వక్ఫ్‌ సవరణ చట్టం: ఐదేళ్ల నిబంధన కుదరదు  | Supreme Court stays key provisions of the Waqf Amendment Act 2025 | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ సవరణ చట్టం: ఐదేళ్ల నిబంధన కుదరదు 

Sep 16 2025 5:41 AM | Updated on Sep 16 2025 6:53 AM

Supreme Court stays key provisions of the Waqf Amendment Act 2025
  • వక్ఫ్‌ సవరణ చట్టంలోని కీలక సెక్షన్లపై స్టే విధింపు 
  • వక్ఫ్‌కు ఆస్తి ఇవ్వాలంటే  ఐదేళ్లుగా ఇస్లాంను పాటించాలనే నిబంధనపై సుప్రీంకోర్టు స్టే 
  • వక్ఫ్‌ ఆస్తుల ఖరారులో కలెక్టర్‌ విచక్షణాధికారాల నిలుపుదల 
  • వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతర సభ్యుల సంఖ్యకు పరిమితి విధింపు 
  • వక్ఫ్‌ సవరణ చట్టం మొత్తాన్నీ నిలుపుదలచేయడం కుదరదన్న కోర్టు 
  • కొన్ని ప్రొవిజన్లకు రక్షణ ఉండాలని అభిప్రాయపడ్డ ధర్మాసనం  
  • కోర్టు నిర్ణయాన్ని స్వాగతించిన పలు ముస్లిం సంఘాలు

న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదంగా తయారైన వక్ఫ్‌(సవరణ) చట్టం–2025 విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సోమవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చట్టంలోని ఒక ముఖ్యమైన నిబంధనపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసిహ్‌ల ధర్మాసనం 128 పేజీల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఒక వ్యక్తి తన ఆస్తిని వక్ఫ్‌ కోసం దానంగా ఇవ్వడం వంటికి చేయాలంటే కనీసం గత ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తూ ఉండాలన్న నిబంధనపై అభ్యంతరం వ్యక్తంచేసింది. 

ఈ మేరకు వక్ఫ్‌(సవరణ) చట్టంలోని సంబంధిత నిబంధనపై స్టే విధించింది. ‘‘ ఐదేళ్లుగా ఇస్లామ్‌ను పాటించాలి అనే నిబంధనలో స్పష్టత కరువైంది. సంపూర్ణ నిర్వచనంతో, సమగ్రస్థాయిలో ఈ అంశంపై స్పష్టత వచ్చేలా నిబంధనలు తయారుచేసేవరకు ఈ ప్రొవిజన్‌ అమలును నిలిపేస్తున్నాం. ఏదైనా చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందనే భావిస్తాం. కేవలం అరుదైన కేసుల్లో అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే జోక్యం చేసుకోవడం సబబు. వక్ఫ్‌ చట్టంలోని అన్ని నిబంధనల అమలుపై స్టే విధించాలన్న వాదనల్లో పసలేదు. 

అందుకే మొత్తం చట్టంపై స్టే విధించట్లేము. అయితే ఇరుపక్షాల వాదనలు విన్నాక రెండువైపులా సమతుల న్యాయం దక్కాలని చూస్తున్నాం. అందుకే వక్ఫ్‌ ఆస్తుల స్థితిని కలెక్టర్‌ మార్చే అధికారం అమలుకాకుండా స్టే విధిస్తున్నాం. అలాగే వక్ఫ్‌ బోర్డ్‌లలో ముస్లిమేతర సభ్యుల అంశంపై కలెక్టర్‌ నిర్ణయాలు తీసుకోకుండా స్టే విధిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు, ‘‘చాన్నాళ్లుగా వక్ఫ్‌ భూమిగా చెలామణి అయినంతమాత్రాన అది వక్ఫ్‌ భూమి కాబోదు. ప్రభుత్వ భూమి అయినాకూడా వక్ఫ్‌ ఆస్తిగా చెలామణిలో ఉన్నంత మాత్రాన అది వక్ఫ్‌ ఆస్తికాబోదు. వక్ఫ్‌ బై యూజర్‌ నిబంధన తొలగింపు సబబే’’ అని ధర్మాసనం మోదీ సర్కార్‌ చర్యను సమరి్థంచడం గమనార్హం. 

