ఘర్షణ జరిగే చోట కరుణ చూపాలి
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
తథాగతుడి అవశేషాలు మన సాంస్కృతిక వారసత్వంలో భాగమని వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఇది యుద్ధాల యుగం కాదని.. బుద్ధుడి యుగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. మానవత్వాన్ని వ్యతిరేకించేవారిని ఓడించాలంటే శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. ఘర్షణ జరిగే చోట కరుణ చూపడం కావాలని తెలిపారు. ప్రాచీన బౌద్ధ అవశేషాల ప్రదర్శనను ప్రధానమంత్రి శనివారం ప్రారంభించారు. దక్షిణ ఢిల్లీలోని ఖిలా రాయ్ సాంస్కృతి కేంద్రంలో ఈ అరుదైన ప్రదర్శన ఏర్పాటైంది.
ఇందులో బుద్ధుడికి, బౌద్ధ మతానికి ప్రత్యక్షంగా సంబంధం ఉన్న పవిత్ర రత్నాలు, అస్థికలను ప్రదర్శిస్తున్నారు. 127 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సిద్ధార్థనగర్ జిల్లాలోని పిపరాహ్వా గ్రామంలో తవ్వకాల్లో ఈ అవశేషాలు బయటపడ్డాయి. ఇవి కేవలం కళాకృతులు మాత్రమే కాదని.. ఘన చరిత్ర కలిగిన మన సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగమని, మన నాగరికత నుంచి విడదీయలేని అంశమని ప్రధాని మోదీ చెప్పారు.
మన దేశంలో లభ్యమైన పిపరాహ్వా అవశేషాలు కొంతకాలం విదేశాలను కూడా చుట్టివచ్చాయని తెలిపారు. వియత్నాం, థాయ్‌లాండ్, రష్యా తదితర దేశాల్లో ప్రజలు వీటిని దర్శించుకొని భక్తి ప్రపత్తులు చాటుకున్నారని వెల్లడించారు. ఇతర దేశాలతో మన సంబంధాలు కేవలం రాజకీయాలు, దౌత్యం, ఆర్థిక రంగానికే పరిమితం కాలేదని.. బలమైన భావోద్వేగ, విశ్వాస, ఆధ్యాతి్మక సంబంధాలు కూడా ఉన్నాయని, బుద్ధ భగవానుడు అందించిన వారసత్వమే అందుకు కారణమని వివరించారు.
సారనాథ్ నా కర్మభూమి
బ్రిటిష్ వలస పాలన హయాంలో విదేశాలకు తరలిపోయిన పిపరాహ్వా అవశేషాలు 127 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వ కృషి వల్ల స్వదేశానికి చేరుకున్నా యని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఇందులో గోద్రెజ్ గ్రూప్ కృషి సైతం ఉందన్నారు. గత ఏడాది మే నెలలో హాంకాంగ్‌లో వేలం వేస్తుండగా, తాము అడ్డుకున్నామని తెలిపారు. తథాగతుడి అవశేషాల ను కాపాడుకోవడమే కాకుండా ఆయన ఆశయాలు, సంప్రదాయాలను సైతం ముందుకు తీసుకెళ్లడానికి మనం కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు.


