ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
జాతి వివక్ష దాడిని దేశవ్యాప్తంగా ఆందోళన
దోషులపై కఠిన చర్యలు తప్పవన్న ఉత్తరాఖండ్ సీఎం
''ఇలాంటిది మరెవరికీ జరగకూడదు. ఇది ఎంతమాత్రం ఆమోద్యయోగ్యం కాదు. మరే బిడ్డా ఇలా చనిపోకూడదు'' అంటూ తీవ్ర మనోవేదన చెందారు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ తరుణ్ ప్రసాద్ చక్మా. తమకు న్యాయం చేయాలని, కడుపుకోత మిగిలిచ్చిన బాధ్యులకు మరణశిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. డెహ్రాడూన్‌లో జరిగిన జాతి వివక్ష దాడిలో తన పెద్ద కుమారుడు ఏంజెల్ చక్మా ప్రాణాలు కోల్పోవడంతో ఆయనీ విధంగా స్పందించారు. జాతి వివక్ష పేరుతో దాడులు చేయడం దారుణమని ఖండించారు. దేశంలో ఇలాంటి దాడులు ఇంతకుముందెన్నడూ జరగలేదని అన్నారు.
అసలేం జరిగింది?
త్రిపురలోని ఉనకోటి జిల్లాకు చెందిన 24 ఏళ్ల ఏంజెల్ చక్మా (Anjel Chakma).. డెహ్రాడూన్‌లోని యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నాడు. డిసెంబర్ 9న తన తమ్ముడితో కలిసి సరుకులు కొనేందుకు బయటకు వెళ్లాడు. కొంత మంది వారిని ఉద్దేశించి జాతివ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ, దుర్భాషలాడారు. అంతేకాదు వారిని చైనీయులుగా భావించి మరింత రెచ్చిపోయారు. తాము ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారమని, చైనీయులం కాదని ఎంత చెప్పినా దుండగులు వినిపించుకోలేదు. దీంతో అంజెల్ చక్మా.. వారిని వారించే ప్రయత్నంగా చేయగా అతడిపై దాడికి తెగబడ్డారు. పదునైన ఆయుధంతో మెడ, కడుపులో పొడిచి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన అతడిని సమీపంలోని గ్రాఫిక్ ఎరా ఆసుపత్రికి తరలించారు. 17 రోజుల పాటు ఐసీయూలో ఉన్న ఏంజెల్.. ఈనెల 26న ప్రాణాలు విడిచాడు. అతడు చివరిగా అన్న మాటలు ''మేము చైనీయులం కాదు. మేము భారతీయులం''.
జాత్యాంహకార దాడికి నిరసన
త్రిపుర విద్యార్థి ఏంజెల్ చక్మా మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. జాత్యాంహకార దాడులకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు గళమెత్తారు. జాతి వివక్ష వ్యతిరేక చట్టం తేవాలంటూ త్రిపురలో ఆందోళనలు చేపట్టారు. సోషల్ మీడియాలో #JusticeForAnjelChakma హ్యాష్‌టాగ్‌తో గళం విన్పిస్తున్నారు.
విద్వేషదాడులు ప్రమాదకరం: రాహుల్ గాంధీ
డెహ్రాడూన్‌లో జరిగిన జాత్యాహంకార ఘటనపై కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎక్స్ వేదికగా స్పందించారు. బీజేపీ పాలనలో విద్వేషదాడులు సర్వసాధారణంగా మారాయని ధ్వజమెత్తారు. డెహ్రాడూన్‌లో అంజెల్ చక్మా,అతని సోదరుడు మైఖేల్‌పై జరిగిన దాడిని భయంకరమైన ద్వేషపూరిత నేరంగా ఆయన పేర్కొన్నారు. విద్వేష దాడులు దేశానికి ప్రమాదకరని ఆయన అభిప్రాయపడ్డారు.
చదవండి: మమ్మల్ని జైలులో పెట్టండి.. బాధితుల మొర
కఠిన చర్యలు తప్పవు: ధామి
ఏంజెల్ చక్మాపై దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ కుమార్ ధామి (Pushkar Singh Dhami) ప్రకటించారు. ఏంజెల్ తండ్రి తరుణ్ ప్రసాద్ చక్మాతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీయిచ్చారు. ఈ నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నాడని తెలిపారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి కూడా తనతో మాట్లాడారని వెల్లడించారు. ఏంజెల్ చక్మా కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని చెప్పారు.


