
ఢిల్లీకి మాత్రమే పరిమితం కారాదు: సీజేఐ
న్యూఢిల్లీ: బాణసంచా వినియోగంపై దేశ రాజధాని ఢిల్లీ(ఎన్‌సీఆర్)లో మాత్రమే ప్రత్యేకంగా నిషేధం ఎందుకు విధించాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలోని కొందరు ధనవంతులు మాత్రమే స్వచ్ఛమైన గాలికి అర్హులా? దేశంలోని ప్రజలంతా స్వచ్ఛమైన గాలి పీల్చుకునేందుకు అర్హులేనని పేర్కొంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని ధర్మాసనం శుక్రవారం దేశ రాజధాని ప్రాంతంలో బాణసంచా వినియోగాన్ని నియంత్రించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది.
‘ఎన్‌సీఆర్ పరిధిలోని నగరాల్లో ప్రజలకు మాత్రమే పరిశుభ్రమైన గాలికి అర్హులా? మిగతా నగరాల్లోని పౌరులకు ఎందుకు కారు? ఇక్కడ ఎలాంటి విధానముందో దేశవ్యాప్తంగానూ అదే ఉండాలి. ఉన్నత పౌరులుంటున్నారనే కారణంతో ఢిల్లీకి ప్రత్యేకంగా ఒక విధానాన్ని రూపొందించలేం. గత శీతాకాలంలో అమృతసర్ వెళ్లాను. గాలి కాలుష్యం అక్కడ ఢిల్లీ కంటే దారుణంగా ఉంది. బాణసంచాపై నిషేధమే విధించాల్సి వస్తే, అది దేశమంతటా ఉండాలి’అని సీజేఐ పేర్కొన్నారు.
కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్ క్రాకర్స్‌ను తక్కువ రసాయనాలను వినియోగించి రూపొందించే విధానంపై నేషనల్ ఎని్వరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(నీరి) కసత్తు చేస్తోందని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం బాణసంచా తయారీ, విక్రయాల లైసెన్సులపై యథాతథ పరిస్థితిని కొనసాగించాలని పేర్కొన్న ధర్మాసనం..తదుపరి విచారణను 22వ తేదీకి వాయిదా వేసింది.