న్యాయవాదులు కక్షిదారుల పట్ల దయతో మెలగాలి
న్యాయ వ్యవస్థలో సహానుభూతి అత్యంత కీలకం
చాణక్య వర్సిటీ స్నాతకోత్సవంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వెల్లడి
పట్నా: న్యాయ వ్యవస్థలో సహానుభూతి అత్యంత కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. న్యాయం కోరి వచ్చినవారి పట్ల దయతో మెలగాలని అన్నారు. సమాజం మెరుగుపడాలంటే అవసరంలో ఉన్నవారికి కచ్చితంగా న్యాయం అందాలని స్పష్టంచేశారు. అవసరార్థుల పట్ల న్యాయ వ్యవస్థ మొగ్గుచూపాలని సూచించారు. శనివారం బిహార్ రాజధాని పట్నాలోని చాణక్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగించారు.
యువ న్యాయవాదులు కెరీర్‌ను నిర్మించుకొనే క్రమంలో సున్నితత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కోల్పోవద్దని పేర్కొ న్నారు. పూర్తిగా పనికి బానిసగా మారితేనే వృత్తిలో విజయం సాధిస్తామని చాలామంది యువ లాయర్లు నమ్ముతుంటారని తెలిపారు. చేసే పనే జీవితంగా మారిపోతే ఇతరుల సహానుభూతిని కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నారు. న్యాయం కోసం వచ్చిన కక్షిదారులకు దయతో సేవ చేయడమే పరిమావధి కావాలని న్యాయ వాదులకు కావాలని జస్టిస్ సూర్యకాంత్ పిలుపునిచ్చారు.
న్యాయం చేకూర్చడం పవిత్రమైన బాధ్యత
‘‘న్యాయం అనేది న్యాయాన్ని పొందగలిగే ఆర్థిక స్థోమత ఉన్నవారికి మాత్రమే కాకుండా.. న్యాయం తప్పనిసరిగా అవసరమైన వారికి కూడా సులువుగా అందాలి. కక్షిదారులకు న్యాయం చేకూర్చడానికి న్యాయవాదులు తమ శక్తియుక్తులు, నైపుణ్యాలు ఉపయోగించాలి. అదొక పవిత్రమైన బాధ్యత. ఇక్కడ నేర్చుకున్న న్యాయశాస్త్రాన్ని ప్రజలు మేలు చేసేలా మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సమాజంలో పేద, అణగారిన వర్గాలకు కొన్ని సందర్భాల్లో న్యాయం దక్కడం లేదు. అలాంటివారి కోసం న్యాయ వ్యవస్థ పనిచేయాలి. ఎవరికి న్యాయం అవసరమో వారికి న్యాయం అందించడం కర్తవ్యం కావాలి.
లిటిగేషన్, ప్రజాసేవ, విద్యా రంగం, జ్యుడీషియల్ సర్వీసు.. ఇలా ఏ మార్గంలో నడిచినా సరే న్యాయ వ్యవస్థ పరిరక్షణకు కృషి చేయాలి. ప్రజల్లో విశ్వాసం పెంచేలా చిత్తశుద్ధితో పని చేయాలి. గొంతు విప్పలేని అసహా యకులకు గొంతుకగా మారడానికి నైపు ణ్యాలు ఉపయోగిస్తే వారి గౌరవాన్ని కూడా పెంచినట్లు అవుతుంది. చదుకున్న చదు వుకు సార్థకత లభిస్తుంది’’ అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పట్నా హైకోర్టు ప్రాంగణంలో ఏడు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు జస్టిస్‌సూర్యకాంత్ పునాది రాయి వేశారు. ఇందులో ఆడిటోరియం, ఐటీ బిల్డింగ్, పరిపాలన భవనం, బహుళ అంతస్తుల కారు పార్కింగ్, ఆసుపత్రి వంటివి ఉన్నాయి.
సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాలి
దేశంలో సైబర్‌నేరాలు నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్నాయని జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తంచేశారు. సామాన్య ప్రజలు.. ముఖ్యంగా వృద్ధులు కోట్ల రూపాయలు పోగోట్టుకుంటున్నారని చెప్పారు. ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జస్టిస్ సూర్యకాంత్ శనివారం పట్నా శివారులోని పొతాహీలో బిహార్ జ్యుడీషియల్ అకాడమీ నూతన క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... డిజిటల్ అరెస్టు గురించి గతంలో ఎప్పుడూ వినలేదని, ప్రస్తుతం అలాంటి చూడాల్సి వస్తోందని అన్నారు.
రాత్రి, పగలు అనే తేడా లేకుండా సైబర్ నేరగాళ్లు ప్రజలను బెదిరించి, సొమ్ము లూటీ చేస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం న్యాయ వ్యవస్థ ఎదుట ఉన్న అతిపెద్ద సవాలు ఇదేనని పేర్కొన్నారు. సైబర్ నేరాల కారణంగా మన దేశంలో జనం వేలాది కోట్ల రూపాయలు కోల్పోవడం తనకు షాక్‌కు గురి చేసిందని చెప్పారు. వృద్ధులకు సరైన అవగాహన లేకపోవడంతో ఎక్కువగా నష్టపోతున్నారని గుర్తుచేశారు. ఆధునిక కాలంలో కొత్త కొత్త సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి, సైబర్ నేరాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు నైపుణ్యాలు పెంచుకోవాలని, అందుకోసం శిక్షణ పొందాలని జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల ఆకాంక్షలు పెరుగుతున్నాయని, అందుకు తగ్గట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు.