నాలుగు.. మూడుకు మించకూడదు 
‘‘ కేంద్ర వక్ఫ్‌ మండలిలో ముస్లిమేతర సభ్యుల సంఖ్య నాలుగుకు మించకూడదు. మొత్తం సభ్యుల సంఖ్య 20 దాటకూడదు. అలాగే రాష్ట్రాల్లో వక్ఫ్‌ బోర్డ్‌లలో ముస్లిమేతర సభ్యుల సంఖ్య మూడుకు మించకూడదు. మొత్తం సభ్యుల సంఖ్య 11 దాటకూడదు. కనీసం ఐదేళ్లుగా ఒక వ్యక్తి ఇస్లాంను ఆచరిస్తున్నట్లు నిర్ధారించే కచ్చితమైన నిబంధనావళిని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించేదాకా ‘వక్ఫ్‌కు ఆస్తి ఇవ్వాలంటే ఐదేళ్లుగా ఇస్లాంను పాటించాలి’ అనే సెక్షన్‌3 లోని (ట) క్లాజుపై స్టే విధిస్తున్నాం.

 సంబంధిత అధికారి తన నివేదికను సమరి్పంచేదాకా ఏదైనా ఆస్తి ‘వక్ఫ్‌ ఆస్తి’ అని కొత్తగా ప్రకటించడానికి వీల్లేదు. ఏదైనా ఆస్తి ఒకవేళ ప్రభుత్వ ఆస్తి అయి ఉండవచ్చని ఆ అధికారి భావిస్తే ఆ మేరకు రెవిన్యూ రికార్డుల్లో సవరణ చేయొచ్చు, ఈ అంశాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలి అనే నిబంధనలపైనా స్టే విధిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. 

‘‘వక్ఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 3సీ కింద వక్ఫ్‌ ఆస్తిగా ప్రకటించని సందర్భంలో, ట్రిబ్యునల్‌ ఆదేశంతో సవరణ చట్టంలోని సెక్షన్‌ 83ని అమలుచేసి సందర్భంలో, హైకోర్టు తదుపరి ఆదేశం కోసం వేచి ఉన్న సందర్భాల్లో అలాంటి ఆస్తులను ఇక వక్ఫ్‌ ఆస్తులుగా ప్రకటించకూడదు, రెవెన్యూ రికార్డుల్లో నమోదుచేయకూడదు’’ అని నిబంధనలపైనా స్టే విధిస్తున్నాం’’అని కోర్టు స్పష్టంచేసింది. వివాదాస్పద ఆస్తి ఎవరికి చెందుతుంది అనేది ట్రిబ్యునళ్లు, హైకోర్టుల్లో తేలేదాకా ఆ ఆస్తులపై మూడో పక్షానికి హక్కులు దఖలుపర్చకూడదు అని కోర్టు ఆదేశించింది. 

ముస్లింల వర్గానికి ఎక్స్‌–అఫీషియో కార్యదర్శిగా సేవలందించే చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ నియామానికి బాటలు వేసే సెక్షన్‌ 23పై కోర్టు ఎలాంటి స్టే విధించలేదు. చట్టంలో పేర్కొన్న ప్రకారం వక్ఫ్‌ అనేది ముస్లింలు ఇచ్చే విరాళం, దానం. తమ భూములు, స్థిరాస్థులను దాతృత్వ, మత సంబంధ కార్యక్రమాల కోసం దానం(వక్ఫ్‌)గా ఇవ్వొచ్చు. ఈ భూముల్లో మసీదులు, పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రజాసంస్థలు ఏర్పాటుచేసుకోవచ్చు. వక్ఫ్‌గా మారిన ఆస్తిని ఇతరులకు విక్రయించకూడదు, ఇంకొకరికి బహుమతిగా ఇవ్వకూడదు, వారసత్వంగా పొందకూడదు, ఆక్రమించకూడదు. 

వక్ఫ్‌ బై యూజర్‌ తొలగింపులో వివాదం లేదు 
‘‘ పెద్ద మొత్తంలో ప్రభుత్వభూములు ఆక్రమణకు గురై చాన్నాళ్లుగా వక్ఫ్‌ వినియోగంలో ఉన్నాయి. నిరాటంకంగా వక్ఫ్‌ అ«దీనంలో ఉంటే అవి వక్ఫ్‌ బై యూజర్‌ నిబంధన ప్రకారం వక్ఫ్‌ ఆస్తులుగా మారుతున్నాయి. ఇది తప్పు అని భావించి ఈ నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ఈ తొలగింపులో ఎలాంటి వివాదం లేదు’’ అని సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు.

స్వాగతించిన కాంగ్రెస్‌ 
‘‘కీలక సెక్షన్లను నిలుపుదల చేస్తూ కోర్టు ఇచి్చన తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ ఉత్తర్వు రాజ్యాంగ విలువలైన న్యాయం, సమానత్వ, సౌభ్రాతృత్వం గెలుపునకు నిదర్శనం. వాస్తవిక వక్ఫ్‌ చట్టాన్ని కాలరాస్తూ మోదీ సర్కార్‌ తీసుకొచి్చన తప్పుడు సవరణలను తొలగించేలా తుది తీర్పు వెలువడుతుందని ఆశిస్తున్నాం’’ అని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌చేశారు. ‘‘ భారత్‌లో ఎప్పుడూ సద్దుమణిగిన అంశాలను మోదీ సర్కార్‌ ఎగదోస్తోంది. విద్వేషాలను పెంచేందుకు ఈ విభజన చట్టాన్ని బుల్డోజర్‌లా తీసుకొచి్చంది’’ అని అన్నారు.  

