పరిశీలనలో నూతన నియామకాలు, ఆరోగ్యశ్రీ వైద్యసౌకర్యం, డబుల్ బెడ్రూం ఇళ్లు
హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: నూతన హోంగార్డుల నియామకాల ప్రతిపాదన, వారికి రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సౌక ర్యం, అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇళ్ల కేటా యింపు వంటి అంశాలు తమ పరిశీలనలో ఉన్నా యని డీజీపీ బి.శివధర్‌రెడ్డి అన్నారు. హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న హోంగార్డులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హోంగార్డులు తమ సమస్యలను తనకు నేరుగా తెలియజేసేందుకు వీలుగా పోలీసు అధికారులు వారితో మాట్లాడి ఆయా అంశాలను క్రోడీకరించి తన కార్యాలయానికి పంపాలని యూనిట్ అధికారులను ఆదేశించారు.
డీజీపీ కార్యాలయంలో పని చేస్తున్న హోంగార్డులతో ఈ సందర్భంగా తన కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీనియర్ హోంగార్డులతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, రాష్ట్ర పోలీస్ శాఖలో హోంగార్డులు ప్రధాన పాత్రను పోషిస్తున్నారని, పెద్దగా ప్రతిఫలం ఆశించకుండా వారు కీలక సేవలందిస్తున్నారని కొనియాడారు. తాను ఉద్యోగంలో చేరినప్పటితో పోలిస్తే ప్రస్తుతం హోంగార్డుల పరిస్థితి మెరుగ్గా ఉందని, పోలీస్ శాఖకు వారు వెన్నెముకగా ఉన్నారని ప్రశంసించారు.
హోంగార్డులకు సంబంధించిన కొన్ని విషయాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, కారుణ్య నియామకాలకు సంబంధించిన అంశం త్వరలో పరిష్కరించాల్సి ఉందన్నారు. హోంగార్డులకు లైఫ్ ఇన్సూరెన్స్ చేసేందుకు కొన్ని బ్యాంకులు ముందుకు వస్తున్నాయని, ఆయా బ్యాంకు అధికారులతో తాను ఇప్పటికే చర్చించానని పేర్కొన్నారు. ప్రభుత్వ పరిశీలనలో ఉన్న అంశాలలో హోంగార్డులు త్వరలో శుభవార్తను వింటారని ఆశిస్తున్నానని శివధర్‌రెడ్డి అన్నారు.
హోంగార్డ్స్ అడిషనల్ డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికే హోంగార్డులకు వివిధ సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని తెలిపారు. 15,075 రెయిన్ కోట్స్, 4,700 ఉలెన్ జాకెట్స్ ఇటీవల హోంగార్డులకు అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో శాంతి భద్రతల అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హా, ఐజీలు చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్ ఎం.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


