గణపతి, బస్వరాజు సెక్యూరిటీ వింగ్‌లో పనిచేసిన కోవాసి భీమా
కొద్దినెలల క్రితం లొంగిపోయిన మావోయిస్టు నేత
దండకారణ్యం నుంచి సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: హిడ్మా స్వగ్రామమైన పువ్వర్తికి 3 కిలోమీటర్ల దూరాన ఉన్న భట్టిగూడేనికి చెందిన కోవాసి భీమా అలియాస్ బాబు మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్లుగా కొనసాగిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజుకు సెక్యూరిటీ గార్డుగా 12 ఏళ్లపాటు పనిచేశాడు. అనారోగ్య కారణాల రీత్యా ఇటీవల లొంగిపోయాడు. ఈ సందర్భంగా భీమాను ‘సాక్షి ప్రతినిధి’కలవగా మావోయిస్టుగా గెరిల్లా జీవితం, అటు ప్రభుత్వ పాలసీలను దగ్గర నుంచి చూశానని వెల్లడించాడు. ప్రస్తుత పరిస్థితులపై ఆయన వెల్లడించిన వివరాలు భీమా మాటల్లోనే...
‘సుప్రీం లీడర్’రక్షణ బాధ్యతల్లో
పీఎల్‌జీఏ కంపెనీ–7లోకి నన్ను 2012లో తీసుకున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీకి రక్షణ కల్పించే బాధ్యత ఈ కంపెనీదే. అక్కడ ప్రెస్, మెడికల్ టీమ్‌ల్లో పనిచేశా. రెండుసార్లు ప్రత్యక్షంగా గణపతి దాదాను కలిసే అవకాశం కలిగింది. బీఆర్ దాదా(నంబాల)తో చాలాసార్లు మాట్లాడాను.
అనారోగ్య సమస్యలు రావడంతో ఈ ఏడాది జనవరిలో నన్ను కంపెనీ–7 నుంచి తప్పించి వేరే బాధ్యతలు అప్పగించారు. కానీ ఆరోగ్యం మరింతగా విషమించడంతో మే మొదటివారంలో ఆయుధాలు పార్టీకి అప్పగించి లొంగిపోయాను. జూన్‌లో నా లొంగుబాటును అధికారికంగా చూపించారు.
బీఆర్ దాదా చనిపోయినప్పుడు..
బీఆర్ దాదా ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు నేను పోలీసుల వద్దే ఉన్నాను. ఆ రోజంతా ఆ క్యాంపులో ఒకటే హడావుడి. ‘మీ కంపెనీ–7 మాకు చిక్కింది’అంటూ అక్కడి అధికారులు చెప్పారు. బీఆర్ దాదాకు బీపీ తప్పితే ఇతర అనారోగ్య సమస్యలు లేవు. కాకపోతే స్థూలకాయం వల్ల ఇబ్బంది పడేవాడు.
కగార్ వల్ల ఎప్పటికప్పుడు క్యాంపులు మారుస్తూ, కొండలు, గుట్టలు ఎక్కడం, దిగడంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకునేందుకు మూడు రోజుల పాటు కనీస విశ్రాంతి, తిండి, నీరు లేకుండా బీఆర్ దాదా శ్రమించాడు. కానీ ఘోరం జరిగిపోయింది.
తెలుగు వర్సెస్ ఆదివాసీలు
ఆపరేషన్ కగార్ వల్ల ఒక్కరోజు కూడా దళాలు సేఫ్‌గా క్యాంప్ వేసే పరిస్థితి లేదు. పదిమందితో దళం ఉంటే వేయి మంది జవాన్లు చుట్టుముడుతున్నారు. ఈ క్రమంలో పార్టీకి నష్టం జరిగినప్పుడు కచ్చితంగా చర్చ జరుగుతుంది. నిర్ణయాలను సమీక్షిస్తారు. పార్టీ భవిష్యత్ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై గందరోళ పరిస్థితులు ఎదురవుతున్నాయి. అంతే తప్ప తెలుగు నేతలు, ఛత్తీస్‌గఢ్ ఆదివాసీలు అనే భేదం పార్టీలో లేదు.
ఒకప్పుడు ఇక్కడ పార్టీ బలంగా ఉండేది. హిడ్మా నాయకత్వంలో ఒక బెటాలియన్, 12 కంపెనీలతో కూడిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఉండేది. వీటికి సాయుధ దళాలు అదనం. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. కగార్‌తో పార్టీ చాలా బలహీనపడింది.
దాదాలు (నక్సలైట్లు) వచ్చాకే మా జీవితాలు మారాయి. భూమిని పంచారు. వ్యవసాయం నేర్పారు, మంచినీళ్ల కోసం బావులు, చెరువులు తవ్వించారు. మూడు నుంచి నాలుగు నెలల పాటు ‘గెరిల్లా’లకు డాక్టర్ల చేత శిక్షణ ఇప్పించారు. ఈ శిక్షణ ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేసింది. ఐదు వందలకు పైగా బడులు తెరిచారు. ఇప్పుడు మా ప్రాంతంలో అభివృద్ధి పేరుతో నాలుగు వరుసల రహదారులు నిర్మిస్తున్నారు. ఇక్కడి ప్రజలకు కనీసం సైకిల్ కూడా ఉండదు. అలాంటప్పుడు ఇంత పెద్ద రోడ్లు ఎందుకు నిర్మిస్తున్నారు. వాటి వల్ల ఎవరికి ప్రయోజనం అనేది బుద్ధి జీవులే ఆలోచించాలి. – కోవాసి భీమా