చాలావరకు ఆమోదించినట్లే: బీజేపీ
‘‘మేం తెచి్చన సవరణలను కోర్టు ఆమోదించింది. మొత్తం చట్టంపై స్టే విధించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టంచేసింది. అంటే మెజారిటీ చట్టం చట్టబద్ధంగా ఉందని కోర్టే స్పష్టంచేసినట్లయింది. వక్ఫ్‌ బై యూజర్‌ మాటున ఇకపై వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణ అనేది ఇకపై ఆగుతుంది. కోర్టు నిర్ణయాలను మేం కూడా స్వాగతిస్తున్నాం’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నళిన్‌ కోహ్లీ చెప్పారు.  

మధ్యంతర ఉత్తర్వులోని కీలకాంశాలు 
→ ఐదేళ్లుగా ఇస్లాంను పాటిస్తున్న వ్యక్తి మాత్రమే వక్ఫ్‌(దానం) ఇవ్వాలన్న సెక్షన్‌ 3(1)(ట)ను నిలుపుదల చేసింది

→ ఐదేళ్లుగా ఇస్లాంలో కొనసాగుతున్నారో లేదో తేల్చే నిబంధనలు రూపొందేదాకా సెక్షన్‌ 3(1)(ట)పై స్టే అమలు

→ సంబంధిత ఆఫీసర్‌ నివేదించాడన్న ఒకే ఒక్క కారణంగా వక్ఫ్‌ ఆస్తిని వక్ఫ్‌కాని ఆస్తిగా పనిగణించకూడదు

→ అలాంటి నివేదికలను ఆధారంగా చేసుకుని వక్ఫ్‌ రికార్డులతోపాటు ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో సవరణలు చేయకూడదు

→ హైకోర్టు ఆదేశాల మేరకు వివాదాస్పద ఆస్తులపై సెక్షన్‌ 83 కింద వక్ఫ్‌ ట్రిబ్యునళ్లు ఇచ్చే నిర్ణయాలు అమలయ్యేలోపు వక్ఫ్‌ బోర్డ్‌లు ఎలాంటి ఆస్తులను తమ ఆస్తులుగా, తమవికాని ఆస్తులుగా ప్రకటించకూడదు

→ సీఈవోగా నియమించబోయే వ్యక్తిని వీలైనంత వరకు ముస్లిం వర్గం నుంచే ఎంపికచేయాలి

→ ఇవన్నీ మధ్యంతర ఉత్తర్వులే. ఈ ఉత్తర్వులు ఇచి్చనంత మాత్రాన సవరణ చట్టం చట్టబద్ధతపై తమ తమ వాదనలను ఇరుపక్షాలు వాదించే అవకాశం లేదని భావించకూడదు.

ముస్లిం సంస్థల హర్షం
 వక్ఫ్‌ సవరణచట్టంలో ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న కీలక నిబంధనల అమలుపై కోర్టు స్టే విధంచడంతో ముస్లిం సంఘాలు ఆనందం వ్యక్తంచేశాయి. తుది తీర్పు సైతం ముస్లింలకు అనుకూలంగా రావాలని ఆశాభావం వ్యక్తంచేశాయి. ‘‘ ఈ మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం’’ అని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌(ఏఐఎంపీఎల్‌బీ) ఒక ప్రకటనలో పేర్కొంది. కొన్ని నిబంధనలకు బదులు మొత్తం సవరణ చట్టాన్నే రద్దుచేయాలని ఆలిండియా షియా పర్సనల్‌ లా బోర్డ్‌(ఏఐఎస్‌పీఎల్‌బీ) ఆశాభావం వ్యక్తంచేసింది. ‘‘ఐదేళ్లుగా ఇస్లాంను పాటిస్తేనే వక్ఫ్‌ అనే నిబంధనపై స్టే విధించడం పెద్ద ఊరట. ఇక వక్ఫ్‌ బోర్డ్‌లో ముస్లిమేతర సభ్యుని అంశం అలాగే ఉండిపోయింది’’అని ఏఐఎంపీఎల్‌బీ కార్యనిర్వాహక సభ్యుడు ఖలీద్‌ రషీద్‌ ఫరాంగీ మహాలీ అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement