సాక్షి, ఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై సుప్రీం కోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలి భద్రతకు సంబంధించిన అంశాలతో సీబీఐ ప్రస్తావించిన అభ్యంతరాలను పరిశీలించిన ధర్మాసనం.. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే విధించడంతో పాటు నిందితుడు కుల్దీప్‌కు నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నాలుగు వారాల్లో బదులు ఇవ్వాలని సెంగార్‌ను అందులో కోర్టు ఆదేశించింది.
‘‘ఈ కేసులో జీవిత ఖైదు పడ్డ సెంగార్‌ను జైలు నుంచి విడుదల చేయొద్దు. ఓ కానిస్టేబుల్ పబ్లిక సర్వెంట్ అయినప్పుడు.. ఓ ఎమ్మెల్యే మాత్రం కాదా?.. ఈ కేసులో ఆ బెయిల్ ఇచ్చింది కూడా ఉత్తమ జడ్జీలే. మేం కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటాం కదా. ఇంతకీ ఎవరు పబ్లిక్ సర్వెంట్లు?’’ అంటూ సెంగార్ తరపు వాదించిన లాయర్లు సిద్ధార్థ దవే, హరిహరన్‌లను జస్టిస్ సూర్యకాంత ప్రశ్నించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో 2017లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అప్పటి బీజేపీ నేత కుల్దీప్ సెంగర్ ఈ కేసులో ప్రధాన నిందితుడుగా తేలాడు. అయితే ఈ కేసు విచారణలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులను ఆశ్రయించినా.. నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో బాధితురాలు సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి ముందు ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఈ కేసు.. హైప్రొఫైల్ కేసుగా గుర్తింపు దక్కించుకుంది. అయితే కేసు దర్యాప్తులో ఉండగానే..
బాధితురాలి తండ్రి సెంగార్ మనుషుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఆపై ఆమె అనూహ్యంగా ప్రమాదానికి గురికాగా.. సురక్షితంగా బయటపడింది. అయితే ఆమె ఇద్దరి బంధువులు మాత్రం ప్రమాదంలో మరణించారు. ఈ యాక్సిడెంట్ కూడా సెంగార్ జరిపించాడనే అభియోగాలు నమోదు అయ్యాయి.

2018లో ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లింది. కేసు విచారణ యూపీ ట్రయల్ కోర్టు ఢిల్లీ కోర్టుకు మారింది. 2019 డిసెంబర్‌లో దోషిగా తేలడంతో జీవితఖైదు విధించింది కోర్టు. అయితే తాజాగా ఈ కేసులో అనూహ్య పరిణామలు చోటు చేసుకున్నాయి. సెంగార్‌కు పోక్సో చట్టం వర్తించదని చెబుతూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు.
అయితే.. కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్షను సస్పెండు చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రగిలాయి. బాధిత కుటుంబం దేశరాజధానిలో ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అదే సమయంలో.. యూపీ ఎన్నికల నేపథ్యంలో సెంగార్ కమ్యూనిటీ ఓట్ల కోసమే ఆయన్ని విడిపించే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ విమర్శలు తలెత్తారు. ఈ పరిణామాల నడుమ.. సీబీఐతో పాటు బాధితురాలి తరఫు న్యాయవాదులు కూడా సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. సోమవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.


