జీ రామ్ జీతో గ్రామీణ కార్మికుల హక్కులను కాలరాసే కుట్ర
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపాటు
కొత్త చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) చట్టం దానధర్మ పథకం కాదు, రాజ్యాంగ పరమైన చట్టబద్ధ హామీ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఈ చట్టం ద్వారా కోట్లాది పేదలకు స్వగ్రామాల్లోనే ఉపాధి లభించిందని, ఆకలి, బల వంతపు వలసలు తగ్గాయని, గ్రామీణ కూలీల వేతనాలు పెరిగాయని తెలిపారు.
మహిళల ఆర్థిక గౌరవాన్ని ఈ పథకం బలోపేతం చేసిందన్నారు. అలాంటి ఉపాధి హా మీ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతు న్నాయని, ప్రతిపాదిత జీ రామ్ జీ చట్టం ద్వారా కో ట్లాది గ్రామీణ కార్మికుల హక్కులను హరించి వేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఇందుకు నిరసనగా దేశవ్యాప్తంగా ‘ఉపాధి హామీ చట్టం బచావో సంగ్రామ్’ను కాంగ్రెస్ ప్రారంభించిన ట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన కేంద్రం ముందు మూడు డిమాండ్లను ఉంచారు. జీ రామ్‌జీ చట్టాన్ని వెంటనే ఉపసంహరించాలని, ఉపాధి చట్టాన్ని హక్కుల ఆధారిత చట్టంగా తిరిగి అమలు చేయాలని, పని హక్కు, పంచాయతీల అధికారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టం చట్టం ద్వారా పని హక్కును రద్దు చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నరు. ఇకపై ఉపాధి హామీ ఉండదని, ఎంపిక చేసిన పంచాయతీల్లో మాత్రమే అనుమతి ఆధారంగా పని కల్పిస్తారని పేర్కొన్నారు.
బడ్జెట్‌కు పరిమితి విధించడం వల్ల సంక్షోభ సమయంలోనూ పనులు నిలిచిపోయే ప్రమాదముందని తెలిపారు. నిధులు, పనులపై నిర్ణయాలు ఢిల్లీ నుంచే తీసుకోవడం ద్వారా గ్రామ సభలు, పంచాయతీలను నిస్సత్తువగా మార్చే యత్నమని ఆయన విమర్శించారు. 60 రోజుల పని బ్లాక్‌అవుట్ నిబంధన అత్యవసర సమయంలో ఉపాధి నిరాకరణకు చట్టబద్ధత ఇస్తుందన్నారు.
వేతనాలు అనిశ్చితంగా మారడం, 40 శాతం నిధుల భారం మోపడం వల్ల పేద రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు. బయోమెట్రిక్, యాప్ ఆధారిత టెక్నాలజీ వల్ల నిజమైన కూలీలు ఉపాధి నుంచి వెలివేతకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ ఆస్తుల సృష్టి స్థానంలో కాంట్రాక్టర్ తరహా పనులు పెరుగుతాయని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ వరకూ శాంతియుతంగా, దృఢంగా పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు.


