
యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్ నుంచి ప్రతిభావంతులు బయటకు రావాలి
సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆకాంక్ష
శ్రీనగర్: యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు బయటకు రావాలని, దేశ అభివృద్ధికి, జమ్మూకశ్మీర్ అభివృద్ధికి వారు పాటుపడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఆకాంక్షించారు. ఆయన ఆదివారం శ్రీనగర్‌లో యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ప్రసంగించారు.
పూర్వ విద్యార్థుల అనుభవం, పరిజ్ఞానం నేటి యువతకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. పెద్దలు చొరవ తీసుకుంటే నేటి విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆ దిశగా సేవలందించాలని పూర్వ విద్యార్థులకు పిలుపునిచ్చారు. యువతకు మెరుగైన భవిష్యత్తు అందించడానికి రోడ్‌మ్యాప్ రూపొందించాలన్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ అత్యున్నత నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను దేశానికి అందిస్తున్న సంపూర్ణ విశ్వాసం తనకు ఉందని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.
కాశ్మీర్ నిజంగా భూమిపై స్వర్గమేనని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే ఇది ఎంతో అందమైన ప్రాంతమని పేర్కొన్నారు. మనం స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చామన్నారు. ఈ యూనివర్సిటీలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నారని ప్రశంసించారు. యూనివర్సిటీ పూర్వ విద్యారి్థ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ను జస్టిస్ గవాయ్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.