ రాయాల్సి వచ్చింది. జస్టిస్ వర్మను తొలగించాలని పలువురు ఎంపీలు కూడా పార్లమెంటుకు లేఖ రాశారు. అభిశంసన ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఆయనపై పార్లమెంటరీ ప్యానల్ విచారణ కొన సాగుతోంది. దాన్ని కూడా సవాలు చేస్తూ జస్టిస్ వర్మ సుప్రీం మెట్లెక్కడం అందరినీ నిర్ఘాంతపరిచింది.
ముగ్గురు సీజేలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీఠంపై ముగ్గురు అత్యంత సీనియర్ జడ్జీలు కొలువుతీరడం ఈ ఏడాది ప్రత్యేకతగా చెప్పొచ్చు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ గవాయ్ ఈ ఏడాదే రిటైరవగా జస్టిస్ సూర్యకాంత్ సీజేగా బాధ్యతలు స్వీకరించారు. న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని నిలబెట్టే క్రమంలో రిటైర్మెంట్ అనంతరం ఎలాంటి ప్రభుత్వ పదవులూ స్వీకరించబోమని జస్టిస్ ఖన్నా, జస్టిస్ గవాయ్ స్పష్టం చేయడం మరో విశేషం.
మరిన్ని కీలక తీర్పులు...
→ పెచ్చరిల్లుతున్న సైబర్ నేరాలపైనా సుప్రీంకోర్టు ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను, ముఖ్యంగా వృద్ధులను భయభ్రాంతులకు గురిచేసి భారీగా డబ్బు కొల్లగొడుతున్న ఆన్‌లైన్ మోసగాళ్లపై ఉక్కుపాదం మోపాల్సిందిగా సీబీఐని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకోసం దేశవ్యాప్త విచారణ జరపాలని సూచించింది.
→ బోగస్ ఓట్ల ఏరివేతకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) సర్వే రాజకీయ రంగు పులుముకుని సుప్రీంకోర్టుకు చేరింది.
→ పశ్చిమబెంగాల్లో దశాబ్దం క్రితం నియమి తులైన ఏకంగా 25,753 మంది ప్రభుత్వ టీచర్లు, సిబ్బంది నియామ కాన్ని సుప్రీం ఒక్క కలం పోటుతో రద్దు చేయడం మమత సర్కారుకు తీరని షాకిచ్చింది.
→ లాయర్లు, కక్షిదారులను దర్యాప్తు సంస్థలు తమ ఇష్టమొచ్చిన రీతిలో విచారించేందుకు వీల్లేదంటూ, వారి ప్రత్యేక హక్కుల పరిరక్షణకు పలు చర్యలు ప్రకటించిన సుప్రీం తీర్పు కూడా చరిత్రాత్మకమైనదే.
→ నోయిడాలో 2006లో 8 మంది పేద చిన్నారుల అస్థిపంజరాలు ఓ కాలువలో బయటపడ్డ ఉదంతంలో ప్రధాన నిందితుడు సురేంద్ర కోలీని నిరపరాధిగా సుప్రీం తేల్చడం విస్మయం కలిగించింది.
→ జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు లాయర్లకు కనీసం మూడేళ్ల అనుభవం తప్పనిసరని, న్యాయాధికారులు బార్ కోటా కింద పదోన్నతి పరీక్షలు రాయొచ్చంటూ ఇచ్చిన తీర్పులు చర్చనీయంగా మారాయి.
→ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పిడి ఉదంతంపై తాము సూచించినట్టుగా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోనందుకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై సుప్రీంకోర్టు ధిక్కరణ చర్యలకు దిగడమూ సంచలనమే సృష్టించింది.
– సాక్షి, నేషనల్ డెస్క్


