
సుప్రీంకోర్టుకు తెలిపిన సొలిసిటర్ జనరల్
న్యూఢిల్లీ: అక్రమంగా సంపాదించిన రూ.23 వేల కోట్ల డబ్బును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్వాధీనం చేసుకుని ఆయా నేరాల బాధితులకు అందజేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్(బీపీఎస్‌ఎల్) ఆస్తుల విక్రయానికి అనుమతిస్తూ మేలో జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ఓ న్యాయవాది బీపీఎస్‌ఎల్‌పై ఈడీ కేసు గురించి ప్రస్తావించగా సీజేఐ గవాయ్..ఇక్కడ కూడా ఈడీ ఉందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ..‘ఇక్కడో వాస్తవ చెప్పాలి. ఇప్పటి వరకు ఈడీ మనీలాండరింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా రూ.23 వేల కోట్లను స్వాధీనం చేసుకుంది. దీని ఆర్థిక నేరాల బాధితులకు చెల్లించింది’అని అన్నారు.