ఆ ప్రతిపాదనలను వెనక్కి తీసుకోండి
ప్రధాని మోదీకి పెటా ఇండియా లేఖ
శాస్త్రీయ విధానాలను పాటించాలని వినతి
న్యూఢిల్లీ: వీధి కుక్కలను పట్టుకుని, బతికున్నంతకాలం నిర్బంధంలోనే ఉంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను జంతు హక్కుల సంస్థ పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఏనిమల్స్(పెటా) తీవ్రంగా వ్యతిరేకించింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను వెనక్కి తీసుకోవాలని కోరు తూ శనివారం ప్రధాని మోదీకి పెటా లేఖ రాసింది. వీధి కుక్కలు, ఇతర జంతువుల నిర్వహణ విషయంలో శాస్త్రీయ, మానవీయ పద్ధతులను ఆవలంభించాలని సూచించింది.
అహింస, వసుధైవ కుటుంబకమ్ అన్న సిద్ధాంతాలను అనుసరించాలని కోరింది. ఈ మేరకు పెటా..రోడ్ మ్యాప్ ఫర్ హ్యుమేన్ మేనేజ్‌మెంట్ ఆఫ్ కమ్యూనిటీ డాగ్స్ ఇన్ ఇండియా, రోడ్ మ్యాప్ ఫర్ హ్యూమేన్ మేనేజ్‌మెంట్ ఆఫ్ స్ట్రే క్యాటిల్ ఇన్ ఇండియా అనే పేరుతో రెండు పత్రాలను పంపించించింది. పట్టుకున్న వీధి కుక్కలను 20 చదరపు అడుగుల చొప్పున ఉన్న ఎన్‌క్లోజర్లలో ఉంచాలన్న ప్రతిపాదనపై సైతం పెటా తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది.
20 చదరపు అడుగులు అంటే మనుషులకు పేర్చే చితి పరిమాణంలోనే ఉంటుందని, ఈ బోనులో కుక్కలను బతికున్నంత కాలం ఉంచడం క్రూరత్వమే తప్ప, సమస్యకు పరిష్కారం అనిపించుకోదని అభ్యంతరం తెలిపింది. ఈ చర్య వాటిని నెమ్మదిగా చంపేందుకే తప్ప మరోటి కాదని పేర్కొంది. వీధి కుక్కలు, ఇతర జంతువులను పెద్ద ఎత్తున బంధించేందుకు ప్రభుత్వం తన వనరులను ఏనిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ) నిబంధనలు– 2023 నుంచి పక్కదారి పట్టించినట్లు అవుతుందని పెటా పేర్కొంది.
ఏబీసీ నిబంధనలు ప్రధానంగా కుక్కల సంతానోత్పత్తి నియంత్రణ, రేబిస్ టీకాలపై దృష్టి పెట్టాలని యంత్రాంగాలకు సూచిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 6.2 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయని, వీటిలో కనీసం కొన్నింటినైనా పట్టుకుని, బంధించి ఉంచేందుకు కూడా మన దగ్గర సరైన మౌలిక సదుపాయాలు, నిధులు లేవని పెటా ఇండియా ఎత్తి చూపింది. పరిమితికి మించి జంతువులను ఒకే చోట ఉంచడం వల్ల కేనైన్ డిస్టెంపర్, పార్వోవైరస్ వంటి అంటువ్యాధులు పెరగడమే కాకుండా, జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉందని సంస్థ హెచ్చరించింది.
అదేవిధంగా, వీధుల్లో సంచరించే జంతువుల సమస్యకు పెటా మూల కారణాలను వివరించింది. డైరీ ఫామ్‌ల యజమానులు అవసరం తీరిపోయాక ఆవులు, ఎద్దులను వీధుల్లో వదిలేయడమే ప్రధాన కారణమని పేర్కొంది. మగ దూడలను పుట్టగానే, ఆవులను పాలు ఇవ్వడం ఆగిపోగానే రోడ్లపై వదిలేస్తున్నారు. నిధుల్లేని గోశాలలు పెద్ద సంఖ్యలో ఉన్న వీధి పశువులను భరించలేవని తెలిపింది. ఈ ధోరణిని ఆపేందుకు గాను అక్రమ డైరీలపై కఠిన చర్యలు తీసుకోవాలంది. పశువులను వదిలేసే యజమానులకు జరిమానాలు విధించాలని, ప్రతి పశువు ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించేలా ఏర్పాట్లు ఉండాలని పెటా తెలిపింది.


