త్రిపుర 316/4
రంజీ ట్రోఫీ రౌండప్
అగర్తలా: త్రిపుర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు క్రికెటర్ హనుమ విహారి శతకాల జోరు కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’లో బెంగాల్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వీరోచిత శతకంతో త్రిపురకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కట్టబెట్టిన విహారి తాజాగా అస్సాంపై కూడా అజేయ సెంచరీతో కదం తొక్కాడు. టాస్ నెగ్గిన అస్సాం ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన త్రిపుర తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది.
ఆరంభంలోనే ఓపెనర్లు హృతురాజ్ రాయ్ (5), కాసేపటికే బిక్రమ్‌కుమార్ దాస్ (22; 3 ఫోర్లు) వికెట్లను కోల్పోయిన త్రిపురకు విహారి (215 బంతుల్లో 143 బ్యాటింగ్; 17 ఫోర్లు, 1 సిక్స్) ఆపద్భాంధవుడయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ శ్రీదమ్ పాల్ (38; 7 ఫోర్లు)తో కలిసి జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. మూడో వికెట్‌కు 68 పరుగులు జతయ్యాక శ్రీదమ్ అవుటయ్యాడు. తర్వాత సెంటు సర్కార్ (145 బంతుల్లో 94; 11 ఫోర్లు, 1 సిక్స్) అండతో త్రిపుర ఇన్నింగ్స్‌ను దుర్బేధ్యంగా మలిచాడు.
ఇద్దరు దాదాపు రెండు సెషన్ల పాటు క్రీజులో నిలిచి పరుగులు సాధించారు. దీంతో అస్సామ్ బౌలర్లు ఈ జోడీని విడగొట్టేందుకు అలసిసొలసి పోయారు. ఇదే క్రమంలో విహారి సెంచరీ పూర్తి చేసుకోగా, సెంటు సర్కార్ కూడా శతకదారిలో పడ్డాడు. జట్టు స్కోరు 300 పరుగులు దాటిన తర్వాత దురదృష్టవశాత్తూ సెంటు సర్కార్ 6 పరుగుల తేడాతో సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దీంతో 210 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. ఆట నిలిచే సమయానికి విహారి, రాణా దత్త (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అస్సాం బౌలర్లలో దర్శన్‌కు 2 వికెట్లు దక్కాయి.
ఢిల్లీని కూల్చేసిన ఆఖిబ్ నబి
న్యూఢిల్లీ: జమ్మూ కశీ్మర్ సీమర్ ఆఖిబ్ నబి (16–5–35–5) ఢిల్లీ గడ్డపై ఢిల్లీ జట్టును బెంబేలెత్తించాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో సొంతగడ్డపై ఢిల్లీని తొలి ఇన్నింగ్స్‌లో కనీసం 70 ఓవర్లయిన ఆడకుండా కూల్చేశాడు. గ్రూప్ ‘డి’ పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 69 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ అర్పిత్ రాణా (0)ను నబి డకౌట్ చేయడంతో మొదలైన ఢిల్లీ పతనం 14 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లను కోల్పోయింది.
సనత్ (12)ను వంశజ్, యశ్ ధుల్ (1)ను సునీల్ అవుట్ చేశారు. ఈ దశలో కెపె్టన్ ఆయుశ్ బదోని (64; 6 ఫోర్లు), ఆయుశ్ డొసెజా (65; 6 ఫోర్లు, 1 సిక్స్), సుమిత్ మాథ్యూర్ (55 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో ఢిల్లీ ఇన్నింగ్స్ చక్కబెట్టేందుకు ప్రయత్నించారు. కానీ తర్వాత బ్యాటర్లు అనుజ్ (0), హృతిక్ (7), మనన్ (0), సిమర్‌జీత్ (0), మోని గ్రేవల్ (0) చేతులెత్తేయడంతో ఢిల్లీ కుప్పకూలేందకు ఎంతో సమయం పట్టనే లేదు. కశ్మీరి బౌలర్లలో వంశజ్ శర్మ, అబిద్ ముస్తాక్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి.
శతక్కొట్టిన ముషీర్, సిద్ధేశ్
ముంబై: ఓపెనర్ ముషీర్ ఖాన్ (162 బంతుల్లో 112; 14 ఫోర్లు), మిడిలార్డర్‌లో సిద్దేశ్ లాడ్ (207 బంతుల్లో 100 బ్యాటింగ్; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో కదంతొక్కడంతో ముంబై కోలుకుంది. గ్రూప్ ‘డి’లో హిమాచల్ ప్రదేశ్‌తో మొదలైన ఈ మ్యాచ్‌లో కేవలం ఈ ఇద్దరు సెంచరీ వీరులే తప్ప మిగతా బ్యాటర్లు కనీస స్కోర్లయిన చేయలేకపోయారు.
మొదటి రోజు ఆట నిలిచే సమయానికి ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే (9), భారత వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే (2), హిమాన్షు సింగ్ (0), ముషీర్ సోదరుడు సర్ఫరాజ్ ఖాన్ (16) బ్యాట్లెత్తారు. దీంతో ముంబై తొలి సెషన్‌లో 73 పరుగులకే కీలకమైన 4 వికెట్లను కోల్పోయింది. సిద్దేశ్‌తో ఆకాశ్ ఆనంద్ (26 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు.


