
సుప్రీం కోర్టులో సోమవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఓ లాయర్ దాడికి ప్రయత్నించబోయాడు(Attack On CJI Gavai). అది గమనించిన తోటి లాయర్లు.. అతన్ని నిలువరించి పోలీసులకు అప్పగించారు.
మొన్నీమధ్యే.. ఖజురహో ఆలయ సముదాయంలోని జవారీ ఆలయంలో ధ్వంసమైన విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సీజేఐ గవాయ్ కొట్టేశారు. అయితే తీర్పు సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ వర్గం నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యింది తెలిసిందే. ఈ తరుణంలో..
ఇవాళ ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో.. లాయర్ ఒకరు ఆయనపైకి షూ విసిరే ప్రయత్నం చేయబోయారు(Shoe Attack On Justice BR Gavai). అయితే అది సీజేఐ బెంచ్ దాకా వెళ్లకుండా కింద పడిపోయింది. ఆ సమయంలో ‘‘సనాతన ధర్మాన్ని అవమానిస్తే దేశం సహించబోదు’’ అంటూ నినాదం చేశాడు. అయితే తోటి లాయర్లు అతన్ని అడ్డుకుని.. కోర్టు సిబ్బందికి అప్పగించారు.
ఈ పరిణామం నుంచి వెంటనే తేరుకున్న జస్టిస్ బీఆర్ గవాయ్.. ‘‘ఇలాంటి చర్యలు తననేం చేయబోవని, వాదనలు కొనసాగించాలి’’ అని కేసు వాదిస్తున్న లాయర్లకు సూచించారు. దాడికి పాల్పడిన లాయర్ పేరు కిషోర్ దాస్‌గా తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దాడికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఛాతర్‌పూర్‌జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ప్రఖ్యాత ఖజురహో ఆలయ సముదాయంలోని జవారీ ఆలయంలో ఏడడుగుల విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసమైంది. ఈ విగ్రహాన్ని పక్కనబెట్టి కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించేలా ఆదేశాలు ఇవ్వాలని(Khajuraho Vishnu idol case) రాకేశ్ దలాల్ అనే వ్యక్తి ఈ పిల్ వేశారు. ఈ పిల్ స్వీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రనల్ ధర్మాసనం పరిశీలించింది.
సెప్టెంబర్ 17వ తేదీన విచారణ సమయంలో.. ‘‘ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు. పబ్లిసిటీ ప్రయోజన వ్యాజ్యం. ఇందులో మేం చేసేది ఏం లేదు. భారత పురతత్వ విభాగం(ఏఎస్‌ఐ) పరిధిలో ఆలయం ఉంది. వాళ్లనే అభ్యర్థించండి. లేదంటే మీరెలాగూ విష్ణుమూర్తికి పరమభక్తుడిని అని చెబుతున్నారుగా. ఆయననే వేడుకోండి. శైవత్వానికి మీరు వ్యతిరేకులు కాకపోతే అదే ఖజురహోలో అతిపెద్ద శివలింగం ఉంది. అక్కడ కూడా మీరు విన్నవించుకోవచ్చు. విగ్రహ పునరుద్ధరణ, పునర్‌నిర్మాణంపై ఏఎస్‌ఐ తుది నిర్ణయం తీసుకుంటుంది’’ అని సీజేఐ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు.

అయితే సీజేఐ బీఆర్ గవాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఒక వర్గం మనోభావాలు దెబ్బ తీసేలా ఆయన మాట్లాడారంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిపింది. అంతేకాదు.. ఆయన్ని అభిశంసించాలంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెట్టారు. అయితే తన వ్యాఖ్యలపై బీఆర్ గవాయ్ తర్వాత స్పందించారు.
సెప్టెంబర్ 18వ తేదీన ఓ కేసు విచారణ సందర్భంగా.. నేను అన్ని మతాలను గౌరవిస్తాను(I respect all religions). నా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం అయ్యాయి అని ఆయన అన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ కూడా గవాయ్‌కు మద్దతుగా.. సోషల్ మీడియా అనేది కళ్లెం లేని గుర్రంలాంటిదని, దానిని అదుపు చేయడం కష్టమని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: పార్లమెంట్ కాదు.. రాజ్యాంగమే సర్వోన్నతం