ఉన్నావ్ కేసు బాధితుల ఆందోళన (Photo: ANI)
దయచేసి మమ్మల్ని జైలులో పెట్టండి అని వేడుకంటున్నారు బాధితులు. అదేంటి తప్పు చేసిన వారిని కదా కారాగారంలో పెడతారు? బాధితులు ఎందుకు జైలుకెళతామంటున్నారు? తమను జైలులో ఉంచమని వేడుకుంటున్నది ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు. కనీసం తమకు అక్కడైనా రక్షణ ఉంటుందన్న భావనతో వారు ఈ విధంగా అభ్యర్థిస్తున్నారు. 2017 నాటి ఉన్నావ్ లైంగిక వేధింపుల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న బీజేపీ బహిష్కృత ఉత్తరప్రదేశ్ నాయకుడు కుల్దీప్ సింగ్ సెంగార్‌కు (Kuldeep Singh Sengar) ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. బెయిల్ రద్దు చేయాలని కోరింది.
సెంగార్ జైలు నుంచి బయటకు వస్తే తమకు ప్రాణహాని తప్పదని బాధితురాలి సోదరి భయాందోళన చెందారు. అతడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తన సోదరి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని తెలిపారు. ''నా తండ్రిని హత్య చేశారు, నాపై లైంగికి దాడికి పాల్పడ్డారు. అలాంటి దుర్మార్గుడికి బెయిల్ మంజూరు చేస్తారా, ఇదెక్కడి న్యాయం'' అంటూ బాధితురాలు వాపోయినట్టు వెల్లడించారు. తమ కుటుంబానికి ఇప్పటికీ ముప్పు పొంచివుందన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తమ కుటుంబ సభ్యులపై జరిగిన దాడులను గుర్తుచేసుకున్నారు. సెంగార్ విడుదలైన తర్వాత మరింత హాని జరుగుతుందని తామంతా భయపడుతున్నామని చెప్పారు.
ఏం చేస్తారో ఎవరికి తెలుసు?
''సెంగార్ విషయంలో కోర్టు నిర్ణయం మాకు తీవ్ర నిరాశ కలిగించింది. అతడు ముందు నా మామను, ఆ తర్వాత నా తండ్రిని చంపాడు. ఆ తర్వాత నా సోదరి విషయంలో ఈ సంఘటన జరిగింది. అతడి నుంచి ఇంకా మాకు ప్రమాదం పొంచివుంది. అతడు జైలు నుంచి బయటకు వస్తే నన్ను, నా కుటుంబం మొత్తాన్ని పొట్టన పెట్టుకుంటాడు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. మాకు ఒక తమ్ముడు ఉన్నాడు. సెంగార్‌కు సంబంధించిన వ్యక్తులు ఇప్పటికీ మా చుట్టూ తిరుగుతూ బెదిరిస్తున్నారు. వాళ్లు మా తమ్ముడిని ఏం చేస్తారో ఎవరికి తెలుసు? ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం. సెంగార్ జైలు నుంచి విడుదలైన మరుక్షణమే మమ్మల్ని జైల్లో పెట్టండి. కనీసం అక్కడైనా మా ప్రాణాలకు భద్రత ఉంటుంద''ని బాధితురాలి సోదరి ఆవేదన చెందారు.
మాకు అన్యాయం జరిగింది
ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత బాధితురాలు తన తల్లి, మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయానాతో కలిసి ఇండియా గేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. కోర్టు నిర్ణయంతో అభద్రతా భావానికి లోనయ్యానని బాధితురాలు పేర్కొన్నారు. వ్యవస్థ తనను మోసం చేసిందని వాపోయారు. ''మాకు అన్యాయం జరిగింది. యూపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున అతడిని బెయిల్‌పై విడుదల చేస్తున్నారు. అతడి భార్య ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఇలాంటి నిందితుడు బయటకు వస్తే మాకు రక్షణ ఎక్కడది? భయపడుతూ బతుకుతున్నాం. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామనుకుంటే మా వాళ్లు గుర్తుకు వస్తున్నారు. మమ్మల్ని ఇంత క్షోభకు గురిచేసిన సెంగార్ బెయిల్ రద్దు చేయాలి. న్యాయవ్యవస్థపై మాకు ఇంకా నమ్మకం ఉంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామ''ని తెలిపారు.


