4,147 సర్పంచ్ పదవులకు 27,277... 36,342 వార్డులకు 89,603 మంది నామినేషన్లు
11 సర్పంచ్ స్థానాలు, 100 వార్డులకు నామినేషన్లు నిల్
సాక్షి, హైదరాబాద్: మూడో విడతలో 4,158 సర్పంచ్‌లు, 36,442 వార్డులకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే 11 చోట్ల సర్పంచ్ పదవులకు ఆయా జిల్లాల్లో 100 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని 158 సర్పంచ్ పదవులకు ఎన్నికలు నోటిఫై చేయగా ఆరు చోట్ల, 1,364 వార్డులకు 44 చోట్ల అభ్యర్థులెవరూ నామినేషన్ వేయలేదు. కొమురంభీం జిల్లాలో రెండు సర్పంచ్, 6 వార్డుల్లో నామినేషన్లు, ఖమ్మం జిల్లాలో ఒక సర్పంచ్, 9 వార్డులకు నామినేషషన్లు పడలేదు.
వీటిని మినహాయించగా, 4,147 సర్పంచ్ పదవులకు 27,277 నామినేషన్లు, 36,342 వార్డులకు 89,603 నామినేషన్లను అభ్యర్థులు సమర్పించారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే మూడోవిడతలో ఒక్కో సర్పంచ్ స్థానానికి ఆరున్నర మంది పోటీపడుతున్నారు. వార్డుల విషయానికొస్తే పోటీ కొంత తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.
మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు గ్రామపంచాయతీల్లోని నోటీస్ బోర్డుల్లో ప్రదర్శిస్తారు. ఈ విడతలోనూ అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 269 సర్పంచ్ పదవులకు ఎన్నికలు నోటిఫై చేయగా 1,962 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇదే జిల్లాలోని 2,206 వార్డులకు 5,606 మంది నామినేషన్లు సమర్పించారు.
ముగిసిన రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ
ఈ నెల 14న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 4,332 సర్పంచ్ పదవులకు 28,278 నామినేషన్లు, 38,342 వార్డులకు 93,595 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణల గడువు ముగిసింది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఇంకా పూర్తిస్పష్టత రాలేదు.
ఉపసంహరణలు ముగిశాక ఈ విడతలో ఏకగ్రీవమైన సర్పంచ్ పదవులు, వార్డులకు సంబంధించిన సమీక్ష నిమిత్తం జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) సమయం ఇచ్చింది. ఈ ఉపసంహరణలు ప్రలోభాలు, బెదిరింపులు, ఇతర ఒత్తిళ్లు లేకుండా జరిగాయా లేదా అని నిర్ధారించుకున్న తర్వాతే ఏకగ్రీవాలను ప్రకటించనున్నారు. దీంతో ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు సభ్యుల సంఖ్య, వివరాలు ఆదివారమే వెల్లడవుతాయని ‘సాక్షి’కి ఎస్‌ఈసీ అధికారులు వెల్లడించారు.


