ప్రకృతి వైపరీత్యాలకు తక్షణమే స్పందించేలా తరీ్ఫదు
న్యూఢిల్లీ: దేశంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయాల్లో తక్షణమే స్పందించేలా లక్ష మంది నేషనల్ క్యాడెట్ కారప్స్(ఎన్‌సీసీ) క్యాడెట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఎన్‌సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స్ వెల్లడించారు. శిక్షణ పొందిన ఈ క్యాడెట్లను యువ ఆపద మిత్రలుగా పిలుస్తామని, వీరి వివరాలను నేషనల్ డేటా బేస్‌తో అనుసంధానం చేస్తామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి సేవలు అవసరమొచ్చినా దేశ వ్యాప్తంగా వీరిని ఉపయోగించుకునేందుకు అవకాశముంటుందని వీరేంద్ర వివరించారు.
అదేవిధంగా, డ్రోన్ వినియోగం, డ్రోన్లను అడ్డుకోవడం వంటి వాటిపైనా ఎంపిక చేసిన క్యాడెట్లకు తరీ్ఫదు ఇచ్చేఆలోచన ఉందన్నారు. ఈ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకుగాను దేశ వ్యాప్తంగా నాలుగైదు ప్రత్యేక హబ్‌లను ఏర్పాటు చేయనున్నామన్నారు. సైబర్ వారియర్లుగా మరో 10 వేల మంది క్యాడెట్లను తయారు చేసే యోచన సైతం ఉందన్నారు. సైబర్ రంగాన్ని ఆయుధం చేసుకుంటూ నేరగాళ్లు చెలరేగిపోతున్న వేళ దేశంలో డిజిటల్ భద్రతను కట్టుదిట్టం చేయడంలో వీరు సహకరించగలరని వివరించారు. మొట్టమొదటిసారిగా 2026 రిపబ్లిక్ డే పరేడ్‌లో ఎన్‌సీసీ కేడెట్ కంటింజెంట్ కమాండర్లు కత్తిని చేబూని కవాతులో పాల్గొంటారని వీరేంద్ర వత్స్ ప్రకటించారు.


