శనివారం 144 సర్వీసుల రద్దుతో చిక్కుకుపోయిన వేలాది మంది బాధితులు
ఎటుచూసినా ప్రయాణికుల నిరీక్షణతో రైల్వే స్టేషన్‌ను తలపించిన వైనం
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని విమానయాన సంస్థ
ఎన్ని గంటలు నిరీక్షించాలంటూ సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం
కనెక్టింగ్ ఫ్లైట్ల ద్వారా వెళ్లే ప్రయాణికులకు లగేజీని సైతం ఇవ్వని వైనం
మంచినీళ్లు, ఆహారం కోసం ఫుడ్ కోర్టుల ముందు నిరీక్షణ
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: దేశీయ విమానయాన రంగంలో గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్న ఇండిగో సంస్థ వ్యవహారశైలి కారణంగా శంషాబాద్ నుంచి అత్యవసర పనుల కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. శనివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించాల్సిన ఇండిగో విమానాల్లో ఏకంగా 144 (రాత్రి పదింటి వరకు) సరీ్వసులు రద్దయ్యాయి.
శంషాబాద్ విమానాశ్రయం మీదుగా ఇండిగో సగటున రోజుకు 196 సర్వీసులు నడుపుతుండగా అందులో మూడొంతులు రద్దయ్యాయి. ఆయా సర్వీసులను నడిపే పరిస్థితి లేదని ముందే తెలిసినప్పటికీ ఇండిగో సంస్థ ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రత్యామ్నాయ విమానం ఉందా? మళ్లీ సర్వీసును ఎప్పుడు ఏర్పాటు చేస్తారు.. అసలు సర్వీసు ఉంటుందా, టికెట్ డబ్బులు తిరిగిస్తారా.. లాంటి వివరాలు చెప్పేవారు కరువయ్యారు. ఇక వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్ ప్రయాణికుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది.
హైదరాబాద్ వరకు వచ్చాక కనెక్టింగ్ ఫ్లైట్లు రద్దయ్యాయని తెలుసుకొని వారు కంగుతిన్నారు. దీంతో తమను గమ్యం ఎప్పుడు చేరుస్తారో, అందుకు తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలేంటో చెప్పేవారు లేక గంటల తరబడి విమానాశ్రయంలోనే ఉండిపోయారు. కనీసం లగేజీని కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో రోడ్డు లేదా రైల్లో గమ్యం చేరుకోవాలనుకున్నా కుదరని పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో విమానాల రద్దుతో వేల మంది ప్రయాణికులు అక్కడే ఉండిపోవటంతో శనివారం శంషాబాద్ విమానాశ్రయం రైల్వే స్టేషన్‌ను తలపించింది.

భోజనం, ఉపహారం ఏర్పాట్లు కూడా లేవు..
విమాన సర్వీసులను ఉన్నట్టుండి రద్దు చేస్తే ప్రయాణికులకు భోజనం, ఉపహారం, టీ, మంచినీటిని ఎయిర్‌లైన్స్ సంస్థలు సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ ఇండిగో దీన్ని కూడా పట్టించుకోలేదు. అసలే భారీ ధరలుండే విమానాశ్రయంలోని లాంజ్‌లో తాజా పరిస్థితితో ధరలు మరింత పెరిగాయి. టీ, టిఫిన్, భోజనానికి ఒక్కో ప్రయాణికుడు సుమారు రూ. 2 వేల వరకు ఖర్చు చేయాల్సి వచి్చంది. పైగా చాంతాడంత క్యూను దాటుకుంటే తప్ప తిండి దొరకని దుస్థితి నెలకొంది. తుపాను బాధితుల తరహాలో తిండి కోసం ప్రయాణికులు అల్లాడాల్సి వచి్చంది. ఎయిర్‌పోర్టు అధికారులు సరఫరా చేసిన మంచినీరు, స్నాక్స్ కొందరికే అందాయి. ప్రయాణికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నా ఇండిగో సిబ్బంది సమాధానం చెప్పడానికి అందుబాటులో లేకుండా పోవడం గమనార్హం.
కన్నీళ్లకూ విలువ లేదాయే..
విమానాలు రద్దయి ప్రయాణాలు ఆలస్యం అవడంతో సాధారణ ప్రయాణికులు ఎదురుచూపులతో ఇబ్బందులకు గురవగా కొందరి మానసిక స్థితిని చూసి తోటి ప్రయాణికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు చనిపోయారని తెలిసి అత్యవసరంగా ఇళ్లకు బయలుదేరిన వారు విమానాలు లేక దుఃఖాన్ని దిగమింగుకోలేక బోరున విలపించిన తీరు అక్కడి వారిని చలింపజేసింది.
