విద్వేష నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
త్రిపుర విద్యార్థి హత్యపై సర్వత్రా నిరసనలు
నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న ఉత్తరాఖండ్ సీఎం
డెహ్రాడూన్: ఈశాన్య రాష్ట్రం త్రిపురకు చెందిన ఓ విద్యారి్థని విద్వేష పూరిత వ్యాఖ్యలతో వేధించి, దారుణంగా చంపిన ఘటనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్రిపురకు చెందిన ఏంజెల్ చక్మా(24) ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంబీఏ ఫైనలియర్ చదువుతున్నాడు.
ఈ నెల 9వ తేదీన కొందరు యువకులు కత్తులు, పదునైన ఆయుధాలతో దాడి చేయగా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 26వ తేదీన కన్నుమూశాడు.
అంజెల్ చక్మా తండ్రి బీఎస్‌ఎఫ్ జవాను. ఈయన ప్రస్తుతం మణిపూర్‌లోని టంగ్‌జెంగ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. డెహ్రాడూన్‌లో ఉంటున్న తన కుమారులు ఏంజెల్ చక్మా, మైకేల్ చక్మాలను కొందరు యువకులు ‘చైనీస్ మోమో’ అంటూ కొంతకాలంగా తీవ్రంగా వేధిస్తున్నారని తరుణ్ ప్రసాద్ చక్మా ఆరోపించారు. మేం చైనీయులం కాము, భారతీయులమంటూ అడ్డు చెప్పినందుకు ఏంజెల్‌ను విద్వేషపూరితంగా వెక్కిరిస్తూ కత్తి, ఇతర పదునైన ఆయుధాలతో దారుణంగా కొట్టారన్నారు.
ఈ విషయమై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సోమవారం తరుణ్ ప్రసాద్ చక్మాతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ దారుణానికి పాల్పడిన ఆరుగురిలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని, నేపాల్‌కు పారిపోయిన మరొకరిని తీసుకువస్తామని చెప్పారు. నిందితులను పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఏంజెల్ చక్మా కుటుంబానికి పరిహారంగా మొదటి విడతలో రూ.4.12 లక్షల చెక్కును పంపిస్తున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఘటనను తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ విభజనవాదాన్ని ఎగదోస్తోందని ఆరోపించారు. డెహ్రాడూన్‌లో త్రిపుర విద్యార్థి దారుణ హత్య దేశానికే అవమానమని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఈ గడ్డపై పుట్టిన వారంతా భారతీయులే అనే మెలకువ సమాజంలో ప్రతి ఒక్కరికీ అవసరమని పేర్కొన్నారు.
ఘటనను రాజకీయం చేయవద్దని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కోరారు. హోం మంత్రి అమిత్ షా విద్వేష నేరాలపై స్పందించాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ప్రధాన నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల బహుమానం అందిస్తామని త్రిపురలోని తిప్రా మోథా సుప్రీం ప్రద్యోత్ కిశోర్ మాణిక్య దేబ్‌వర్మ ప్రకటించారు. ఏంజెల్ చక్మాకు న్యాయం జరగాలంటూ సోమవారం డెహ్రాడూన్, అగర్తలాలో కొవ్వొత్తులతో ర్యాలీలు చేపట్టారు.


