గాల్లో విన్యాసాలు చేసిన రేసర్స్
విన్యాసాలను తిలకించిన సీఎం రేవంత్, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్
గచ్చిబౌలి స్టేడియంలో హోరెత్తించిన యువత
గచ్చిబౌలి (హైదరాబాద్): ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఇండియన్ సూపర్‌రేసింగ్ లీగ్ క్రీడా ప్రియులను అబ్బురపరిచింది. పోటీల్లో పాల్గొన్న అంతర్జాతీయ రేసర్స్ గాల్లో చేసిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మెరుపు వేగంతో దూసుకెళ్లిన బైకర్లు అందరినీ ఆశ్చర్య పరిచారు. శనివారం రాత్రి గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడి యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, ఐఎస్‌ఆర్‌ఎల్ ఆధ్వర్యంలో ఇండియన్ సూపర్ క్రాస్‌రేసింగ్ లీగ్ రౌండ్–2 పోటీ లను బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ప్రారంభించారు.

450 సీసీ, 250 సీసీ ఇంటర్నేషనల్, ఇండియా–ఏసియా మిక్సింగ్ విభా గాల్లో రేసర్లు పోటీ పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, సల్మాన్‌ఖాన్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రేసర్ల విన్యాసాలను తిలకించారు. 40 నిమిషాల పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ బైక్ రేసింగ్‌ను చూస్తూ గడిపారు. దాదాపు 48 మంది జాతీయ, అంతర్జాతీయ రేసర్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. స్టేడియంలో బైకర్ల విన్యాసాలకు ప్రత్యేకంగా టర్ఫ్‌ను ఏర్పాటు చేశారు. మ్యూజిక్, లేజర్ షో వీక్షకులను ఆకట్టుకుంది.