అయ్యప్ప భక్తుల ఆందోళన
శబరిమలై యాత్రకు బయలుదేరిన అయ్యప్ప భక్తులకు సైతం ఇబ్బందులు తప్పలేదు. తలపై ఇరుముడితో శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న భక్తులు.. ఇండిగో సరీ్వసులు రద్దయ్యాయని తెలిసి ఆందోళనకు దిగారు. తమకు సరైన సమాచారం కూడా ఇవ్వడం లేదంటూ ఇండిగో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలోనూ ప్రయాణికులకు ‘ఇండిగో’ కష్టాలు
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఎయిర్‌పోర్టుల్లోనూ శనివారం ఇండిగో విమాన సరీ్వసుల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విశాఖలో 9 ఇండిగో విమానాలు రద్దవగా విజయవాడలో ఒకటి, రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో ఒకటి, తిరుమతిలో మరొకటి ఇండిగో విమానం సరీ్వసులు రద్దయ్యాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కడప, విశాఖపట్నం సరీ్వసులు గంట నుంచి రెండు గంటల వరకు అలస్యంగా నడిచాయి.
➤‘అమ్మ చనిపోయింది.. అర్జంటుగా భువనేశ్వర్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుంటే విమానం రద్దయింది. అమ్మను కడసారి చూడగలనో లేదో’అంటూ ఓ యువతికంటతడి!
➤‘ముంబైలో రేపు బ్యాంకు ఇంటర్వ్యూ ఉంది. బయలుదేరదామనుకుంటే విమానం లేదు. ఫ్లైట్ ఎప్పుడో చెప్పడం లేదు’అని ఓ యువకుడి ఆవేదన!
➤‘కనెక్టింగ్ ఫ్లైట్‌లో హైదరాబాద్ వస్తే ఇక్కడి నుంచి కూడా ఫ్లైట్ లేదు.. లగేజీ కూడా సమయానికి ఇవ్వట్లేదు’అంటూ ఓ డాక్టర్ ఆగ్రహం.
➤తండ్రి అస్తికలు గంగా నదిలో నిమజ్జనం చేసేందుకు వస్తే విమానం రద్దయింది. చేతిలో అస్తికలు.. ఊళ్లో పితృ కార్యక్రమం.. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు’ అని అన్నదమ్ముల ఆందోళన.
ఇలాంటి మనసు పిండేసే గాథలెన్నో.. బరువెక్కిన మనసులతో మసులుతున్న వారెందరో. కానీ ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్వాకంతో ఇలాంటి వారి ఆవేదనను పట్టించుకునే వారు లేకుండా పోయారు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ నుంచి కనీస సమాచారానికి కూడా దిక్కులేని దుస్థితి నెలకొంది.
అక్కడ విమానం రద్దయిందని
కనెక్టింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుంటే.. రాజమండ్రి నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా. అది రద్దు కా వడంతో ఇండిగోను వాకబు చేయగా హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్ బుక్ చేసుకోమన్నారు. అలా బుక్ చేసుకుని హైదరాబాద్ వచ్చాక ఇక్కడి నుంచి ఢిల్లీ కనెక్టింగ్ ఫ్లైట్ రద్దయిందని చెప్పారు. పోనీ రైల్లో వెళదామనుకుంటే లగేజీని ఇవ్వలేదు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటి? – డాక్టర్ దీపక్ (ఢిల్లీ ప్రయాణికుడు)
సమాచారం చెప్పకుంటే ఎలా..
నేను రెండు కార్యక్రమాల్లో పా ల్గొనేందుకు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చా. తిరుగు ప్రయాణ విమానం రద్దయింది. ఆ విషయం విమానాశ్రయానికి వచ్చాక చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమిటంటే ఎవరూ సమాధానం చెప్పట్లేదు. విమానాశ్రయంలో ఎన్ని గంటలు ఎదురుచూసినా సమాచారం కాదు కదా.. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. – సౌమ్య మిశ్రా (భువనేశ్వర్ ప్రయాణికురాలు)
త్వరగా చక్కదిద్దాలి
బ్యాంకుకు సంబంధించిన రెండు రోజుల శిక్షణ కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చా. శిక్షణ పూర్తి చేసుకుని తిరుగుప్రయాణం కోసం ఎయిర్‌పోర్టుకు రాగా విమానం రద్దయిందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సరైన స్పందన లేదు. ఇక్కడ ఎంత సేపు ఎదురుచూడాలో, రాత్రి ఎక్కడ ఉండాలో తెలియని వింత పరిస్థితి నెలకొంది. – రవీందర్ శర్మ, బ్యాంకు ఉద్యోగి


