
విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తున్న సుప్రీంకోర్టు సీజే గవాయ్, జస్టిస్ పీఎస్.నరసింహ, హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్‌పాల్, సీఎం రేవంత్‌రెడ్డి
న్యాయవాద వృత్తిలో నైపుణ్యం, సృజనకే ప్రాధాన్యం
స్నేహితులు, కుటుంబం, పుస్తకాలు, అభిరుచులు, ఆరోగ్యం, ఊహ..
జీవితంలో వీటికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వాలి
నల్సార్ స్నాతకోత్సవంలో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్
పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, జస్టిస్ శ్రీనరసింహ, జస్టిస్ సుజోయ్‌పాల్
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద వృత్తిలో నైపుణ్యంతోపాటు సృజనాత్మకత అవసరమని, అవి పాటించినవారే ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు. వర్ణ వివక్ష, సామాజిక వివక్షపై పోరాడిన న్యాయవాదుల వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని యువ న్యాయవాదులకు పిలుపునిచ్చారు. న్యాయవాద వృత్తిలో అడ్డంకులుంటాయని, వాటిని అధిగమించి ముందుకు సాగాలని సూచించారు.
న్యాయవ్యవస్థలో విశ్వాసం, నిబద్ధత, ప్రజా సేవకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్ షామీర్‌పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో 22వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ బీఆర్ గవాయ్, గౌరవ అతిథిగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, నల్సార్ చాన్స్‌లర్, రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీజేఐ పలుసూచనలు, సలహాలు ఇచ్చారు.
విదేశీ విద్యపై మోజు వద్దు..
‘నల్సార్ అంటే విద్యా నైపుణ్యం మాత్రమే కాదు.. చట్ట విలువల పట్ల దాని లోతైన నిబద్ధత. దేశంలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఇతర సంస్థల కంటే మెరుగ్గా ప్రమాణాలు పాటిస్తున్నాయి. కొత్త ప్రపంచం, సాంకేతిక పరిణామాలకు ప్రతిస్పందనగా వృత్తి అభివృద్ధి చెందుతున్నా.. ఇంకా బలమైన పునాదులు అవసరం. సహచరుల ఒత్తిడి కారణంగా విదేశీ విద్యపై మోజు పెంచుకోవద్దు. అంతర్జాతీయ అర్హతతోనే ఎదుగుదల సాధ్యమన్నది అవాస్తవం.
దేశంలో నాణ్యమైన విద్యకు కొదవలేదు. కొందరు ఆర్థిక భారమైనా విదేశాలకు వెళ్లాలని భావించడం సరికాదు. అది ఆ కుటుంబాలను అప్పుల్లో మునిగేలా చేస్తుంది. ఎల్‌ఎల్‌బీతోనే ఆగిపోకుండా ఎల్‌ఎల్‌ఎం సహా ఉన్నత చదువులపై దృష్టి సారించాలి. కోర్టు, కక్షిదారుల ముందు న్యాయవాదులు తమను తాము నిరూపించుకునేందుకు నిరంతరం కష్టపడాలి. న్యాయస్థానం ఇచ్చే తీర్పులపై అవగాహన పెంపొందించుకోవాలి. అప్పుడే సమర్థవంతమైన న్యాయవాదిగా నిలబడగలుగుతారు’ అని సూచించారు.

విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తున్న సుప్రీంకోర్టు సీజే గవాయ్, జస్టిస్ పీఎస్.నరసింహ, హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్‌పాల్, సీఎం రేవంత్‌రెడ్డి
నిబద్ధతతో ముందుకు సాగాలి..
విద్యా నైపుణ్యం, రాజ్యాంగ విలువలు, సమ్మిళిత వృద్ధికి నల్సార్ కట్టుబడి ఉందని వర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద ప్రత్యేక కోర్టుల ఆధునీకరణపై కేంద్రంతో కలిసి పని చేశామని చెప్పారు. డిగ్రీలు అందుకుని వెళ్తున్న విద్యార్థులు నిబద్ధతతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా డిగ్రీలు పూర్తి చేసుకున్న పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంబీఏ, ఎంఏ (పన్ను చట్టాలు), ఎంఏ (క్రిమినల్ జస్టిస్ మేనేజ్‌మెంట్), బీఏ ఎల్‌ఎల్‌బీ(హానర్స్), బీబీఏ (హానర్స్), బీబీఏ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ విద్యార్థులకు పట్టాలను అందజేశారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జస్టిస్ బీఆర్ గవాయ్, రేవంత్‌రెడ్డి పసిడి పతకాలు ప్రదానం చేశారు. అత్యధికంగా ఇషికా గార్గ్ 8, ఖండేకర్ సుకృత్ శైలేంద్ర 7, అర్చిత సతీశ్ 6 పతకాలు సాధించారు. రెండు వీసీ మెడల్స్‌తో కలిపి మొత్తం 58 బంగారు పతాకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శామ్‌కోషి, జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నరసింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి, వర్సిటీ రిజి్రస్టార్ కె. విద్యుల్లతారెడ్డి, కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత శాఖ కార్యదర్శి అమిత్ యాదవ్ (ఐఏఎస్) తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా సీజేఐతో సీఎం రేవంత్‌రెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
ఏఐతో సత్వర న్యాయం సాధ్యమే..
‘ఏటా న్యాయవాద విద్యలోకి వచ్చే వారు పెరుగుతున్నారు. అయితే, వృత్తిలో నైపుణ్యం పెంచుకున్నవారే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. దేశానికి ఉత్తమ న్యాయవాదుల అవసరం ఎంతో ఉంది. మనదేశం ఎదుర్కొంటున్న చట్టపరమైన సవాళ్లకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. న్యాయవ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించాల్సిన సమయం ఆసన్నమైంది. సరై న పద్ధతిలో ఉపయోగిస్తే సత్వర న్యాయం అందించేందుకు దోహదం చేస్తుంది. స్నేహితులు, కుటుంబం, పుస్తకాలు, అభిరుచులు, ఆరోగ్యం, ఊహ.. ఈ ఐదు అంశాలు ఎప్పు డూ చెక్కుచెదరకుండా చూసుకోవాలి’అని ఉద్బోధించారు.