
సాక్షి,తాడేపల్లి: సనాతన ధర్మం ముసుగులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితుడిని కఠినంగా శిక్షించి న్యాయ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగేలా చూడాలని శింగనమల నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ డిమాండ్ చేశారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా దళితులను చిన్నచూపు చూస్తూనే ఉన్నారని, ఉన్నత స్థానంలో ఉంటే ఇప్పటికీ కొందరు చూసి ఓర్చలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం ముసుగులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ మీద కోర్టు హాల్‌లో ఒక లాయర్ షూ విసరడానికి ప్రయత్నించడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు.
న్యాయాధిపతిగా దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి మీద జాత్యహంకారంతో దాడి చేయాలని చూడటం క్షమించరాని తప్పుగా చూడాలన్నారు. దీన్ని దేశప్రజలంతా తీవ్రంగా ఖండించాలని చెప్పారు. ఉన్నత స్థానంలో ఉన్న సుప్రీం చీఫ్ జస్టిస్ మీదనే దాడి చేయడానికి ప్రయత్నించారంటే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదని మాజీ మంత్రి శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలను తగ్గించి చూపించే ప్రయత్నం చేయడం దేశానికి అంత మంచిది కూడా కాదని ఆయన అభిప్రాయపడ్డారు. భాష, ప్రాంతం, కులం, మతం పేరుతో ఇతరులపై దాడి చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.